చికెన్ తో పోటీ పడుతున్న టమాట జనాల్ని బెంబేలెత్తిస్తున్న ధరల మోత

By KTV Telugu On 23 May, 2022
image

నిన్న మొన్నటివరకు ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధర నించ తేరుకోకముందే సామాన్యుడిపై మరో పిడుగు పడింది.. కొద్ది రోజులుగా పెరుగుతున్న టమాట రేట్ దాదాపు రూ. 100కి దగ్గర్లోకి వచ్చేసింది. నెల క్రితం వరకు కనీసం రూ.10 అయినా లేని కిలో ధర ప్రస్తుతం రూ. 80కి చేరింది.

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి

వేసవి ఎండలకు టమాట ఉత్పత్తి చాలా తగ్గింది. సాధారణం కంటే టెంపరేచర్ బాగా పెరగడంతో పూత రాక దిగుబడడి తగ్గింది. దీనికి తోడు పంట చేతికొచ్చే సమయాల్లో అకాల వర్షాలు, ఈదురు గాలులకు పంటకు మరింత నష్టం జరిగింది. దీంతో హోల్‌సేల్‌ వ్యాపారులు దూర ప్రాంతాల నుంచి టమాటాని తెప్పించి విక్రయిస్తున్నారు. గతంలో సమీప ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన టమాట ప్రస్తుతం అనంతపురం, మహారాష్ట్రల నుంచి హైదరాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి రిటైల్‌ వ్యాపారులకు చేరుతోంది. దీంతో ఈ కూరగాయ రేటు మరింత పెరుగుతోంది.

షెడ్ నెట్లలో టమాట సాగు

కొన్ని ప్రాంతాల్లో షేడ్‌ నెట్లు వేసి రైతులు టమాటను సాగు చేస్తున్నారు. ఇక్కడ పంట దిగుబడి బాగానే వస్తోంది. కాకపోతే మెయింటెన్స్ ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయి. అందుకే రేట్ దిగిరావడం లేదు. ఈ పద్ధతిని మిగతా ప్రాంతాల్లో కూడా ఫాలో అయితే సమస్య కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఈ షెడ్ నెట్ అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి రాలేదు.

తగ్గిన కొనుగోళ్లు

టమాట ధర పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. గతంలో రోజుకు 300 కేజీలు విక్రయిస్తే ప్రస్తుతం 100 నుంచి 15 కేజీల వరకూ సేల్ అవుతున్నాయి.

ప్రస్తుతం జంట నగరాల్లో ఉన్న మెండా మార్కెట్, బోయిపల్లి వంటి హోల్‌సేల్ మార్కెట్లతో పాటు మెహదీపట్నం, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, ఎల్‌బినగర్, వనస్థలిపురం వంటి రైతు బజార్లలోనూ టమాట కొరత ఎక్కువగానే ఉంది. సాధారణ రోజుల్లో నగరానికి 80 నుంచి 100 లారీల టమాట దిగుమతి అవుతుంటే.. ప్రస్తుతం రోజుకు 50 లారీల రావడం కూడా కష్టంగా మారింది.

హొల్ సేల్ మార్కెట్‌లోనే కిలో టమాట రూ.50 నుంచి 55 పలుకుతోంది.. మార్కెట్లలో రూ.80 వరకూ ధర ఉంది. ఇక చిన్నా చితక దుకాణాల్లో ఆల్రడీ వందకి చేరింది.

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి

ఏపీలో కూడా టమాటా ధరలు కొండెక్కాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్టయిన మదనపల్లె మార్కెట్లో కిలో టమాటా రూ. 60కి చేరితే ఇది వినియోగదారుల వద్దకు చేరేసరికి 88 దాటింది.

ఒకవైపు పెట్రోల్ ధరలు సెంచరీ దాటి పోగా.. చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు పోటీగా టమాటా కూడా సెంచరీ కొట్టబోతోంది.

సాధారణంగా ఏ కూర వండాలన్నా టమాట మిక్స్ చేస్తారు. ఫ్రైలు ఆరోగ్యానికి అంత మంచిది కాదంటూ టమాట వేయడం ద్వారా కర్రీకి మంచి రుచి వస్తుంది. ప్రస్తుత ధర చూసి బెంబేలెత్తిపోతున్న జనం టమాట పేరు చెప్తేనే వణికిపోతున్నారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఒకసారి ఆనియన్స్, మరోసారి టమాట.. ఇలా ఒక్కోసారి ఒక్కో ఐటం ధర పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలపై ఈ నిత్యావసర వస్తువుల ధర పెరుగుదుల భారం ఎక్కువగా పడుతూ ఉంటుంది. రేట్లు ఇలా పెరగకుండా ప్రభుత్వం ఏదైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ధరల్ని కంట్రోల్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.