టీఆర్ఎస్‌లో రాజ్యసభ రేస్..! అదృష్టవంతులు వీళ్లేనా ?

By KTV Telugu On 6 May, 2022
image

తెలంగాణలో రాజీనామా చేసిన బండ ప్రకాష్ స్థానంలో రాజ్యసభ స్థానం భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. వచ్చే నెలలో మరో రెండు స్థానాలు రానున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితిలో పదవుల కోసం పోరాటం ప్రారంభమయింది. ఒకరి తర్వాత ఒకరు కుల, మత, వర్గ సమీకరణాలతో పాటు సీనియార్టీతోనూ తమ ప్రయత్నాలు తాము ప్రారంభించారు. దీంతో కేసీఆర్ కు ఎంపిక క్లిష్టంగా మారింది. అయినా కేసీఆర్ మాత్రం ఈ సారి సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఆశావహులు 30 మందికిపైగానే !

రాష్ట్రంలో ప్రస్తుతం ఒక రాజ్యసభ స్థానం ఖాళీగా ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాశ్ డిసెంబర్ 2న రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఆ రాజ్యసభ స్థానానికి ఇంకా రెండున్నరేళ్ల గడువు ఉంది. అలాగే మరో రెండు స్థానాలకు జూన్ 22న పదవికాలం ముగియనుంది. ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌లో పదవీ విరమణ చేయనున్న వారిలో కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్‌లు ఉన్నారు. లక్ష్మికాంతరావు వయోభారంతో ఉన్నారు. డీఎస్ పార్టీకి దూరమయ్యారు. దీంతో ఈ రెండు స్థానాలకూ కొత్త వారిని ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం మూడుస్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను కేసీఆర్ కొద్ది రోజులుగా చేస్తున్నారు. మోత్కుపల్లి నర్సింహులు, దామోదర్ రావు, సీఎల్ రాజం, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతారాంనాయక్, వేణుగోపాలచారి, తుమ్మల నాగేశ్వర్ రావు, గ్యాదరి బాలమల్లు, సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌తో పాటు టీఆర్ఎస్ కీలక నేతలు గతంలో టికెట్ ఆశించిన భంగపడ్డ నేతలు రాజ్యసభకు వెళ్లాలని ఆశిస్తున్నారు.

మీడియా కోటాలో ఓ స్థానం !

టీఆర్ఎస్ మీడియా కోటాలో ఒకరికి రాజ్యసభ స్థానం ఖాయమని తెలుస్తోంది. మొన్నటిదాకా ఈ అంశంపై సీఎండీ దామోదర్ రావు పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఆ మీడియాను మొదట ప్రారంభించిన సీఎం రాజం పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో ఆయన కేసీఆర్‌కు దూరమయ్యారు. కానీ ఇటీవల యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవంలో సీఎం రాజాం సీఎంతో కనిపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎల్ రాజం కేసీఆర్‌కు సన్నిహితునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రికను ఆయనే స్థాపించారు. టీ న్యూస్ కూడా ఆయనదే. చాలా కాలం సీఎండీగా కొనసాగారు. సీఎం రాజంను కేసీఆర్ రాజ్యసభకు పంపుతారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఆ తర్వాత టీవీ, పత్రికల దామోదర్ రావు చేతికి వెల్లింది. సీఎల్ రాజం బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయన బీజేపీలో కూడా లేరని అనుకోవచ్చు. మీడియా కోటాలో రాజం లేదా దామోదర్ రావుల్లో ఒకరికి రాజ్యసభ సీటు ఖాయమని భావిస్తున్నారు.

ఆశగా చూస్తున్న ఉద్యమకారులు !

జాతీయ రాజకీయాలపై ప్రధాన దృష్టిసారించారు కేసీఆర్. దళితబంధును ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్రంలో అమలు చేస్తుండటంతో ఆ విషయాన్ని దేశమంతా ప్రచారం చేసేందుకు ప్రధాన ఆస్త్రంగా ఉపయోగపడేలా దళితులకు ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకే మోత్కుపల్లి నర్సింహులు ఆశలు పెట్టుకున్నారు. రాజ్యసభకు ఎంపిక చేసేవారు తెలంగాణ గళాన్ని బలంగా వినిపించేలా, అండగా నిలిచేలా ఉన్న నేతలు, రాజకీయాలపై పట్టుండి, మాట్లాడేవారిని ఎంపిక చేయాలని పరిశీలిస్తున్నారు. గతంలో ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరినవారికి, ఉద్యమ సమయం నుంచి పనిచేసిన వారికి రాజ్యసభ స్థానం ఇస్తామని హామీ ఇవ్వడంతో తమకంటే తమకే వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.