క్రిమియాలో రష్యాకి షాక్..బ్రహ్మాస్త్రం తప్పదా?
ఏం జరుగుతోందో ప్రపంచానికి అర్ధంకావడంలేదు. కానీ చాలా జరగబోతోంది. పెద్ద అనర్థమే జరగబోతోంది. పుతిన్ పంతానికి ప్రపంచం మూల్యం చెల్లించాల్సి వచ్చేలా ఉంది. ఇక లాభంలేదు ఆ బాంబు బయటికి తీస్తానంటాడు. అబ్బే..పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం ఎందుకని మళ్లీ తనే అంటాడు. పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది పుతిన్ నాయకత్వంలోని రష్యా. అసలే కీలకమైన బ్రిడ్జి పేల్చివేత తర్వాత నిప్పులు తొక్కిన కోతిలా పుతిన్ చిందులేస్తున్నాడు. ఇప్పుడు మాస్కో నౌకాదళంపై డ్రోన్ దాడులతో ఉక్రెయిన్పై యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో అంచనాలకు అందడం లేదు.
రష్యా ఆక్రమిత క్రిమియాలో మాస్కో దళాలపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిని క్రెమ్లిన్ నౌకాదళం సమర్థంగా తిప్పికొట్టిందని చెబుతున్నా ఉద్రిక్తతలు పెరిగేలా ఉన్నాయి.
క్రిమియా సెవాస్టోపోల్ పోర్ట్ దగ్గర నల్లసముద్రం నౌకాదళం లక్ష్యంగా తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. కొన్ని గంటలపాటు చిన్నసైజు యుద్ధమే జరిగింది. డ్రోన్లని పేల్చేసినా ఈ దాడితో రష్యా మరింత ఉడికిపోతోంది. ఏమీ నష్టం జరగలేదంటున్నా కొన్ని యుద్ధ నౌకలు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉక్రెయిన్ ఈ దాడికి తెగబడి ఉంటుందని రష్యా అనుమానిస్తోంది.
ఉక్రెయిన్లోని కొన్ని నగరాలను ఆక్రమించి అధికారికంగా విలీనం చేసుకున్నట్లు ప్రకటించినా యుద్ధంలో రష్యాకి పట్టు చిక్కడం లేదు. క్రిమియా-రష్యాను కలిపే కెర్చ్ వంతెనని పేల్చేసిన తర్వాత ఉక్రెయిన్పై రష్యా దాడులు ఉధృతం చేసింది. ఇదే సమయంలో రష్యా ఆక్రమిత క్రిమియాలోని మాస్కో సేనలపై డ్రోన్ దాడులు అగ్నికి ఆజ్యంపోశాయి. డర్టీబాంబ్ మీద రెండుదేశాల మధ్య ఇప్పటికే పరస్పర ఆరోపణలు నడుస్తున్నాయి. క్రిమియాపై దాడితో పిచ్చుక అనుకుంటున్న ఉక్రెయిన్పై రష్యా ఏ క్షణమైనా బ్రహ్మాస్త్రం ప్రయోగించేలా ఉంది.