కారుకు ఎసరు పెట్టే సింబల్స్‌పై టీఆర్‌ఎస్‌ భయం

By KTV Telugu On 11 October, 2022
image

మునుగోడు ఉప ఎన్నికలో తమ ఎన్నికల చిహ్నం కారు గుర్తును పోలీని ఎన్నికల సింబల్స్‌ తమ కొంప ముంచుతాయేమోనని టీఆర్‌ఎస్‌ అధిష్టానంకు బెంగ పట్టుకుంది. ఆ భయంతోనే తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి వికాస్ రాజ్‌ను క‌లిశారు ఆ పార్టీ నాయకులు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ కుమార్‌ గుప్త, ఎన్నికల ప్రధానాధికారిని కలిసినవారిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గుర్తు కారును పోలిన గుర్తులు 8 ఉన్నాయ‌ని, వాటిని ఫ్రీ సింబ‌ల్స్ జాబితా నుంచి తొల‌గించాల‌ని కోరారు. ఈవీఎంలో ఈ తరహా సింబల్స్ చూసి ఓటర్లు గందరగోళానికి గురవుతారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ విజయావకాశాలను దెబ్బతీయడానికి ప్రత్యర్థి పార్టీలో తప్పుడు విధానాలు అవలంభిస్తున్నాయని ఆరోపించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు కారు గుర్తును పోలిన సింబల్స్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా ఓటర్లను అయోమయానికి గురి చేస్తున్న తీరును టీఆర్‌ఎస్‌ నాయకులు వివరించారు. గతంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో జాతీయ పార్టీల అభ్యర్థుల కంటే కారు గుర్తును పోలీన సింబల్స్‌ పై పోటీ చేసిన అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. దీనివెనకాల తమ ప్రత్యర్థి పార్టీల కుట్ర ఉందని వారు అనుమానాలు వ్యక్తం చేశారు.
గతంలో కూడా ఇలాంటి ఉదంతాలను టీఆర్‌ఎస్‌ ఈసీ దృష్టికి తీసుకువచ్చినప్పుడు టోపీ, ఇస్త్రీ పెట్టె, ట్రక్కు, ఆటోరిక్షా గుర్తులను ఫ్రీ సింబల్స్‌ జాబితా నుంచి తొలగించారు. అయితే ఇప్పటికీ ఫ్రీ సింబల్స్‌ జాబితాలో ఉన్న కెమెరా, సబ్బుపెట్టే, చపాతీ రోల్, టెలివిజన్, కుట్టు మిషన్‌, ఓడ డోల, రోడ్డు రోలర్ వంటి గుర్తులను తొలగించాలని టీఆర్‌ఎస్‌ నాయకులు ఈసీకి విజ్ఞప్తి చేశారు.