దత్తపుత్రుడు.. దత్తపత్రుడు అంటూ ఏపీలో వైసీపీ నేతలు కలవరిస్తున్నారు. సీఎం జగన్ నుంచి నిన్నామొన్నటి మంత్రి గుడివాడ అమర్నాథ్ వరకూ అందరిదీ అదే మాట. పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు దత్తపుత్రుడిగా చెప్పి.. చెప్పి నమ్మించేద్దామని అనుకుంటున్నారు. ఆయననే టార్గెట్ చేస్తున్నారు . ఎందుకు పవన్ కల్యాణ్‌నే వైసీపీ నేతలు కలవరిస్తున్నారు ? ఆయనకు అంత సీన్ లేకపోతే వదిలేయవచ్చు కదా ? అదే పనిగా కుటుంబాన్ని సైతం టార్గెట్ చేసి ఎందుకు విమర్శలు చేస్తున్నారు ? సాధారణంగా రాజకీయాల్లో తమకు థ్రెట్ అవుతారనుకున్న వారినే టార్గెట్ చేస్తారు. ఇప్పుడు పవన్ వారికి ధ్రెట్‌గా కనిపిస్తున్నారు కాబట్టే టార్గెట్ చేస్తున్నారు. ఆ ధ్రెట్ టీడీపీతో కలిస్తే .. డెడ్లీగా ఉంటుందని వారికీ తెలుసు. అందుకే కలవకుండా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ టీడీపీతో కలిస్తే వైసీపీకి వచ్చే నష్టమేంటి?
గత ఎన్నికల్లో టీడీపీకి కాస్త తక్కువగా నలభై శాతం ఓట్లు వచ్చాయి. జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. అధికార వైఎస్ఆర్‌సీపీకి యాభై శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో ఓ వేవ్ కనిపించింది. అలాంటి వేవ్‌లోనూ వచ్చిన ఫలితాలు అవి. అదే టీడీపీ, జనసేన కలిసి ఉంటే చాలా చోట్ల ఫలితాలు తారుమారయ్యేవి. కానీ ఓవరాల్‌గా ఫలితం మారేది కాదు. అప్పుడు పరిస్థితులు వేరు . టీడీపీకి అధికార వ్యతిరేకత ఉంది. పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేశారు. ఆయన గెలిచే పరిస్థితి లేదన్న భావన ప్రజల్లోకి పంపేశారు. దాంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాలిడ్‌గా వైసీపీకి పడింది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఉంది. జనసేన విడిగా పోటీ చేస్తే వ్యతిరేక ఓటు ఆ పార్టీకి కొంత పడుతుంది. అదే టీడీపీ, జనసేన కలిస్తే.. వ్యతిరేక ఓటు ఏకమవుతుంది. అది వైసీపీకి ఏ స్థాయి పరాజయాన్ని మిగిలిస్తుందో అంచనా వేయడం కష్టం. అందుకే వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో గెలుపు రుచి చూసిన జనసేన – టీడీపీ కూటమి !
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-జనసేన నేతలు స్థానికంగా కలసిపోయి పోటీ చేశారు. టీడీపీ – జనసేన స్థానిక నేతలు పొత్తులు పెట్టుకున్న చోట మంచి ఫలితాలు వచ్చాయి. కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తుతో జనసేనకు ఒక్క ఓటు ఎక్కువ రాలేదు. బీజేపీతో పొత్తు పరిస్థితీ అదే. పైగా పవన్ ఫ్యాన్ బేస్‌లో కీలకమైన ముస్లిం వర్గాలు దూరమయ్యాయి. బీజేపీతో వద్దు బాబోయ్ అని క్యాడర్ ఇప్పటికే గొంతెత్తుతోంది. పరిస్థితిని గమనించి పవన్ కల్యాణ్ కూడా బీజేపీకి దూరమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఓట్లు చీలకూడదనే సిద్ధాంతంలో ముందుకెళ్తున్నారు. అది ప్రజల్ని కన్విన్స్ చేసేలా ఉంది.
టీడీపీ హయాంలో పవన్‌కు గౌరవం !
టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్‌కు ఎప్పుడూ గౌరవం తగ్గలేదు. ఆయన అడిగిన సమస్యలన్నింటినీ చంద్రబాబు పరిష్కరించారు. నాలుగేళ్ల పాటు బాగానే నడిచింది . తర్వాత టీడీపీపై విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ఎంత రచ్చ చేసినా.. శ్రీరెడ్డి లాంటి వాళ్లు టీడీపీ మద్దతుతో తిట్టారని జనసేన ప్రచారం చేసినా టీడీపీ వాళ్లు పవన్ పై ఎప్పుడూ విమర్శలు చేయలేదు. వ్యక్తిగత విమర్శలు కూడా చేయలేదు. చింతమనేని లాంటి వాళ్లు చేసినా.. చంద్రబాబు వారించారు. టీడీపీతో విడిపోవడం వల్ల జనసేన పరిస్థితి తేలిపోయింది. రాష్ట్రమూ క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. ఈ సారి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వస్తుందని లేకపోతే.. మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయన్న అంచనా జనసేనలో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ జనసేనను వ్యతిరేకంగా ప్రకటించలేదు. గత ఎన్నికలకు ముందు .. అభ్యర్థుల్ని ప్రకటించే చివరి నిమిషంలోనూ పవన్ కల్యాణ్‌కు కలసి నడుద్దాం రమ్మని ఆఫర్ ఇచ్చారు. కులసమీకరణాలు ఎలా ఫలితాల్ని మార్చేస్తాయో ఆయనకు తెలియనిది కాదు.
వైసీపీ టెన్షన్ అదే.. !
తాను గెలవకపోయినా ఓడిస్తానని సవాల్ చేసి .. కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు పవన్ కల్యాణ్ . ఆయన గెలవలేదు కానీ ఆయన సవాల్ చేసినట్లుగా టీడీపీ ఓడిపోయింది. అంతకంటే ఘోరంగా జనసేన కూడా ఓడిపోయింది. ఈ సారి పవన్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. తాను కూడా గెలవాలని.. వైసీపీ ఓడిపోవాలి. అందుకే ఓట్లు చీలనివ్వబోనని అంటున్నారు. ఆయనపై క్యాడర్‌లో నమ్మకం పెరగడానికి ఈ ప్రకటన బాగా ఉపయోగపడుతుంది. అంతిమంగా వైసీపీకి ఇది ఇబ్బందికరం. అందుకే ఆయన ఒంటరిగా పోటీ చేసేలా చేయాలని.. సవాళ్లు చేస్తున్నారు.. తిడుతున్నారు… దమ్ముందా అంటూ తొడకొడుతున్నారు. కానీ రాజకీయాల్లో ఆలోచనతో వేసే అడుగే విజయాన్నిస్తుంది.