వైసీపీ ఎమ్మెల్యేలతోనూ బేరాలు జరిగాయా?

By KTV Telugu On 4 November, 2022
image

తెలంగాణ తర్వాత ఏపీనే..బయటపెట్టిన కేసీఆర్

ఏపీని కుదిపేస్తోన్న ఎమ్మెల్యేల ప్రలోభాల ఎపిసోడ్
ఏపీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందా?
లేక ప్రతిపక్ష టీడీపీని బీజేపీ టార్గెట్ చేసిందా?
ఎన్టీఆర్ కు దగ్గరవడం వెనుక బీజేపీ వ్యూహమేంటి?

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బయటకొస్తున్న ఆడియో, వీడియోలు ఏపీ రాజకీయాలనూ కుదుపేస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికకు ముందు బయటపడిన ఆడియో టేపు పెను ప్రకంపనలే సృష్టించగా ఇక, పోలింగ్ ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్ తెరపైకి తెచ్చిన ఓ వీడియో ఆంధ్రా రాజకీయాలను షేక్ చేసేలా ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగ్గురు నిందితులు జరిపిన సంభాషణల వీడియోలను సీఎం కేసీఆర్ విడుదల చేసారు. అందులో 70 నిమిషాల వీడియోలో రామచంద్ర భారతి, సింహయాజీ తాము గతంలో ఏఏ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు చేసిందీ ఎక్కడెక్కడ ప్రభుత్వాలు పడగొట్టిందీ వివరించారు. ఢిల్లీ ప్రతినిథులుగా చెప్పుకున్న ఆ ముగ్గురు పదే పదే బీజేపీ అగ్రనేతల పేర్లు ప్రస్తావించడం ఆడియో, వీడియోలో ఉంది. ప్రస్తుతం తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్ లను వారు టార్గెట్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. అంతేకాదు, తెలంగాణ తర్వాత ఏపీ అంటూ సింహయాజీ చెప్పడం సంచలనంగా మారింది. ఏపీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందా? లేక ప్రతిపక్ష టీడీపీని చీల్చే ప్రయత్నమా? ఇదే అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది

ఇటీవల కాలంలో కేశినేని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. సీఎం రమేష్ లాంటి షిండేలు తెలుగు దేశం పార్టీని చీల్చేస్తారంటూ కేశినేని బాంబ్ పేల్చారు. 2024 ఎన్నికల తరువాత టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినా సీఎం రమేష్ ద్వారా ఆపరేషన్ జరుగుతుందని, మహారాష్ట్రలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. ఏపీ బీజేపీ నేతలు సైతం పదే పదే తెలుగు దేశం పార్టీ పనైందని ఆరోపిస్తున్నారు. ఏపీలో అధికార వైసీపీని కాకుండా టీడీపీని టార్గెట్ చేయడం వెనుక పెద్ద ప్లానే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఈ అనుమానం మరింత రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని టచ్ చేయలేమని భావించిన కమలనాథులు ప్రతిపక్ష టీడీపీని బలహీనపర్చి ఆ స్థానాన్ని భర్తీ చేయాలనే వ్యూహంతో ఉన్నారట. 2029 ఎన్నికల నాటికి వైసీపీని కూడా టార్గెట్ చేసి ఏపీలో పాగా వేయాలన్నది బీజేపీ ప్లాన్ అయి ఉండొచ్చనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రతీ ఎన్నికల్లోనూ ఓటమి పాలవుతూ వస్తోంది. ఆ పార్టీని రాజకీయంగా, ఆర్థికంగా బలహీనపర్చే వ్యూహాలతో జగన్ వెళ్తున్నారు. వైసీపీతో సన్నిహితంగా మెలుగుతున్న బీజేపీ కూడా టీడీపీ టార్గెట్ గా వెళ్తోంది. దాంతో, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే మొదటికే మోసమని గుర్తించిన చంద్రబాబు, పవన్ కు దగ్గరైనట్లు తెలుస్తోంది. అయితే, 2014 ఎన్నికల్లో మాదిరి 2024 ఎన్నికల్లోనూ టీడీపీ,జనసేనలతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని కమలనాథులు భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల వరకు టీడీపీకి మద్దతు ఇచ్చి ఎక్కువ సీట్లు వస్తే అప్పుడు పార్టీని చీల్చే ఎత్తుగడలో కమలనాథులు ఉన్నారనే విశ్లేషణలు సాగుతున్నాయి. బాబుకు చెక్ పెట్టేందుకే, జూనియర్ ఎన్టీఆర్ కు బీజేపీ దగ్గరవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ను ముందు పెట్టి, టీడీపీలో చీలిక తీసుకొచ్చి ఆ తర్వాత ఏపీని ఏలేయాలనే లెక్కల్లో మోడీ-షాలున్నాట్లు పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. ఎమ్మెల్యేల ప్రలోభాల ఎపిసోడ్ లో అరెస్టైన సింహయాజీది ఏపీనే. ఆయన ద్వారా ఆంధ్రాలో బీజేపీ రాజకీయం నడపాలనుకుందా? అనే చర్చ జరుగుతోంది. అయితే, ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. మరి, దీనిపై వైసీపీ, టీడీపీ నేతల రియాక్షన్ ఏవిధంగా ఉంటుందో చూడాలి.