మహాత్ముడి హత్య ఎవరిపని? అంతులేని వివాదం!
స్వతంత్ర భారతావనిని మహాత్ముడు కళ్లారా చూసుకుంది ఐదునెలలే. ఈ దేశం దాస్య ఆంగ్లేయుల కబంధహస్తాలనుంచి విముక్తి పొందిన కొన్నాళ్లకే ఆయన తుపాకీ తూటాలకు నేలకొరిగారు. 1948 జనవరి 30వ తేదీ సాయంత్రం దేశభక్తుడినని చెప్పుకునే ఓ అతివాది చేతిలో బాపూజీ ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఢిల్లీలోని మహాత్మాగాంధీని పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చిచంపిన హంతకుడి పేరు నాథూరామ్ వినాయక్ గాడ్సే. ఆ దారుణ నేరానికి తర్వాత అతను ఉరికంబానికి వేలాడాడు.
మహాత్ముడి హత్యకు కారణమేంటన్నదానిపై ఈ దేశంలో ఎడతెగని వాదనలు నడుస్తూనే ఉన్నాయి. హత్య సబబేననే వితండవాదం కూడా తరచూ వివాదాస్పదమవుతోంది. జాతిపితను పొట్టనపెట్టుకున్న వ్యక్తిని కీర్తించే ‘అభినవ దేశభక్తులు’ కూడా మనమధ్యే ఉన్నారు. గాంధీని చంపింది గాడ్సే అన్న విషయంలో మాత్రం మరో వాదనేం లేదు. అయితే బాపూజీ గుండెల్లో తూటాలు దించిన ఆ తుపాకీని గాడ్సే చేతికి ఇచ్చింది ఎవరన్నదానిపై కొత్త వివాదాలు తెరపైకొస్తున్నాయి. మహాత్మాగాంధీ మునిమనుమడు తుషార్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కొత్త సంవాదానికి తెరలేపాయి.
వినాయక్ దామోదర్ సావర్కర్మీద తన జోడోయాత్రలో సంచలన ఆరోపణలు చేశారు రాహుల్‌గాంధీ. సావర్కర్ పిరికివాడని బ్రిటిష్ పాలకులను క్షమాపణ కోరుతూ సంతకం చేశారని రాహుల్ చేసిన ఆరోపణలపై బీజేపీసహా ఆ పార్టీ అనుకూలవాదులు మండిపడుతున్నారు. అయితే రాహుల్ విమర్శల్ని సమర్ధించిన తుషార్‌గాంధీ దానికి కొనసాగింపుగా సావర్కర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. మహాత్మాగాంధీని చంపేందుకు నాథూరాం గాడ్సేకి తుపాకీ ఇచ్చింది సావర్కరేనని బాంబుపేల్చారు. బ్రిటిష్ వారికి సహకరించడమే కాదు బాపూజీని చంపే ఆయుధాన్ని కూడా సావర్కరే సమకూర్చారంటున్నారు తుషార్‌గాంధీ.
మహాత్ముడి హత్యకు రెండ్రోజుల ముందుదాకా గాడ్సే దగ్గర తుపాకీ కూడా లేదు. ఆ తుపాకీని గాడ్సేకి ఇచ్చింది సావర్కరేనంటూ తన వాదనకు బలం చేకూర్చే చారిత్రక ఆధారాలను తుషార్‌గాంధీ చూపిస్తున్నారు. పోలీసుల రికార్డుల ప్రకారం 1948 జనవరి 26, 27 తేదీల్లో అంటే గాంధీ హత్యకు మూడురోజులముందు నాథూరాం గాడ్సే, వినాయక్ అప్టేలు సావర్కర్‌ను కలుసుకున్నారు. తర్వాత గ్వాలియర్నుంచి పిస్తోలు సంపాదించారు. దీన్ని బట్టే హత్యకు ఆయుధం సమకూర్చింది ఎవరో అర్ధంచేసుకోవచ్చంటున్నారు తుషార్‌గాంధీ. తాను కొత్తగా చేసిన ఆరోపణలేమీ లేవంటున్నారు. కొందరు ఔనంటారు.. మరికొందరు కాదంటారు. ఎవరెలాంటి భాష్యాలు చెప్పినా చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు!