ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు..ఛీఛీ!
సారీతో సరిపోయే వ్యాఖ్యలా అవి.. సంస్కారహీనం!
అత్యున్నతస్థాయి పదవిలో ఉన్నవారిని గౌరవించాలి. వారి విషయంలో మనం వాడే భాష సంస్కారవంతంగా ఉండాలి. కానీ బురదలో దొర్లాడే పందులకు పన్నీరు వాసన పడదన్నట్లు మన నాయకులకు ఆ సంస్కారం ఒంటబట్టదు. ఓ మాట తూలేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. తర్వాత కడిగేసుకుందామని అడుసు తొక్కేసే నేతలకు విలువల గురించి చెప్పడం కూడా అవనసరమే. రాజకీయంగా వంద నిందలేసుకోవచ్చు. వేల విమర్శలు చేసుకోవచ్చు. కానీ రాష్ట్రపతిమీద నోరు పారేసుకోవాల్సిన అవసరం ఏముందని! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముపై వెకిలి వ్యాఖ్యలు చేశాడు పశ్చిమబెంగాల్ మంత్రి అఖిల్ గిరి. చివరికి స్వయానా బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ క్షమాపణలు కోరినా దుమారం సద్దుమణగలేదు.
విలువల్లేని ఆ మంత్రిని పదవినుంచి తప్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నందిగ్రామ్‌లో జరిగిన ఓ సమావేశంలో మంత్రి అఖిల్‌గిరి నోరుజారారు. తాను అందంగా లేనని బీజేపీవాళ్లు అంటున్నారంటూ ఎవరినీ రూపాన్ని బట్టి అంచనావేయకూడదన్నారు. అంతవరకు బానే ఉంది. అక్కడితో ఆగితే నాయకుడు ఎందుకవుతాడు. మనం రాష్ట్రపతి పదవిని గౌరవిస్తాం కానీ ఆమె చూడటానికి ఎలా ఉంటారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అందంతో సంబంధం లేకుండా రాష్ట్రపతిని మనం గౌరవించడం లేదా అన్నది శ్రీమాన్ అఖిల్‌గిరి చెప్పిన భాష్యం. ఆయన వాగుడు తాలూకు 17 సెకెన్ల వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీనిమీద రచ్చకావటంతో నా ఉద్దేశం రాష్ట్రపతిని అవమానించాలని కాదంటూ ఆ మంత్రి సారీ చెప్పినా ఎవరూ శాంతించలేదు. రాష్ట్రపతి అంటే అపారమైన గౌరవం ఉందంటూ మమతా బెనర్జీ క్షమాపణ కోరాల్సి వచ్చింది. కానీ మంత్రి ఉద్వాసనకు డిమాండ్ పెరుగుతోంది. అఖిల్ గిరికి వ్యతిరేకంగా ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
గిరిజనమహిళ రాష్ట్రపతి హోదాలో ఉన్నందుకు అంతా గర్వించాలి. కానీ ముర్ముమీద కొందరు నోరుపారేసుకుంటూ వస్తున్నారు. అత్యున్నత పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చోబెట్టారని, ఆమె రాష్ట్రపతి కాదు రాష్ట్రపత్ని అంటూ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు ఉభయసభలను అట్టుడికించాయి. ఆ నాయకుడు చెంపలేసుకున్నా, కాంగ్రెస్ అధినేత్రి వివరణ ఇచ్చినా కొన్నాళ్లు ఆ వేడి చల్లారలేదు. ఆమె రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నప్పుడు విగ్రహం అవసరం లేదని తేజస్వియాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. వర్మ కూడా మన ఖర్మకొద్దీ తలదూర్చాడు. ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరంటూ కామెంట్ చేశారు. మహిళలను గౌరవించే సమాజంలో ఇలాంటి మరుగ్గుజ్జు మనస్తత్వాలుండటం మన దౌర్భాగ్యం.