ఆ బెంగాలీ భామ అలా ఎందుకు చేసింది ? వాళ్ల డాడీకి కూడా షాకింగ్ న్యూసేనా ?

By KTV Telugu On 20 April, 2022
image

ప్రతీ పురుషుని విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు. ఒక జాతి, ఒక దేశ విజయం వెనుక కూడా మహిళల పాత్ర ఉంటుంది. పరాజయం పొందినా మళ్లీ విజయం సాధించే వరకు మహిళ పోరాడుతూనే ఉంటుంది. సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇప్పుడీ మహిళ కూడా అదే పని చేస్తోంది…నిజానికి ఆమె విజయం సాధించలేదు ఎవరినీ గెలిపించనూ లేదు తల్లిదండ్రులకు చెప్పకుండా ఎవరినీ పెళ్లి చేసుకోనూ లేదు అయినా ఆమె ఇప్పుడు వార్తల్లో నలగుతున్న విప్లవ నారీగా ఎందుకు పేరు పొందింది.. ఇంతకీ ఆమె చేసిందేమిటి…

ఆమె ఎవరు ?

ఆమె ఎన్నికల్లో గెలవలేదు. విజేతకు ఆమెకు 20 వేల ఓట్లు తేడా ఉంది. అయినా ఇప్పుడామె దేశ వ్యాప్తంగా సంచలమయ్యారు. చచ్చిపోయిందనుకున్న పార్టీని ఆమె లాంటి కొత్త తరమే నిలబెట్టగలదని కూడా ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి సారే ఆమెకు గుర్తింపు వచ్చింది..ఆమే సైరా షా హలీమ్…. రికార్డు కోసం చెప్పాలంటే.. ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా సోదరుడి కుమార్తె ఆమె. ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని బాలీగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీపీఎం తరపున పోటీ చేసి రెండో స్థానం పొందారామె..

… బాలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేశారు. కేంద్ర మంత్రిగా పనిచేసి బీజేపీపై అలిగి.. తృణమూల్ లో చేరిన బాబుల్ సుప్రియో ఆమె ప్రత్యర్థి. తృణమూల్ దెబ్బకు సైరాకు డిపాజిట్ రావడం కూడా కష్టమేననుకున్నారు. అందులోనూ బెంగాల్ లో కాలం చెల్లిన సీపీఎం తరపున పోటీ చేయకుండా ఉండాల్సిందని సైరాను చాలా మంది డిస్కరేజ్ చేశారు. అయినా ఆమె ఎక్కడా నిరాశ చెందలేదు. శ్రమ అనుకోకుండా ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. చివరకు ఓడిపోయినా.. ఆమెకు వచ్చిన ఓట్లు బెంగాల్ లో సీపీఎంకు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి…

2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన సీపీఎం మళ్లీ కోలుకోవడం దుర్లభమనుకున్నారు. బెంగాల్ వ్యాప్తంగా ఆ పార్టీకి కేవలం 4..73 శాతం ఓట్లు వచ్చాయి. ఒక ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేకపోయారు. బాలీగంజ్ లో కూడా సీపీఎంకు వచ్చినదీ 5 శాతమే. ఉప ఎన్నికల్లో మాత్రం సీపీఎంకు 30 శాతం ఓట్లు వచ్చాయి. పార్టీ ఓట్ షేర్… 5 నుంచి 30 శాతానికి పెరగడం వెనుక సైరా షా హలీమ్ శ్రమ 100 శాతం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బెంగాల్ లో సీపీఎం అధికారాన్ని కోల్పోయి పదేళ్లు దాటిన నేపథ్యంలో పార్టీ పునరుజ్జీవానికి బాలీగంజ్ లో పునాది పడిందని ఆ పార్టీ వారి వాదన…

సైరా.. కోల్ కతాలో పుట్టారు ఆమె తండ్రి జమీరుద్దీన్ షా.. ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేశారు. తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా సేవలందించారు. తండ్రి ఆర్మీలో పని చేయడంతో సైరా.. దేశమంతా చూడగలిగారు. ప్రపంచాన్ని చదివారు. ప్రజల స్థితిగతులను అర్థం చేసుకున్నారు. జనంలో ఒకరై తిరిగారు. అదే ఆమె పాపులారిటీకి కారణం..

బాలీగంజ్ లో నైతిక విజయం సాధించామని సైరా స్వయంగా చెప్పుకున్నారు. బెంగాల్లో సీపీఎం పునరాగమనం ఖాయమని ఆమె వాదిస్తున్నారు.తృణమూల్ కాంగ్రెస్ రౌడీయిజం, బీజేపీ మతవాదంపై పోరాడి తమ పార్టీని మళ్లీ అభివృద్ధి చేసుకుంటున్నామని సైరా అంటున్నారు. అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొని 30 శాతం పైగాా ఓట్లు సాధించామని వివరిస్తున్నారు. నిజానికి కమ్యూనిస్టు పాలనను అంతమొందించినది కూడా ఒక మహిళే. మమతా బెనర్జీ క్షేత్రస్థాయి నుంచి పోరాటం ప్రారంభించి… పదేళ్లకాలంలో అధికారానికి వచ్చారు. ఇప్పుడు సైరా కూడా అదే దారిలో నడుస్తున్నారని చెప్పుకోవాలేమో…