భూంకపాలు ఎక్కువగా వచ్చే సిస్మిక్ జోన్ లోనే ఉంది టర్కీ. పదే పదే భూకంపాలు రావడానికి కారణాలు ఉంటాయి. భూమి కింద ఉన్న రక రకాల ప్లేట్లు కదిలే క్రమంలో అవి ఒకదాన్నొకటి ఢీకొంటే దాని తీవ్రతను బట్టి భూకంపం వస్తుంది. టర్కీ ఎప్పటికీ ప్రమాదకర జోన్ లోనే ఉందంటున్నారు భూభౌతిక శాస్త్ర వేత్తలు. జపాన్ తరహాలో ఇళ్ల నిర్మాణంలో జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందని వారంటున్నారు. టర్కీ తరచుగా భూకంపాలు వచ్చే జోన్ లో ఉంది.
ఒక్క 2020లోనే ఈ రీజియన్ లో 33 వేలకు పైగా భూకంపాలు నమోదయ్యాయి. వీటిలో 332 భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4 లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లు రికార్డ్ అయ్యింది. టర్కీ దేశం ఉన్న టెక్టోనిక్ లొకేషన్ కారణంగానే ఇక్కడ భూకంపాలు ఎక్కువగా వచ్చే ముప్పు ఉందని అంటున్నారు సైంటిస్టులు.
టర్కీ ఉన్న ప్రాంతంలో భూ ఉపరితలంలో 15 మేజర్ స్లాబ్స్ ఉన్నాయి. వీటినే టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు.ఈ ప్లేట్ల మధ్య ఉన్న ఖాళీ ప్రాంతాల్లో లోపాలు ఉన్నాయి. రెండు రకాల రాతి బ్లాక్స్ మధ్యలో పగుళ్లు ఉన్నాయి. ఈ పగుళ్లు ఉన్న దిశగా ప్లేట్ల్ కదిలితే కచ్చితంగా భూకంపాలు వస్తాయని బ్రిటిష్ ఆర్కియోలాజికల్ సర్వే తేల్చి చెప్పింది. టర్కీ అనేది అనటోలియన్ టెక్టోనిక్ ప్లేట్ పైన ఉంది. యురేషియన్-ఆఫ్రికన్ ప్లేట్లకు మధ్యలో ఇది ఉంది. ఉత్తరాన అరేబియన్ ప్లేట్స్ ఉన్నాయి. అది కూడా టెక్టోనిన్ ప్లేట్ల కదలికను నియంత్రిస్తూ ఉంటుంది. యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే చోట విధ్వంసకర భూకంపాలు పుట్టే ప్రమాదం ఉంటుంది.
1999లో గోల్కుక్, డుజ్ సే ప్రావిన్సుల్లో 7.4, 7.0 తీవ్రతలతో కూడిన భూకంపాలు వచ్చాయి. అది యావత్ టర్కీని విషాదంలో ముంచెత్తింది. ఆ పెను విపత్తులో ఏకంగా 18 వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 45 వేల మంది నెత్తుటి గాయాలతో మిగిలారు. పెద్ద సంఖ్యలో ఆస్తులు ధ్వంసం అయ్యాయి. 2011లో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ దుర్ఘటనలో 500 మంది చనిపోయారు. 2013 నుండి 2022 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 30,673 భూకంపాలు రిజిస్టర్ అయ్యాయి. వాటిలో కేవలం రెండు సార్లే ప్రస్తుతం టర్కీలో నమోదైనంత తీవ్రత కలిగి ఉన్నాయి.
1939లో టర్కీలో ఏకంగా 8 తీవ్రతతో భారీభూకంపం వచ్చింది. అప్పుడు 20 వేల మందికి పైగా మరణించారు. లక్షన్నరకు పైగా ఇళ్లు భవంతులు ఎందుకూ పనికిరాకుండా ధ్వంసం అయ్యాయి.1939 నుండి 1999 మధ్య కాలంలో అరవై ఏళ్ల వ్యవధిలో టర్కీలో 5 భారీ భూకంపాలు చోటు చేసుకున్నాయి. 1900 నుండి ఇప్పటి వరకు భూకంపాల్లో 90 వేల మందికి పైనే మరణించారు
టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో రెండు లక్షలకు పైగా భవంతులు భూకంప ముప్పు ఉన్న ప్రాంతంలో ఉన్నాయని నిపుణులు హెచ్చరించారు. 30 లక్షల మందికిపైగా ఇస్తాంబుల్ వాసుల ప్రాణాలు గాల్లో ఉన్నట్లే లెక్క అని వారు హెచ్చరించారు. గత భూకంపాల ఘటనల అనంతరం ఇంజనీరింగ్ నిపుణులు చేపట్టిన పరిశోధనలో మెజారిటీ ఇళ్లు భూకంపాలను తట్టుకునే విధంగా సరియైన నాణ్యతా ప్రమాణాలతో కట్టినవి కావని తేలింది. టర్కీ సిరియా సరిహద్దుల్లో తాజా భూకంప ఘటనలో 3,700మందికి పైగా మరణించారు. లక్షలాది మంది సిరియన్లు నిరాశ్రయులయ్యారు. అసలు సిరియాను ఏళ్ల తరబడి శాపాలు వెంటాడుతున్నట్లున్నాయి. అక్కడి అసద్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అమెరికా అసద్ ప్రభుత్వానికి అండగా రష్యాలు నిలవడంతో సిరియా యుద్ధభూమిగా మారిన సంగతి తెలిసిందే. గగన తలం నుంచి బాంబుల వర్షం క్షిపణి దాడులతో దేశం అంతా శిధిలాలమయం అయ్యింది. పదేళ్ల తర్వాత కూడా సిరియా కోలుకోలేలేదు. ఇప్పటికీ సిరియన్ ప్రజల జీవితాలు కొలిక్కి రాలేదు. ఆ విషాదంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇపుడు భూకంపం రూపంలో మరో ముప్పు ముంచుకు వచ్చింది. ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదని సిరియన్లు భోరు మంటున్నారు.
టర్కీలో నగరాలకు నగరాలే శిథిలాల దిబ్బలుగా మారిపోయాయి. ఒక్క మలాత్యా ప్రావిన్స్‌లోనే 130 భవనాలు నేలమట్టమయ్యాయి. గాజియాన్తెప్ నగరంలో ఒక్కరు కూడా ఇళ్లలో లేకుండా వీధుల వెంట పరుగులు తీశారంటే పరిస్థితి ఎంత హృదయవిదారకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భూకంపాలు పెను విధ్వంసాలను సృష్టిస్తాయి. పెను విషాదాన్నే మిగులుస్తాయి. ప్రకృతి ప్రకోపాలకు ఎవరిమీద దయా దాక్షిణ్యాలు ఉండవు. mఒక్కసారిగా విరుచుకు పడిపోయి అన్నింటినీ నాశనం చేయడమే వాటి లక్ష్యంగా ఉంటుంది. వాటి నుండి మనిషి తప్పించుకోనూ లేడు. భూకంపాల రాకను ముందస్తుగా కనిపెట్టగల మేథస్సు అయితే ఉంది కానీ భూకంపాల తీవ్రతను తగ్గించే టెక్నాలజీలేవీ ఉండవు లేవు. భూకంపాల రాకకు సంబంధించి ముందస్తు హెచ్చరికలకు అనుగుణంగా ప్రమాదకర ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం ద్వారా మాత్రమే ప్రాణ నష్టాలను తగ్గించుకోగలం. ఇళ్లు, భవంతులను మాత్రం ఎక్కడికీ తీసుకెళ్లలేం కాబట్టి అవి ధ్వంసం కాక తప్పదు. టర్కీలో తాజా భూకంపం నుండి ఆ దేశంతో పాటు చుట్టుపక్కల దేశాలు కూడా పాఠాలు నేర్చుకోవాలి. విపత్తులకు ఏటికెదురీదినట్లు ఎదుర్కోలేం కానీ వాటి ప్రమాదాల నుండి దూరం పారిపోయి ప్రాణాలు దక్కించుకోవచ్చు.