పిల్లాడిలా వచ్చాడు.. ఆటలోనే పెద్దోడయ్యాడు.. పట్టిందల్లా బంగారం అనిపించాడు. అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా ఇరగదీశాడు.. 75 సెంచరీలు కొట్టాడు. ఇప్పుడు మాత్రం బాగా అలిసిపోయినట్లు కనిపిస్తున్నాడు.. మరి ఇప్పుడేం చేయబోతున్నాడు.
కోహ్లీ… భారత మాజీ కెప్టెన్. ఐపీఎల్ బెంగళూరు జట్టుకు కూడా మాజీ కెప్టెన్. టీమ్ మ్యాన్ గా పేరుంది. రికార్డుల రారాజు సచిన్ కు దాదాపు సమానమైన క్రీడాకారుడిగా విశ్లేషణలు వినిపించాయి. మరి ఇప్పుడేమైంది.. ఇంత చెత్తగా ఎందుకు ఆడుతున్నాడని అభిమానులు తలపట్టుకు కూర్చుంటున్నారు, ఈ సారి ఐపీఎల్లో కోహ్లీని 15 కోట్లకు రిటైన్ చేసుకున్నారు తొమ్మిది మ్యాచుల్లో అతను చేసిన స్కోరు 128 పరుగులు. యావరేజ్ 16 పరుగులట. స్ట్రైక్ రేటు కూడా 120 లోపే. ఏడో మ్యాచ్, ఎనిమిదవ మ్యాచ్ లో వరుసగా స్కోర్ చేయకుండానే అవుటై.. గోల్డెన్ డక్ సాధించాడు.. తొమ్మిదో మ్యాచ్ లో ఓపెనింగ్ వచ్చి పది బంతులు ఆడి కేవలం తొమ్మిది పరుగులు చేశాడు. అదీ కూడా డకౌట్ కావాల్సిందీ.. జస్ట్ మిస్.
కోహ్లీ అసలు ఆడ దలచుకున్నాడా లేదా… బ్యాచ్ కదిలిస్తున్నాడా లేదా.. కదిలించలేకపోతున్నాడా.. పిచ్ మీద జరుగుతున్నదేమిటి. ఇలాంటి ప్రశ్నలు వేధిస్తుండగా… క్రికెట్ క్రీడాభిమానులు, ముఖ్యంగా కోహ్లీ ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఇకనైనా కోహ్లీ తన ఫార్మ్ ను ప్రదర్శించాలని కోరుకుంటున్నారు…
కెప్టెన్సీ వదిలేశాక.
కెప్టెన్సీ వదులుకున్న తర్వాత కోహ్లీకి అచ్చొచ్చినట్లుగా లేదు. వత్తిడి తగ్గించుకుని బ్యాటింగ్ పై ఏకాగ్రత చూపాలనుకుంటే మొదటికే మోసం వచ్చినట్లుంది. ఒక్కక్కటిగా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ వదులుకున్నాడు. సాధారణ క్రీడాకారుడిగా కొనసాగుతున్న కోహ్లీ మునుపటి వేగం ప్రదర్శించలేకపోతున్నాడని క్రీడా పండితులంటున్నారు. బెంగళూరు జట్టు కెప్టెన్సీ వదులుకున్న తర్వాతే అతను మునుపటి ఆటను ప్రదర్శించలేకపోతున్నాడు.
జట్టులోంచి తీసేస్తారా.
కోహ్లీ చాలా రోజులు ఆడాడని, అన్ని రికార్డులు చేతికొచ్చాయని.. ఇక రిటైర్మెంట్ ఇవ్వొచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు. లేదు.. లేదు.. ఇదీ బ్యాడ్ ప్యాచ్ మాత్రమేనని, త్వరలోనే మునుపటి ఫార్మ్ ను ప్రదర్శిస్తాడని ఇంకొందరు అంటున్నాడు. గత టీ – 20 వరల్డ్ కప్ తర్వాత ఆ ఫార్మాట్ కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీకి ఈ సారి జట్టులో ఛాన్స్ దొరకడం కూడా కష్టమే కావచ్చు. ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ – 20 ప్రపంచ కప్ కు జట్టును ఎంపిక చేసినప్పుడు కోహ్లీకి స్థానం దక్కకపోవచ్చని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఒకటి రెండు అనుమానాలున్నా.. ఐపీఎల్ లో ఫార్మ్ పూర్తిగా పోవడంతో క్లారిటీ వచ్చిందని, ఇక కోహ్లీని తీసుకునే కంటే యువతరానికి అవకాశం ఇవ్వడమే కరెక్టని బీసీసీఐ విశ్లేషించుకుంటోంది..
జట్టుకు లక్కీ ప్లేయర్
నిజానికి బెంగళూరు జట్టుకు కోహ్లీ లక్కీ ప్లేయర్ . కోహ్లీ ఉన్నాడనే చాలా కంపెనీలు యాడ్స్ ఇస్తున్నాయి. వంద కోట్ల కాంట్రాక్ట్ కు కూడా కోహ్లీనే కారణం. ఇప్పుడు కూడా ఎండార్స్ మెంట్స్ లో కోహ్లీ నెంబర్ వన్. కోహ్లీ కోసం స్పాన్సర్లు క్యూ కడుతుంటారు. అందుకే బెంగళూరు జట్టు ఇప్పుడే కోహ్లీని వదులుకోదు. టీమిండియా ఏం చేస్తుందో చూడాలి.