పాలు పోసిన పాములే పాక్ పై బుస కొడుతున్నాయి

By KTV Telugu On 3 January, 2023
image

అసలే ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్ లో తెహరీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ విధ్వంసాల సెగ మరింతగా మంట పుట్టిస్తోంది. కాల్పుల విరమణ గడువు ముగియడంతో ఉగ్రమూక హింసాయుత దాడులతో రెచ్చిపోతోంది. దేశ వ్యాప్తంగా నెత్తుటేరులు పారిస్తోంది. అంతే కాదు పాకిస్థాన్ లో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని పాక్ తాలిబాన్ ప్రకటించుకున్నారు. అక్కడితో ఆగలేదు మంత్రి వర్గంలో ఫత్వాలు జారీ చేసేందుకు ఓ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన ఉగ్రవాదులు మానవబాంబు దాడులకోసం మరో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తమ అజెండాను చాటుకున్నారు. అయితే టిటిపికి అంత సీన్ లేదని పాక్ ఆర్మీ అంటోంది.

ఆఫ్ఘనిస్థాన్ లో ప్రజాప్రభుత్వం కుప్పకూలి అక్కడ ఉగ్ర తాలిబాన్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన వేళ పాక్ పాలకులు ఏమన్నారు. తాలిబాన్ కు విముక్తి లభించిందని ఆఫ్ఘన్ కు మంచిరోజులు వచ్చాయని బాధ్యతారహితంగా పాక్ పాలకులు వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్ ప్రజలు తాలిబాన్ రాకను గమనించి వణికిపోతూ ఉంటే పాక్ పెద్దలు సంబరాలు చేసుకున్నారు. ఆఫ్ఘన్ లోని తాలిబాన్ ను అడ్డుపెట్టుకుని తమ ఉగ్ర లక్ష్యాలు నెరవేర్చుకోవచ్చునని మురిసిపోయారు. తాలిబాన్ పాలకులకు దగ్గరుండి దిశా నిర్దేశనం చేశారు. ఇపుడు అదే పాకిస్థాన్ లో ఉగ్ర హింస రోజురోజుకూ పెరిగిపోతోంది. టిటిపి గా పిలుచుకునే తెహరీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ గ్రూపు కి పాక్ ప్రభుత్వానికీ మధ్య కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం 2022 నవంబరుతో ముగిసింది.

అది ఎప్పుడెప్పుడు ముగుస్తుందా. ఎప్పెడెప్పుడు ఆయుధాలను ప్రయోగించి హింస రాజేద్దామా అని టిటిపి ఉగ్రవాదులు తహతహ లాడుతున్నారు. విరమణ ఒప్పంద గడువు ముగిసిన వెంటనే తమ చేతులకు పని చెప్పడం మొదలు పెట్టారు. ప్రత్యేకించి పాకిస్థాన్ భద్రతా సిబ్బందినే లక్ష్యంగా చేసుకుని హింసాయుత దాడులకు తెగబడుతున్నారు. వాయువ్య పాకిస్థాన్ ప్రాంతంలోని బన్ను నగరంలో మొన్న డిసెంబరు 18న పెద్ద దాడి జరిగింది ఇందులో నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విధ్వంసకాండ టిటిపి పనే అని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఇదే ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్ పై మెరుపు దాడి చేసిని టిటిపి మూకలు ఆరుగురు పోలీసులను కిరాతకంగా హతమార్చారు.

నైరుతీ పాకిస్థాన్ ప్రాంతంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో నవంబరు 30న పోలీసులు వెళ్తోన్న ఓ ట్రక్కును టిటిపికి చెందిన మానవబాంబు దాడి చేయడంతో నలుగురు పోలీసులు మృతి చెందగా మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ వరుస దాడులతో పాక్ అధికారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. రానున్న కాలంలో ఇటువంటి హింసాత్మక దాడులు మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియడానికి ముందే వందలాది సంఖ్యలో తాలిబాన్ గతంలో తమ ప్రాభవం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు తిరిగి వచ్చారు. వాయువ్య ప్రాంతంలో ఖైబర్ పక్తుంఖ్వా ఒకప్పుడు టిటిపికి అడ్డా. కొన్నేళ్లుగా ఇక్కడ తమకి అనుకూల వాతావరణం లేకపోవడంతో తాలిబాన్ వేరే ప్రాంతాలకు తరలిపోయారు. ఇపుడు నెమ్మది నెమ్మదిగా తమ పూర్వాశ్రమానికి వస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి సంకేతం కాదంటున్నారు పాక్ భద్రతా సిబ్బంది.

స్థానికులను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం ఎదురు తిరిగిన వారిని టార్గెట్ చేసుకుని హతమార్చడం రోజురోజుకీ పెరుగుతోంది. 2014లో వాయువ్య ప్రాంతంలోని గిరిజన ప్రావిన్సుల్లో ఉండే టిటిపి  ఉగ్రవాదులను పాక్ ఆర్మీ తరిమేసింది. అపుడు వారంతా తూర్పు ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతంలో ఆశ్రయం పొందారు. ఇంతకాలం వారికి ఆఫ్ఘన్ తాలిబాన్ రక్షణ కల్పించింది. వారంతా ఇపుడు తిరిగి తమ పాత స్థావరాలకు తిరిగి వచ్చేశారు. హింస రాజేసి తీరాలన్న కసితో ఉన్నారువారు. పాకిస్థాన్ తాలిబాన్ తిరిగి ప్రత్యక్షం కావడం స్థానిక పాకిస్థానీయులను భయపెడుతోంది. పాక్ తాలిబాన్ రాజ్యం నడిచిన రోజుల్లో ఖైబర్ పక్తుంఖ్వా  ప్రాంతంలో టిటిపి రాక్షస పాలనలో ప్రజలు నరకయాతన పడ్డారు. హక్కులనేవి ఏవీ ఉండేవి కావు. ఏ మాత్రం తేడా వచ్చినా పెద్ద ఎత్తున జరిమానాలు విధించేవారు. ఎదురు తిరిగితే  నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. చిత్ర హింసలు పెట్టేవారు. టిటిపి ఉగ్రవాదులు తిరిగి రాకుండా  నిలువరించడంలో ప్రభుత్వం ఆర్మీ ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపిస్తూ స్వాత్ లోయలో స్థానిక ప్రజలు ఆందోళనలు చేశారు.

వజీరిస్థాన్ ప్రాంతంలో టిటిపి ఉగ్రవాదుల దాష్టీకాన్ని ఎదిరించలేక చాలా మంది తమ ఇళ్లను విడిచి వేరే ప్రాంతాలకు వలసలు పోయారు. ఆ తర్వాత ఆర్మీ టిటిపిని తరిమివేయడంతో తమకి మంచి రోజులు వచ్చాయనుకుని వారు తిరిగి తమ ఇళ్లను చేరుకుని నివాసం ఉంటున్నారు. ఇపుడు పాక్ తాలిబాన్ తిరిగి రావడంతో తమకి మళ్లీ చెడ్డ రోజులు వచ్చాయని వారు భయపడుతున్నారు. మరోసారి వలసపోడానికి రెడీ అవుతున్నారు. వీరంతా ఇపుడు బన్ను నగరానికి వలసపోడానికి సమాయత్తం అవుతున్నారు. నార్త్ వజీరిస్థాన్ ప్రాంతంలో కొన్ని వారాలుగా  పాక్ సైనికులకు టిటిపి ఉగ్రవాదులకు మధ్య కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో అటూ ఇటూ కొందరు తలలు వాల్చేస్తూనే ఉన్నారు. మా ఊరిలో మాఇంట్లో మాకు భద్రత లేదన్న భావన మమ్మల్ని భయపెట్టేస్తోందని మెజారిటీ ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నట్లు మాకనిపిస్తోందని వారు అంటున్నారు.

2022 నవంబరు నెలలోనే టిటిపి ఉగ్రవాదులు ఏకంగా 59 హింసాయుత దాడులకు పాల్పడ్డారు. ఆ తర్వాత డిసెంబరు నెలలో 30 దాడులతో రెచ్చిపోయారు. ఈ దాడులన్నీ కూడా ముఖ్యంగా సైనిక అధికారులు, పోలీసులు వారి బంధువలనే టార్గెట్ గా తెగబడినవే . రానున్న కాలంలో దాడుల సంఖ్య విపరీతంగా పెరగడం ఖాయమని అటు అధికారులు ఇటు ప్రజలూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాడులు రోజు రోజుకీ పెరగడం టిటిపి సైనిక పరంగా బలోపేతం అయ్యిందని చెప్పడానికి తిరుగులేని నిదర్శనం అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. టిటిపి ఉగ్రవాదులకు  ఆశ్రయం ఇచ్చి వారికి ఎలాంటి ఆపద రాకుండా ఇంతకాలం ఆదుకున్నది ఆఫ్ఘన్ తాలిబానే. ఆఫ్ఘనిస్థాన్ నుండి అమెరికా సైనిక బలగాలు ఉపసంహరించుకోవడంతో టిటిపి ఉగ్రవాదులు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఎప్పుడు కావాలంటే అపుడు ఆఫ్ఘన్ వచ్చి పోతున్నారు. ఎవరిమీద పడితే వారి మీద దాడులకూ తెగబడుతున్నారు. ఏడాదికి పైగా శాంతి చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలు అమలుచేయడం టిటిపి ఉగ్రవాదులు మరింత బలం పుంజుకోడానికే దోహద పడిందని  పాక్ సైనిక అధికారులు ఓ నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదికను పాక్ సెనేట్ కు సమర్పించారు.

టిటిపి ఎంతగా బలపడిందంటే గతంలో పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లోనే ఉండే పాక్ తాలిబాన్ ఇపుడు పట్టణ నగర ప్రాంతాలకు విస్తరించి తమ కార్యకలాపాలను మరింతగా పెంచుకనే స్థాయికి ఎదిగిందని నివేదికలో వివరించారు. రానున్న కాలంలో టిటిపి పాకిస్థాన్ కు అతి పెద్ద తలనొప్పిగా మారడం ఖాయమని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాక్ ప్రభుత్వం పాక్ తాలిబాన్ ల మధ్య శాంతి చర్చలకు ఇంత వరకు ఆఫ్ఘన్ లోని తాలిబాన్ ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరించింది. ఈ శాంతి చర్చలు ఓ కొలిక్కి రాకపోతే మాత్రం హింసాయుత ఘటనలు అనూహ్యంగా పెరిగే ప్రమాదం ఉందని పాక్ మేథావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపుడు టిటిపి దాడులను నిలువరించడం కూడా పాక్ ఆర్మీకి కష్టం కావచ్చునని వారంటున్నారు. అయితే పాక్ ఆర్మీ మాత్రం టిటిపిని చూసి భయపడాల్సిన అవసరం లేదంటోంది. టిటిపి ఉగ్రవాదులంతా కలిసి మహా ఉంటే పది వేలమందికి మించరన్నది వారి అంచనా. వారిని ఎలా నిలువరించాలో తమకి తెలుసునని పాక్ ఆర్మీ ధీమా వ్యక్తం చేస్తోంది. తాజాగా పాకిస్థాన్ తాలిబాన్ సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించుకుంది.

దేశంలో తమకు ఏ మాత్రం బలం లేని ప్రాంతాల్లోనూ తమదే పై చేయి అని తాలిబాన్ హడావిడి చేస్తున్నారు. సమాంతర ప్రభుత్వాన్ని ప్రకటించుకున్న తాలిబాన్ తమకు నచ్చిన వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చేసుకున్నారు. మంత్రి వర్గంలో మానవ బాంబులతో దాడులకు ప్లాన్ చేసేందుకు ఏకంగా ప్రత్యేక మైన శాఖనే ప్రకటించారు పాక్ తాలిబాన్. ఇక తప్పులు చేసిన వారిని తమను ప్రశ్నించిన వారిని ఏ విధంగా శిక్షించాలో నిర్ణయించేందుకు ఫత్వాల జారీ కోసం ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకున్నారు. అన్నింటికన్నా భయంకరమైన పరిణామం ఏంటంటే 15 ఏళ్లు నిండిన కుర్రాళ్లే లక్ష్యంగా పాకిస్థాన్ టిటిపి పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్లు చేపడుతోంది. పాకిస్థాన్ వాయువ్య ప్రాంతానికి చెందిన  కుర్రాడు ఉమర్ కొద్ది రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు. కొద్ది రోజుల తర్వాత ఉమర్ తన తండ్రికి వాట్సప్ లో ఓ మెసేజ్ పంపాడు. నాన్నా నేను తెహరీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ లో చేరాను. ఇక ఇదే తుది వీడ్కోలు గుద్ బై అని  మెసేజ్ పంపాడు. దాన్ని చూడగానా తల్లి దండ్రులతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా కుప్పకూలిపోయారు.

ఉమర్ లాంటి కుర్రాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఉమర్ తల్లిదండ్రుల్లా తమ పిల్లలు ఉగ్ర కూపంలో కూరుకుపోతున్నారని తెలిసి విలవిల ఏడుస్తోన్న తల్లిదండ్రుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆఫ్ఘనిస్థాన్ లో  ప్రజా ప్రభుత్వాన్ని పక్కన పెట్టి తాలిబాన్ రాజ్యాన్ని స్థాపించినట్లే పాకిస్థాన్ లోనూ తాలిబాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలన్నది ఉగ్రవాదుల లక్ష్యం. పరిణామాలన్నీ కూడా సక్రమ మార్గంలో నడుస్తున్నట్లు అనిపించడం లేదని స్థానిక మేథావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో అశాంతి రాజేయడమే అజెండాగా  పాకిస్థాన్ మొదట్నుంచీ ఉగ్రవాదుల కర్మాగారాలను నిర్వహిస్తూ వస్తోంది.  అటు ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ కూ పాక్ అండగానే నిలిచింది. అప్పుడే ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ను హెచ్చరించాయి. పాముకు పాలుపోసి పెంచితే ఏదో ఒక రోజున ఆ పాము పాలు పోసిన చేతినే కాటేసే ప్రమాదం ఉంటుందని ఎంతగా హెచ్చరించినా పాక్ పాలకులు పట్టించుకోలేదు.

ఉగ్రసర్పాలను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ప్రపంచంపైకి ఉగ్రహింసను ఎగదోశారు. ఇపుడు అదే ఉగ్ర హింస పాకిస్థాన్ ను టార్గెట్ చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఆర్ధిక సంక్షోభంలో నిండా కూరుకుపోయి కష్ఠాల్లో ఉన్న పాకిస్థాన్ ఇపుడు ఉగ్రకూపంలో కూరుకుపోతూ ఉండడంతో పాక్ లో మేథావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్నుంచి తమనీ తమ దేశాన్నీ రక్షించేదెవరా అని అల్లాను ప్రార్ధించుకుంటున్నారు. పాకిస్థాన్ తాలిబాన్ కు ఆఫ్ఘన్ తాలిబాన్ తోడైతే పాకిస్థాన్ ను ఉగ్రసర్పాల బారి నుండి కాపాడ్డం ఎవరి వల్లా కాకపోవచ్చునని అంతర్జాతీయ మేథావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ను ఏలిన పాలకులు సైనిక నియంతలే పాకిస్థాన్ ఈ పరిస్థితుల్లోకి జారుకోడానికి కారణమని వారు అంటున్నారు.