క్రీడల్లో రాణించాలంటే మాటలు కాదు. అహరహం శ్రమించాలి. ఆవేదనే కానీ, ఆనందం ఉండదు. అవమానాలు, అవరోధాలను ఎదుర్కోవాలి. అప్పటికే పాతుకుపోయిన క్రీడాకారులు.. డామినేట్ చేస్తుంటారు. అన్నింటినీ భరించి అవకాశం కోసం ఎదురుచూడాలి. మహిళా క్రీడాకారులకు ఈ సమస్యలు మరీ ఎక్కువ. అన్నింటినీ అధిగమించి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా నిలించిందీ..
యువ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్
బాక్సింగ్ చాలా క్లిష్టమైన క్రీడ. ఒక పంచ్ పడితే దిమ్మదిరిగే క్రీడ. కొత్త వాళ్లను చూసి సీనియర్లు ఎవరు వాళ్లు.. అని ఎగతాళిగా అడిగే క్రీడ. నిఖత్ జరీన్ ఇలాంటి అవమానాలను ఎన్నో ఎదుర్కొంది. ఒక సారి నీకు అంత సీన్ ఉందా అని కూడా అడిగారు. ఆమె తడబడిందీ, నిలబడింది.. దెబ్బలాడింది… నాకెందుకు అవకాశమివ్వరని నిలదీసింది. చివరకు ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ షిప్ మాత్రమే కాకుండా ఈ ఏడాదిలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది.
నిఖత్ జరీన్ , బాక్సింగ్ రింగ్ లోకి అడుగు పెట్టి దశాబ్దం దాటింది. 2011లో మహిళల జూనియర్ టైటిల్ గెలిచింది. అప్పటికీ ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత గౌరవ మర్యాదలు, సన్మానాలు పొందిన తొలి క్రీడాకారుల్లో ఆమె కూడా ఉంది. కుటుంబ సభ్యులను ఒప్పించి బాక్సింగ్ లో కొనసాగడం కోసం ప్రత్యర్థుల నోళ్లు మూయించడం కోసం ఆమె తీవ్రంగా శ్రమించింది. తన చిన్ననాటి అభిమాన క్రీడాకారిణి మేరీ కోమ్ చేతిలో ఓటమి ఆమెకు స్పూర్తిదాయకమైంది. ఇప్పుడు విజేతగా నిలిచేందుకు అవకాశమిచ్చింది. తొలి మెడల్ సాధించి పుష్కరకాలం గడిచినా ఇప్పుడే రంగంలోకి దిగినట్లుగా ఆమెలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది…
అందరూ ఎదురు చూసిన క్షణం ఆమె ఎవరినీ నిరాశపరచలేదు. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో థాయిలాండ్ బాక్సర్‌పై విజయం సాధించి, స్వర్ణ పతకం చేజిక్కించుకొని భారత్ తరఫున కొత్త చరిత్ర లిఖించింది. తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్ ఇప్పటికే చరిత్ర సృష్టించింది. ఇప్పుడు సీనియర్ స్థాయిలోనూ తొలిసారి టైటిల్‌ను ముద్దాడి కొత్త చరిత్ర లిఖించింది. రింగ్‌లో సివంగిలా చెలరేగిపోయి అభిమానుల మనసులను గెలుచుకుంది. గురువారం తుది పోరులో 52 కేజీల విభాగంలో థాయిలాండ్‌కు చెందిన జిట్పాంగ్ జుటామస్‌ను ఓడించింది. మహిళల బాక్సింగ్‌లో ఇప్పటివరకూ మేరీకోమ్, సరితాదేవి, ఆర్.ఎల్. జెన్నీ, లేఖ ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. ఇప్పుడు ఆ జాబితాలో ఐదో బాక్సర్‌గా నిఖత్ జరీన్ చేరింది. తొలి రౌండ్ నుంచే అద్భుత ప్రతిభ కనబర్చిన నిఖత్ జరీన్.. స్వర్ణం కొట్టేస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. తాను చెప్పినట్లే బాక్సింగ్ రింగ్‌లో రెచ్చిపోయింది.
నిజామాబాద్ అమ్మాయి..
నిఖత్ జరీన్, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పుట్టింది. 1996లో జన్మించింది. తల్లిదండ్రులు జమీర్ అహ్మద్, పర్వీన్ సుల్తానా. బాక్సింగ్ లో నిఖత్ టాలెంట్ ను గుర్తించినప్పటికీ పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇప్పించేందుకు తొలుత వెనుకాడారు. ఆమె జూనియర్ ఛాంపియన్ షిప్ నెగ్గిన తర్వాత వాళ్లు కూడా ప్రోత్సహించారు. నిఖత్ హైదరాబాద్ లోని ఏవీ కాలేజీలో చదివింది. బాక్సింగ్ ట్రైనింగ్ కోసం విశాఖ స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియాలో చేరింది. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూడలేదు…