పొలిటికల్ వరిలో కొత్త మలుపు

By KTV Telugu On 15 July, 2022
image

ముఖ్యమంత్రి కేసీఆర్… రైతుల కోసం కొత్త పథకాన్ని తీసుకురానున్నారా ? ఇప్పటికే దీనిపై కసరత్తు మొదలు పెట్టారా ? వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ తో పాటు రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ సంప్రదింపులు జరిపారా ? జరుగుతున్న పరిణామాలన్నీ… అలాగే కనిపిస్తున్నాయ్.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు, ముఖ్యమంత్రులను కలిశారు. తన భవిష్యత్ కార్యాచరణను వివరించారు. అదే సమయంలో అన్నదాతల కోసం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, బీకేఎస్ నేత రాకేశ్ టికాయత్ తో కేసీఆర్ చర్చించినట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయ్.  కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న గులాబీ బాస్… రైతు ఎజెండా గురించి విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది.

రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్…. కర్షకులను కష్టాలు, అప్పుల ఊబిలో పడకుండా… కొత్త పథకాలకు సిద్ధమవుతున్నారు. 60 ఏళ్ల పైబడిన వారికి పింఛన్లు ఇస్తున్నట్లే… రైతులకు కూడా ఇచ్చేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పింఛన్ తో పాటు మరి కొన్ని పథకాలు… అన్నదాతల కోసం ప్రకటించాలని డిసైడ్ అయ్యారు.

తెలంగా ప్రభుత్వం సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు తీసుకొచ్చింది. ఎకరాకు ఐదు వేలు చొప్పున… ఏడాదికి రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో జమా చేస్తోంది. 68 లక్షల మంది అర్హులైన అన్నదాతలకు… ఇప్పటి వరకు 60వేల కోట్ల రూపాయలకుపైగా పంపిణీ చేసింది. వ్యవసాయ అనుబంధ సంస్థల ద్వారా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీన్ని భవిష్యత్ లో మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

జాతీయ రాజకీయాలపై వడివడిగా అడుగులు వేస్తున్న కేసీఆర్… తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశానికి రోల్ మోడల్ గా చూపించాలని భావిస్తున్నారు. ఇక్కడి పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేలా… కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు… రైతు సంఘాల నేతలతో విడతల వారీగా చర్చలు జరుపుతున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని… ప్రాణాలు కోల్పోయిన అన్నదాతల కుటుంబాలకు భారీ సాయం అందించారు కేసీఆర్. భవిష్యత్ లో కొత్త పథకాలు ప్రవేశపెట్టి… రైతులకు మరింత దగ్గరవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నారు.