మస్క్‌ కంటే మూర్ఖుడా..ఎవరున్నారబ్బా!

By KTV Telugu On 22 December, 2022
image

ట్విటర్‌ టేకోవర్‌ నుంచీ తేడామాటలే. పిచ్చిపిచ్చి పనులే. ఉద్యోగులమీద వేటునుంచి మొదలైంది మస్క్‌ మార్క్‌ మేనేజ్‌మెంట్‌. ఉద్యోగులనుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో కాస్త వెనక్కితగ్గినా మస్క్‌ మైండ్‌సెట్‌ ఏమాత్రం మారలేదు. మీరొద్దంటే సీఈవో పదవినుంచి తప్పుకుంటానంటూ మస్క్‌ ఇచ్చిన ఆఫర్‌ కూడా ఉత్తిదేనని తేలిపోయింది.
ట్విట్టర్‌ హెడ్‌గా తాను కొనసాగాలో వద్దో చెప్పాలంటూ ట్విటర్‌లో ఒపీనియన్‌ పోలింగ్‌ నిర్వహించారు ఎలాన్‌మస్క్‌. 57.5శాతం మంది మస్క్‌ తప్పుకోవడమే ఉత్తమమంటూ ఓటేశారు. మాటమీద నిలబడేవాడే అయితే మస్క్‌ ఈపాటికి తప్పుకోవాల్సింది. అయితే రెండ్రోజులు దీనిమీద నోరెత్తని మస్క్‌ ఇప్పుడు విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు. ఆ పదవిని చేపట్టేంత మూర్ఖత్వం ఉన్నవారెవరైనా దొరిగ్గానే తాను సీఈవో పోస్ట్‌నుంచి పక్కకు తప్పుకుంటానని ప్రకటనచేశాడు. అలాంటి మూర్ఖుడు దొరికాక తాను కేవలం సాఫ్ట్‌వేర్, సర్వర్‌ టీమ్‌లను చూసుకుంటానని ట్వీట్‌ చేశాడు.
44 బిలియన్‌ డాలర్లకు అక్టోబర్‌లో ట్విటర్‌ని టేకోవర్‌ చేసినప్పట్నుంచి కంపెనీ చీఫ్‌ బాధ్యతల్లో ఎలాన్‌మస్కే కొనసాగుతున్నారు. టేకోవర్‌ తర్వాత సీఈవో పరాగ్‌ అగర్వాల్‌తో పాటు సగం పైగా సిబ్బందిపై వేటువేశారు. ట్విటర్‌లో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. కొన్ని నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా నా దారి రహదారి అంటున్నారు. వచ్చే ఏడాది కల్లా కంపెనీ ఆర్థికంగా గాడినపడుతుందనే ధీమాతో ఎలాన్‌మస్క్‌ ఉన్నారు. ఖర్చులు తగ్గించేందుకు తాను తీసుకున్న చర్యలతోనే ఇది సాధ్యమైందంటున్నారు. ఖర్చులు తగ్గించే పనిలో ఐదువారాలుగా పిచ్చోడిలా గడిపానంటున్నాడు ఎలాన్‌మస్క్‌. మస్క్‌ వాదన ఎలా ఉన్నా పోయిపోయి పిచ్చోడి చేతిలో పడ్డామనే అంతా అనుకుంటున్నారు.