అగ్రరాజ్యం వణుకుతోంది. మంచుదెబ్బకి గడ్డకట్టుకుని పోతోంది. మంచుతుపానుతో భీకరంగా చలిగాలులు వీస్తున్నాయి. నీళ్లు కూడా వెంటనే గడ్డకట్టేంత చలిలో అమెరికా ప్రజలు ఊపిరిపీల్చుకోలేక పోతున్నారు. అమెరికాలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోయాయి. విద్యుత్‌సరఫరా నిలిచిపోవటంతో పరిస్థితి దారుణాతిదారుణంగా ఉంది. మంచు తుపాను దెబ్బతో దాదాపు 15లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లోనే వణికిపోతున్నారు అమెరికా ప్రజలు.
అమెరికాలో 20కోట్ల మందికి పైగా ప్రజలు మంచు తుపానుతో అల్లాడిపోతున్నారు. మంచు భారీగా పేరుకుపోవటంతో హైవేలను కూడా మూసేయాల్సి వచ్చింది. దీంతో ప్రజలు క్రిస్మస్ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఒక్కరోజే 5వేల విమానాలు రద్దయ్యాయి. మరో 7600 విమానాలు ఆలస్యంగా నడిచాయి. అమెరికాలో ఉష్ణోగ్రతలు మైనస్ 48 డిగ్రీలకు పడిపోయాయి. మామూలు నీళ్లు గడ్డకట్టటం కాదు సలసలా కాగే నీళ్లు కూడా క్షణాల్లో గడ్డకట్టేస్తున్నాయి.
మంచు తుపాను తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందనే అంచనా అమెరికన్లను భయపెడుతోంది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. న్యూయార్క్, సెయింట్‌పాల్, కెంటకీ, నార్త్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, జార్జియా, ఓక్లహోమాలో పరిస్థితి దారుణంగా ఉంది. డెస్‌మోయిన్స్ నగరం మంచులో మునిగిపోయింది. న్యూయార్క్‌తో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లో ఎమర్జన్సీ ప్రకటించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తుంటే తుపాను బాంబ్ సైక్లోన్‌గా బలపడే ప్రమాదం కనిపిస్తోంది. ఇండియానే నయమేమో. సమ్మర్ కాస్త సెగ పుట్టించినా మిగిలిన కాలాలన్నీ తట్టుకునేస్థాయిలోనే ఉంటాయి.