వచ్చే ఏడాది బతుకమ్మ నాటికి సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత జైలుకుళ్లడం ఖాయం అన్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఆయన అట్టహాసంగా నామినేషన్ వేశారు. వేలాది మంది బీజేపీ కార్యకర్తలతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌ఛుగ్, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన వెంట వెళ్లారు.
రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాఓ మాట్లాడుతూ కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవిష్యత్తును మునుగోడు ఉప ఎన్నిక నిర్దేశిస్తుందని అన్నారు. దమ్ముంటే మునుగోడులో పోటీ చేయాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. తనపై ఎవరు పోటీకి వస్తారో రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ వస్తారా? కేటీఆర్ వస్తారా?… ఎవరొచ్చినా విజయం నాదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. లక్షల కోట్లు ప్రజల సొమ్ము దోచుకున్న కేసీఆర్‌ను వదిలిపెట్టే సమస్యే లేదు. వచ్చే ఏడాది బతుకమ్మ నాటికి కవిత తీహార్ జైలుకెళ్లడం ఖాయం అని పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికతో రాష్ట్ర భవిష్యత్ ఏంటో తేలుతుందని వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా అంటే విప్లవాల ఖిల్లా అని ఆయన అన్నారు. తమను దొంగదెబ్బ తీసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు రాజగోపాల్‌రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదలకావడంతో నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 14న నామినేషన్ల దాఖలుకు తుది గడువు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ నెల 12న, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఈ నెల 14న నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు.