కమలనాథుల పై గర్జించిన శివంగి

By KTV Telugu On 5 May, 2022
image

పులి కడుపున పులే పుడుతుంటారు. తెలంగాణ పులి కడుపున మాత్రం సివంగి పుట్టింది. సివంగి అవసమైనప్పుడు, అవసరానికి తగ్గట్టుగానే గర్జిస్తుందని నిరూపించింది. సివంగి గర్జనకు అడవి జంతువులు వణికిపోవాల్సిందేనని, చెల్లాచెదురై పోవాల్సిందేనని ప్రత్యేకంగా చెప్పాలా. తెలంగాణ సివంగి గర్జిస్తే కూడా అదే జరుగుతోంది. కల్వకుంట్ల కవిత .. సంధించిన ప్రశ్నలకు బీజేపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు… ఇప్పుడు మూకుమ్మడి మాటల దాడి చేసినా అది వృధా ప్రయాసే అవుతుంది..

బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఆమెకు బాగా కోపం వచ్చింది. లాగి కొడదామంటే సంస్కారం అడ్డొచ్చింది. పసుపు బోర్డు తీసుకొస్తారా లేదా అని నిలదీస్తూ బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ కళ్లలో పుసుపు కొట్టారు. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమిటి? నిజామాబాద్ కు అరవింద్ ఒరిగించిందేమిటి.. గెలిచిన వెంటనే పసుపుబోర్డు తెస్తానని హామీ ఇచ్చి చేసిందేమిటి.. ఇలా కల్వకుంట కవిత మాటల తూటాలు పేలుస్తుంటే… లేచిందీ మహిళ లోకం అన్న పాత పాట గుర్తుకొస్తోంది…

ఆయన ధర్మపురి అరవిందా… అధర్మపురి అరవిందా.. అంటూ పుర్రె పగిలిపోయే ప్రశ్నలు సంధించారు కల్వకుంట్ల కవిత. ఢిల్లీలో మోకాలి యాత్ర చేస్తారో… ఢిల్లీ నాయకుల ముందు మోకరిల్లి పసుపు బోర్డు తెస్తారో.. త్వరగా తేల్చండి.. లేకపోతే గ్రామాల్లోకి రానివ్వబోమని కవిత తెగేసి చెప్పారు పసుపు బోర్డు కాకుండా స్పైస్ బోర్డు తీసుకురావడమేంటి.. దాన్ని ఒక అపార్టమెంట్లో పెట్టడమేమిటి. ఇదీ కవిత సూటి ప్రశ్న. పసుపుకు మద్దతు ధర ఇప్పిస్తామని చెప్పి.. చేసిందేమిటీ.. అంటూ రాకెట్ దాడి చేశారు… పార్లమెంటులో అర్వింద్ ఐదు సార్లు మాట్లాడారు.. అందులో ఒక్క సారి కూడా పసుపు బోర్డు గురించి మాట్లాడలేదని కవిత కడిగి పారేశారు. మాటలేగానీ చేతలుండవా అని గట్టిగా నిలదీశారు….

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు కోసం దశాబ్దాలుగా ఉద్యమం సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో పసుపు పండించే రైతులు ఎక్కువే. ఇక్కడ విక్రయాలకు అవకాశం లేక రైతులు మహారాష్ట్ర వెళ్తుంటారు. ఎన్నికల సమయంలో పసుపు బోర్డు వ్యవహారం తెరపైకి వస్తుంది తర్వాత మరుగున పడిపోతుంది. పార్ల‌మెంట్ సుమారు 190 మంది ప‌సుపు రైతులు నామినేష‌న్ వేశారు. దీంతో ప‌సుపు బోర్డు స‌మ‌స్య దేశ‌రాజ‌కీయ‌ల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే నిజామాబాద్ పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ధ‌ర్మ‌పురి అరవింద్… తనను ఎంపీగా గెలిపిస్తే ప‌సుపు బోర్డు తీసుకు వ‌స్తాన‌ని.. లేదంటే తన ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి పోరాటం చేస్తాన‌ని బాండ్ పేప‌ర్ పై రాసి మరీ ప‌సుపు రైతులకు ఇచ్చారు. అనుకున్న‌ట్టుగానే కేంద్రంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తే ప‌సుపు బోర్డు వ‌స్తుంద‌ని రైతులు బీజేపీకి ఓటు వేసి ధర్మపురి అరవింద్ ను ఎంపీగా గెలిపించారు. ముఖ్య‌మంత్రి కూతురు, సిట్టింగ్ ఎంపీ క‌విత‌పై అరవింద్ విజ‌యం సాధించారు.. అయితే ఎంపీగా గెలిచి మూడున్న యేళ్లు అవుతున్నా ప‌సుపు బోర్డు రాలేదు. అరవింద్ బోర్డు తీసుకు రాలేద‌ని ప‌సుపు రైతులు మండిపడుతున్నారు… అరవింద్ ను నిలదీయాలని తీర్మానించి ఎక్కడికక్కడ నిరసనలు నిర్వహిస్తున్నారు. ధాన్యం కొనుగోలు వ్యవహరంలో కూడా అరవింద్ పై రైతులు ఆగ్రహం చెందుతున్నారు. ధాన్యం తీసుకెళ్లి ఆయన ఇంటి ముందు పోసి నిరసన తెలియజేశారు.

కవిత మంచి స్పీకర్. జనాన్ని ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తారు. ఓటర్లకు కూడా ఆమె పట్ల విశ్వాసం ఉంది. చెప్పింది చేయడం.. చేసేదే చెప్పడం.. ఆమె అలవాట్లుగా స్థిరపడిపోయాయి. బతుకమ్మ వేడుకలైనా.. మహిళల కోసం చేపట్టే కార్యక్రమాలైనా ఆమె చిత్తశుద్ధితో ఆలోచించి ముందుకు సాగుతారు. గత లోక్ సభ ఎన్నికల్లో కేవలం పసుపు బోర్డు వివాదం కారణంగా బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో ఆమె ఓడిపోయారు. పసుపు బోర్డు వ్యవహారంతోనే మళ్లీ గెలవాలని కవిత తీర్మానించుకున్నారు. అందుకే మొదటి నుంచి అర్వింద్ చెప్పిన కల్లబొల్లి కబుర్లను ఆమె గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు నిజామాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో బీజేపీ శ్రేణులకు గట్టి షాకే ఇచ్చారు అంతం కాదిది ఆరంభం మాత్రమే అని కవిత అభిమానులు అంటున్నారు.. పిక్చర్ అభీ బాకీ హై అని గుర్తుచేస్తున్నారు…