రాబందుల రెక్కల చప్పుడు… కుళ్లిన శవాల దుర్గంధాలు…. పిల్లల్ని కోల్పోయిన తల్లులు, కుటుంబ సభ్యులను కోల్పోయిన ప్రజల ఆర్తనాదాలు… శత్రు సైనికుల వికటాటహాసాలు.. నిత్యకృత్యమైన నేల అది. చేయని తప్పుకు ప్రజలు ముక్కుతూ మూలుగుతూ కాలం వెళ్లదీస్తున్న నరక కూపమది. అదే ఉక్రెయిన్ దేశం. రష్యా నియంత పుతిన్ రాజ్యకాంక్షకు బలైన దేశం…
రాజధాని కీవ్, మరియపోల్, ఖార్కీవ్… ఇలా ఏ నగరాన్ని చూసినా ఒకటే సీన్… చెల్లాచెదురుగా పడున్న శవాలు. కొన్ని చోట్ల గుట్టలుగుట్టలుగా శవాలు. ఒకటి రెండు ప్రదేశాల్లో మాత్రమే సామూహిక అంత్యక్రియలు మిగతా ప్రదేశాల్లో మృతదేహాలను వదిలేసి వెళ్లిన బంధుమిత్రులు, పట్టించుకోని స్థానిక ప్రభుత్వాలు… సస్యశ్యామలమైన ఉక్రెయిన్ దేశం మరుభూమిగా మారిన పరిస్తితి ఇది.. ఎవరిని కదిలించినా విషాద గాథే. తీరని శోకమే.. ఎవరున్నారు…ఎవరు పోయారు.. చనిపోయిన వాళ్లు ఎవరి బంధువులో తెలియక నానా తంటాలు…..
అమ్మా నాన్నెప్పుడొస్తాడే అని పిల్లలు అడుగుతుంటే.. తల్లి నోట్లో గుడ్డలు కుక్కుకుని కుళ్లి కుళ్లి ఏడుస్తున్న సన్నివేశాలు అనేకం. పక్కవీధిలో భర్త శవం పడుందని కూడా తెలుసుకోలేని దుస్థితిలో భోరున విలపిస్తున్న గాథలెన్నో ఉన్నాయి. రష్యా సైనికులు ఉక్రెయినియన్ల శవాల మధ్యే తిరుగుతుంటే.. వెళ్లి వెదుక్కోవాలన్నా భయం వేస్తోంది. భర్త ఎలాగూ చనిపోయాడని.. తాము సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోవాలన్నా కదల్లేని ఒక సెంటిమెంట్. భర్త శవాన్ని వదిలి వెళ్లడమెలాగోనంటూ చాలా మంది మహిళలు అక్కడే ఉండిపోతున్నారు. మరియపోల్ నగరంలో ఓ మహిళ.. తన భర్త శవాన్ని ముద్దుపెట్టుకోవడం అందరినీ కదిలించి వేస్తోంది.. జనం వారిస్తున్నా ఆమె మాత్రం తన భర్త శవాన్ని కారులో వేసుకుని ఎక్కడికో వెళ్లిపోయింది…
మానవతా విలువలు మరిచిన పుతిన్ సైన్యం
రష్యా సైనికులు చేయని అరాచకాలు లేవు. యుద్ధం తొలి నాళ్లలో డబ్బులిచ్చి ఆహార పదార్థాలు కొనుక్కున్న రష్యన్ సైనికులు….తర్వాతి కాలంలో దోపిడీలు మొదలు పెట్టారు. ఆ దోచుకున్న వాటినే ఉక్రెయినియన్లకు పంచి పెడుతున్నట్లు నటిస్తూ..మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఉక్రెనియన్లను చంపేందుకు బూబీ ట్రాప్స్ పెడుతున్నారు. ఆహారం పంచుతున్న రష్యా సైనికులు ఒక మహిళకు పాల డబ్బాలిచ్చారు. ఇంటికి తెచ్చిన తర్వాత పాలడబ్బా అంత బరువుగా ఎందుకు ఉందని ఆమెకు అనుమానం వచ్చింది. కింద స్క్రూలు ఉండటంతో వాటిని విప్పదీసి చూడగా అందులో బాంబు అమర్చి ఉంది. తక్కువ ఖర్చుతో బాంబులు తయారు చేసి జనాన్ని చంపేందుకు పుతిన్ సైన్యం పన్నాగం పన్నిందని ఉక్రెనియన్ల ఆరోపణ…
రష్యన్ రేపిస్టులు
రష్యన్ సైనికుల అత్యాచారాలు పెరిగిపోయాయి. కీవ్ నగరం వెలుపల మకాం వేసిన రష్యన్ సైనికులు కొందరు మహిళలపై మానభంగానికి పాల్పడ్డారు. అందులో తొమ్మిది మంది మహిళలు ఇప్పుడు గర్భం దాల్చారు. వాళ్లు ఎంతో ఆవేదనతో ఇంటిలోంచి బయటకు రాకుండా అన్నం నీళ్లూ ముట్టుకోకుండా చావును ఆహ్వానిస్తున్నారు. రష్యన్ సైనికుల పిల్లలకు తల్లులుగా ఉండటం ఇష్టం లేదని తెగేసి చెబుతున్నారు. . దానితో వాళ్లు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతారోనని కుటుంబ సభ్యులు అహర్నిశలు కాపలా కాస్తున్నారు… బతిమలాడి తిండి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు….
పిల్లలకు పిచ్చికోపం
యుద్ధాన్ని, యుద్ధం తీరును చూసిన ఉక్రెయిన్ పిల్లలు రష్యన్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కులు, పిల్లలను పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. అదేమని పెద్దవాళ్లు అడిగితే పుతిన్ ను బాదుతున్నానని చెబుతున్నారు. కొందరు పిల్లలు కప్పలను నోట్లో వేసుకుని కరకర నమిలి ఉమ్మేస్తున్నారట. ఎందుకలా చేస్తున్నారని నిలదీస్తే రష్యన్ సైనికులను చంపుతున్నామని చెబుతున్నారట. ఇక బాంబులు ఎటునుంచి వచ్చి పడతాయో ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితుల్లో పిల్లలైనా బతకాలని పెద్దవాళ్లు కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా పిల్లల భుజానికి ఒక బ్యాగ్ తగిలించి అందులో పేరు అడ్రెస్ రాసిన పేపర్ ఉంచుతున్నారు. కొందరైతే రష్యన్ సైనికుల కంటపడకుండా పిల్లల చొక్కా కాలర్ కింద రాస్తున్నారు….