బార్డర్ దాటితే భాష వేరు..ఆ చట్టం సాధ్యమేనా?
యూనిఫాం సివిల్ కోడ్..అంటే ఉమ్మడి పౌరస్మృతి చట్టం. భిన్నప్రాంతాలు, మతాలు, సంస్కృతులు ఉన్న దేశంలో యూసీసీపై చర్చ నిరంతరం నడుస్తూనే ఉంది. ఒకే దేశం ఒకే చట్టం ఎజెండాతో యూసీసీ అమలుకు గతంలో ఉత్తరాఖండ్ ఎన్నికల సమయంలో బీజేపీ సర్కారు కమిటీ వేసింది. ఇప్పుడు గుజరాత్ కూడా ఉమ్మడి పౌరస్మృతి మంత్రాన్ని పఠిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్సాహం చూపుతున్నా భిన్న పరిస్థితులున్న దేశంలో ఒకే చట్టం అమలు సాధ్యమా అన్నదే పెద్ద ప్రశ్న.
కుల, మత, ప్రాంత, జాతి, లింగ భేదాలు లేకుండా దేశ పౌరులందరికీ ఒకే విధమైన చట్టాలను అమలు చేయడమే ఉమ్మడి పౌరస్మృతి లక్ష్యం. యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి వస్తే పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వ హక్కులు, జనన మరణాలు, దత్తత ప్రక్రియకు సంబంధించి అందదరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. ఉమ్మడి పౌరస్మృతిని బీజేపీ ఎప్పుడో తన మేనిఫెస్టోలో చేర్చింది. కశ్మీర్‌కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను రద్దుచేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టి పెట్టింది.
దేశవ్యాప్తంగా ఒకేసారి కాకుండా ముందు తమ పాలనలోని రాష్ట్రాల నుంచి మొదలుపెట్టాలన్న వ్యూహంతో ఉంది బీజేపీ. ఆ పార్టీ పాలనలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ ఉమ్మడి పౌరస్మృతిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే దేశంలో భిన్న మతాల వారికి వేర్వేరు లా బోర్డులున్నాయి. హిందూ మతానికి చెందినవారు ఆచార వ్యవహారాలు కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయి. అన్నిటినీ ఒకే గాటన కట్టేయడం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న తెరపైకొస్తోంది. కానీ బీజేపీ మాత్రం ఈవిషయంలో పట్టుదలతో ఉంది. కశ్మీర్‌లో అసాధ్యమనుకున్న ఆర్టికల్ 370నే రద్దుచేశాక యూసీసీపై అభ్యంతరాలు, అవరోధాలు అలవోకగా అధిగమించగలమనుకుంటోంది.