వైసీీపీ గర్జన రోజే పవన్ విశాఖ టూర్
మూడు రాజధానులకు మద్దతుగా..
ఉత్తరాంధ్రలో మొదలైన ఆందోళనలు
పవన్ రాకను వ్యతిరేకిస్తున్న వైసీపీ
ఏపీలో రాజధాని చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఓ వైపు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు అరసవిల్లికి పాదయాత్ర చేపట్టగా…మరోవైపు, మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్రలో ఆందోళనలు మొదలయ్యాయి. వీటికి కొనసాగింపుగా ఈ నెల 15వ విశాఖ గర్జన పేరుతో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే. అదే రోజున పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన పెట్టుకోవడంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. దేనికోసం గర్జన అంటూ వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టిన పవన్ కల్యాణ్…యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా ప్రకటించి 25 జిల్లాలను 25 రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులు ఏర్పాటు చేయాలంటూ సెటైర్లు వేశారు. వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన పవన్…నేరుగా 15న రంగంలోకి దిగుతుండడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.
విశాఖ కేంద్రంగా జరుగుతున్న రాజకీయంలో కీలకంగా మారుతున్నారు పవన్ కల్యాణ్. గతంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. విశాఖ కేంద్రంగానే భవన నిర్మాణ కార్మికుల ర్యాలీని పవన్ నిర్వహించారు. అయితే, ఇప్పుడు రాజధాని రచ్చ జరుగుతున్న సమయంలో…వైసీపీ గర్జన నాడే పవన్ కల్యాణ్ విశాఖ టూర్ పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. పవన్ రాకను వైసీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముందే ఫిక్స్ అయిన ప్రోగ్రాం అని జనసైనికులు చెబుతున్నా… గర్జన రోజే విశాఖలో ఎంట్రీ ఇవ్వడం వెనుక ఉద్దేశమేంటో చెప్పాలని వైసీపీ నేతలు పవన్ ను ప్రశ్నిస్తున్నారు.
ఇక అదే రోజున ఉత్తరాంధ్ర టీడీపీ నేతలతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ సహా కీలక నేతలు హాజరవుతారని తెలుస్తోంది. మొత్తంగా ఒకేరోజు వైసీపీకి కౌంటర్ గా టీడీపీ, జనసేనలు బరిలోకి దిగుతుండడంతో…. విశాఖ కేంద్రంగా చోటు చేసుకోబోయే పరిణామాలు ఆసక్తిని పెంచుతున్నాయి. పవన్ తన పర్యటనను వాయిదా వేసుకుంటారా ? లేక కొనసాగిస్తారా? జనసేనాని విశాఖలో దిగితే జరగబోయే పరిణామాలు ఏవిధంగా ఉంటాయనే ఉత్కంఠ నెలకొంది.