మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాన పార్టీల నాయకులకు ఓటర్లు షాకిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లేస్తామని తెగేసి చెబుతున్నారు. దీంతో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నేతలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మీ ఊరికి రోడ్డేస్తామని హామీ ఇచ్చిన మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఓ ఓటరు గట్టిగా నిలదీశారు మీ మాటలు ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. నువ్వు ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావని మంత్రి అడిగితే నేను ఓటరుగా ప్రశ్నిస్తున్నాను అని అతను సమాధానం చెప్పాడు. గతంలోనే మునుగోడు నియోజకవర్గం లోని చండూరు మండలం లోని పడమటిపాలెం గ్రామానికి చెందిన ఓటర్లు తమ గ్రామానికి రోడ్డు వెయ్యాలని కోరుతూ గ్రామ పొలిమేరలో బ్యానర్లు కట్టారు. ఇప్పుడు గట్టుపల్ మండలం లోని తేరట్ పల్లి గ్రామం బ్యాంకు కాలనీ వాసులు తమ కాలనీలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, సిసి రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సమస్యలను పరిష్కరించాల ఒక బ్యానర్ ని ఏర్పాటు చేశారు.
తమ సమస్యలు పరిష్కరించే వరకు ఎవరు తమ కాలనీ లో అడుగు పెట్టవద్దని, తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతే వచ్చి ఓట్లు అడగాలని ఆ బ్యానర్‌లో రాశారు. దీంతో ఆ కాలనీవాసులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నాయకులు. కాశవారి గూడెం లో కూడా ప్రజలు అటువంటి బ్యానర్లు ఏర్పాటు చేశారు. మీరు మాకు ఇచ్చే డబ్బులు వద్దు…మా గూడానికి రోడ్లు కావాలి.. అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. తక్షణమే కల్వలపల్లి నుంచి కాశవారి గూడెం కు రోడ్డు వెయ్యాలని, గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించాలని వారు బ్యానర్ ద్వారా డిమాండ్ చేశారు. ఇలా మునుగోడు నియోజకవర్గంలో అక్కడక్కడా ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారింది.