దేవుళ్లని కూడా పెడితే గాంధీ పరిస్థితేంటో!
పరిశ్రమలు మూతపడుతున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది. పేదరికం భయపెడుతోంది. ఆర్థికమాంద్యం ముంచుకొచ్చేలా ఉంది. సున్నిత అంశాలమీద అసహనం అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో ఇన్ని సమస్యలు ఏడిస్తే నాయకులు మాత్రం కోడిగుడ్డు మీద ఈకలు పీకే పనిలో ఉన్నారు. మాట్లాడటానికి మరో అంశం లేనట్లు కొత్త కొత్త వివాదాలు తెరపైకి తెస్తున్నారు. అర్ధంపర్ధంలేని డిమాండ్లతో కాలక్షేపం చేస్తున్నారు. అసలే రూపాయి అల్లాడిపోతోంది. డాలర్ దెబ్బకి బక్కచిక్కుతోంది. ఉన్న బొమ్మ తీసేస్తే, కొత్త బొమ్మలు వచ్చిచేరితే కరెన్సీ విలువేం పెరిగిపోదు. కానీ ఇప్పుడన్నీ ఓటుబ్యాంకు రాజకీయాలేగా. కంసవధ కోసం పుట్టిన కృష్ణుడినని ఇప్పటికే చెప్పుకున్న కేజ్రీవాల్ వింతైన డిమాండ్లతో కమలనాథులను కూడా డిఫెన్స్‌లో పడేస్తున్నారు. కేజ్రీవాల్ కొత్త డిమాండేంటో తెలుసా.. కరెన్సీనోట్ల మీద లక్ష్మీదేవితో పాటు గణనాథుడి ఫోటోలు ముద్రించాలట! కొత్తగా అచ్చేసే నోట్లమీద మహాత్ముడితో పాటు ఆ దేవుళ్ల ఫొటోలు కూడా ఉండాలంటున్నారు కేజ్రీవాల్.
అసలే ఎక్స్ ఐఆర్ఎస్. లాజిక్ లేకుండా మాట్లాడడు కదా. నోటుమీద లక్ష్మీదేవి ఉంటే దేశప్రజలకు ఆమె ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇది ఆర్థికవ్యవస్థ వృద్ధికి దోహదపడుతుంది. ఇక విఘ్నాలు దూరం చేసే వినాయకుడి ఫోటోతో అది జేబులో ఉంటే చాలు జనం సమస్యలన్నీ తీరతాయని కేజ్రీవాల్ చెప్పుకొస్తున్నారు. వ్యాపారులు పని మొదలుపెట్టడానికి ముందు లక్ష్మీదేవికి, వినాయకుడికి పూజలు చేస్తారు. అందుకే దేవుళ్ల ఫోటోలు కరెన్సీ నోట్లమీద ఉంటే సత్ఫలితాలు వస్తాయని కేజ్రీవాల్ చెబుతున్నారు. నోట్లమీద దేవుళ్ల ఫొటోలు ఉండాలన్న వాదన కొత్తగా కేజ్రీవాల్ నోటినుంచి వచ్చిందేం కాదు. ఎప్పుడో రెండేళ్లక్రితమే బీజేపీ సీనియర్‌నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఈ ప్రతిపాదనని తెరపైకి తెచ్చారు. ఇండోనేషియా కరెన్సీపై గణేషుడి బొమ్మను ముద్రించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. మనం కూడా మన దేవుళ్లను గౌరవించుకోవాలని హితబోధ చేశారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇండోనేషియాలోనే గణనాథుడికి అంత ప్రాధాన్యం ఇస్తే మన నోట్లమీద దేవుళ్లని ముద్రించడం తప్పేకాదు. కానీ రేప్పొద్దున దేవుళ్లపక్కన మహాత్ముడు ఎందుకని ఎవరన్నా కొత్త వివాదం లేవనెత్తరనే గ్యారంటీ ఏముందని?