విదేశీ కుట్రలు తిప్పికొట్టొచ్చు..ఈ గొడవల సంగతేంటి?
పాక్ విద్రోహచర్యలు, చైనా కవ్వింపులు ఎలాగూ తప్పవు. ఇరుగుపొరుగు దేశాల కుయుక్తులను ఎలా తిప్పికొట్టాలో, సరిహద్దును ఎలా రక్షించుకోవాలో మన జవాన్లకు బాగా తెలుసు. కానీ దేశంలో అంతర్గతంగా రాష్ట్రాల మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదాల మాటేంటి? మనవారిని మనమే చంపుకునేంతగా అంతరాలు పెరిగిపోతున్నా కేంద్రం ఎందుకు పరిష్కరించలేకపోతోందన్న ప్రశ్నకు జవాబులేదు. అసోం సరిహద్దు వెంట జరిగిన కాల్పుల్లో ఐదుగురు మేఘాలయవాసులు ప్రాణాలు కోల్పోయారు. అసోం పోలీసులు-ఫారెస్ట్ అధికారులు జరిపిన కాల్పుల్లో మేఘాలయకు చెందిన ఐదుగురితో పాటు అస్సాంకు చెందిన ఓ ఫారెస్ట్ గార్డు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు వివాదాలు తరచూ ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. శత్రుదేశాల్లా రెండు రాష్ట్రాలు కొట్టుకుంటుంటే కేంద్రం చోద్యం చూస్తోందే తప్ప శాశ్వత పరిష్కారం చూపటం లేదు. ఏదన్నా ఉద్రిక్తత తలెత్తినప్పుడు పెడుతున్న సమావేశాలతో ఫలితం కనిపించడంలేదు. కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో అస్సాం-మేఘాలయ సరిహద్దులో తాజా హింస చెలరేగింది. అదుపులోకి తీసుకున్నవారిని వెంటనే విడుదల చేయాలని అసోం పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు మేఘాలయనుంచి పెద్ద ఎత్తున పర్జలు రావటంతో ఉద్రిక్తత తలెత్తింది. ఫారెస్ట్ గార్డులు, పోలీసు సిబ్బందిపై దాడి చేయటంతో జరిపిన కాల్పుల్లో ఆరు నిండు ప్రాణాలు బలయ్యాయి.
మేఘాలయ సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల్లో అసోం పోలీసులు ఈ ఘటనతర్వాత భద్రత పెంచారు. అటు మేఘాలయ కూడా ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేసి అప్రమత్తమైంది. 1972లో మేఘాలయ అసోం నుంచి వేరైంది. అప్పట్నించీ అంటే 50ఏళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి 884.9 కిలోమీటర్ల సరిహద్దు వెంట 12 వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. దీనిపై రెండురాష్ట్రాల మధ్య చర్చలు, ప్రతిపాదనలు నడుస్తుండగానే మరోసారి హింస చెలరేగింది. అసోంకి మిజోరాంతోనూ గతంలో ఇలాగే సరిహద్దు ఘర్షణ తలెత్తింది. 2021లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు అసోం పోలీసులు చనిపోయారు. ఇప్పటికైనా బీజేపీ దీనికో పరిష్కారం చూపుతుందా? కాంగ్రెస్ పాపాలే కారణమని చెబుతుందా?