– ఆళ్లకో లెక్కుంది..దానికింకా సమయం ఉంది!
– గుజరాత్ ఎన్నికలకు మంచి ముహూర్తం దొరకలేదేమో!
రేపోమాపో ఎన్నికలన్నట్లు గుజరాత్‌లో ప్రచారం హోరెత్తిపోతోంది. స్వయానా ప్రధాని మోడీ రోడ్‌షోల్లో పాల్గొంటూ క్యాంపెయిన్‌ని హీటెక్కిస్తున్నారు. ఎన్నికలు ముంగిట్లో ఉన్నట్లే. అవెప్పుడన్నది ఎన్నికల సంఘం లాంఛనంగా ప్రకటించడమే మిగిలి ఉంది. ఏ క్షణమైనా ఎన్నికల ప్రకటన వస్తుందనుకుంటే విచిత్రంగా కేంద్ర ఎన్నికల సంఘం కేవలం హిమాచల్‌ప్రదేశ్ షెడ్యూల్‌నే ప్రకటించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆపాలంటే ఆగేవి కావు. శాసనసభ గడువుతీరేలోపు ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాల్సిందే. అయితే గుజరాత్ విషయంలో కేంద్ర ఎన్నికలసంఘం తొందరపడలేదు. గుజరాత్ ఎన్నికల తేదీలు ప్రకటించకుండా ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఎలక్షన్ కమిషన్ ముందే వివరణ ఇచ్చింది. తాజాగా ఎన్నికలసంఘం ప్రకటన కేవలం హిమాచల్ ప్రదేశ్‌కే పరిమితం కావటంతో సహజంగానే అనుమానాలు మొదలయ్యాయి. అయితే తమకో లెక్క ఉందంటోంది ఎలక్షన్ కమిషన్. వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతోంది.
సాధారణంగా అసెంబ్లీల పదవీకాలాలు ఆరు నెలల వ్యవధిలో ముగుస్తుంటే.. ఆ రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపు కూడా ఒకే రోజున ఉండేలా చూస్తారు. హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ గడువు 2023 జనవరి 8తో ముగుస్తోంది. గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18తో పూర్తవుతుంది. దీంతో ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే అంతా అనుకున్నారు. అయితే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి వాతావరణ కారణాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచేశారు.
కేవలం వాతావరణమే కాదట. ఇతర అనేక కారణాలతోనే హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల తేదీలను కాస్త ముందే ప్రకటించామంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. 2017లో కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరించే ఎన్నికలు జరిగాయని గుర్తుచేస్తోంది. 2017 అక్టోబరు 13న హిమాచల్‌ప్రదేశ్, అక్టోబరు 25న గుజరాత్‌కు షెడ్యూల్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల ఫలితాలను ఒకేసారి వెల్లడించారు. ఇప్పుడు కూడా నిబంధనలను తూచ తప్పకుండా పాటించామంటున్నారు.
రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు మధ్య 40 రోజుల వ్యవధి ఉంది. ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్రంపై పడకుండా ఉండాలంటే కనీసం 30 రోజుల వ్యవధి ఉంటే చాలనే లాజిక్ చెబుతోంది కేంద్ర ఎన్నికలసంఘం. హిమాచల్‌ప్రదేశ్ పోలింగ్‌కి, ఫలితాలకు మధ్య నెలపైనే సమయం ఉంది. ఆ మధ్యకాలంలోనే గుజరాత్ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనతో కేంద్ర ఎన్నికలసంఘం ఉన్నట్లు కనిపిస్తోంది.