ఏడాది ఆఖరుకు ప్రపంచం తల్లకిందులవుతుందా ? పేద, అభివృద్ధి చెందుతున్న దేశ వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోతాయా ? పాత అప్పులు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక నానా తంటాలు పడతాయా ? రిసెషన్ ను తట్టుకోవడం పేద దేశాల వల్ల కాదా ? శ్రీలంక తరహా పరిస్థితులు అనేక దేశాలను వెంటాడుతాయా ? ఈ గండం గడిచేదెలా.. ప్రపంచ దేశాల ముందున్న పరిష్కారమేమిటి..
ప్రపంచ దేశాలు ఆర్థిక పరంగా వరుస సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. 1980ల్లోనే లాటిన్ అమెరికా దేశాలు ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. తొలుత మెక్సికో తర్వాత బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, కొలంబియా, పెరు, ఈక్వెడార్.. ఆర్థిక మందగమనానికి కేంద్ర బిందువులయ్యాయ్యా. అప్పులు ఊబిలో కూరుకుపోయి దివాలా తీసే పరిస్థితి నెలకొంది. ఇప్పట్లో విదేశీ అప్పులు తీర్చలేమని చేతులెత్తేసి.. ఐపీ పెట్టినంత పనిచేశాయి. అక్కడ ఆర్థిక మందగమనం, విదేశీ అప్పులు, నియంత్రణలో లేని ద్రవ్యోల్బణం, నిరుద్యోగం లాటిన్ అమెరికా ప్రభుత్వాల దగ్గర పైసా లేకుండా చేశాయి.
ఆర్థిక నిపుణులు సామాజిక శాస్త్రవేత్తలు అంతా ఊహించినట్టే జరుగుతోంది. దేశాలకు దేశాలే ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటున్నాయి. మరోసారి ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యాన్ని ఇంకా ప్రపంచ దేశాలు అప్పుడే మర్చిపోలేదు. ఇప్పుడు అదే తరహాలో ప్రపంచ దేశాలను ఆర్థిక మాంద్యం చుట్టుముడుతోందనే ఆర్థిక నిపుణుల హెచ్చరికలు అందరిలోనూ ఆందోళన పెంచుతున్నాయి. అందులోనూ ఏకంగా 69 దేశాలు ఆర్థిక మాంద్యం ముంగిట ఉన్నాయనే వార్త అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది. కరోనా ఒక పక్క… రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరో పక్క ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. అప్పుల కోసం భారీగా వడ్డీల చెల్లింపుకు దిగాల్సి వస్తోంది…
లాటిన్ అమెరికా దేశాలు ఆఫ్రికా దేశాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. సాధారణంగానే ఆ దేశాల్లో అస్తవ్యస్త పాలన స్థిరత్వం లేని ప్రభుత్వాలు సైనిక జోక్యాలు విపరీతమైన అవినీతి ఎక్కువ. ఇప్పుడు వీటికి పులి మీద పుట్రలా గత రెండేళ్లుగా కోవిడ్ సృష్టించిన సంక్షోభం ప్రస్తుత ఉక్రెయిన్ – రష్యా యుద్ధం దాపురించాయి. దీంతో ఇంధన ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. లెక్కకు మిక్కలి అప్పులు తీవ్ర నిరుద్యోగం ఆర్థిక వృద్ధి మందగమనం అధిక ద్రవ్యోల్బణం లాటిన్ అమెరికా ఆఫ్రికా దేశాల పుట్టి ముంచుతోంది. ఆఫ్రికాలో 25 దేశాలు,ఆసియా పెసిఫిక్ లో 25 దేశాలు,ఆఫ్రికాలో 19 దేశాలు శ్రీలంక తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా దేశాల్లో 170 కోట్ల జనాభా ఉండగా.. అక్కడి జనం శ్రీలంక తరహా నిరసనలకు సిద్ధమవుతున్నారు.
ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఎప్పుడో ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో చమురు ధరలు వంట నూనెల ధరలు రాకెట్ స్పీడుతో పెరిగాయి. ప్రపంచ చమురు అవసరాల్లో దాదాపు పావు శాతం అంటే 25 శాతం రష్యానే తీరుస్తోంది. అలాగే వనస్పతి నూనెల ఎగుమతుల్లో ఉక్రెయిన్ ప్రపంచంలోనే అగ్ర దేశాల్లో ఒకటిగా ఉంది. ఇక ఈజిప్టు ఆర్థిక సంక్షోభానికి ఆహార దిగుమతులే కారణంగా చెప్పాలి. రష్యా నుంచి గోధుమలు దిగుమతి చేసుకుంటున్న ఈజిప్టుకు సరఫరాలు ఆగిపోయాయి ప్రస్తుతం ఆ దేశంలో మూడు నెలలకు సరిపడా మాత్రమే గోధుమ నిల్వలున్నాయి. యుద్ధం ఆగకపోతే అక్కడ ఆకలి చావులు ఖాయం. టునీషియా నిండా అప్పుల్లో మనిగిపోయింది. ఆ దేశంలో జీడీపీకి సరిపోను విదేశీ రుణాలున్నాయి. ఉక్రెయిన్ నుంచి గోధుమలు దిగుమతి చేసుకునే లెబనాన్ కూడా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆ దేశం ప్రపంచ బ్యాంక్ నుంచి 150 మిలియన్ డాలర్ల లోను తీసుకుంది. ఎల్ సాల్వడార్, పెరు మునిగిపోతాయని ఐఎంఎఫ్ హెచ్చరిస్తోంది. ఇక ఆఫ్రికా దేశాల్లో.. ఘనా – ఇథియోపియా – కెన్యా – దక్షిణాఫ్రికాల్లోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆసియా – ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉన్న టర్కీ కూడా ఆర్థిక పతనం దిశగా సాగుతోంది.
శ్రీలంకకు పొరుగున ఉన్న మన దేశంలో అప్పుల్లో ఎవరికీ తీసిపోలేదు. వరుస ఆర్థిక సంక్షోభాలు మనల్ని వెంటాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పీకల్లోతు అప్పుల్లో ఉన్నాయి. శ్రీలంకతో సమానంగా అప్పుల్లో మునిగిపోయాయి. జనాకర్షణ పథకాలు ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని బ్యూరోక్రాట్లు హెచ్చరిస్తున్నారు..
2022 ఆఖరుకు ప్రపంచం దివాలా తీస్తుందన్నవిశ్లేషణల నడుమ సత్వర చర్యలపై దృష్టి పెట్టాల్సి ఉంది. చైనా, కబంద హస్తాల్లో చిక్కుకుని శ్రీలంక విలవిడలాడుతున్న తరుణంలో మరో దేశం అలాంటి పరిస్థితిని ఎదుర్కోకుండాచూడాలి. అప్పులిచ్చే దేశాల్లో చైనా అగ్రభాగాన ఉంది. చైనా విధించే షరతులతో రుణ గ్రహీతలు నిలువు దోపిడీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. అందుకే పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు చైనా బారిన పడకుండా చూసుకోవాలి. అప్పులు తీసుకోవడం, ఆర్థిక నిర్వహణలో సమర్థత పెరగాలి. అవసరాలను లెక్కగట్టుకుని అప్పులు తీసుకోవాలి. షెడ్యూల్ ప్రకారం అప్పులు తీర్చేందుకు ప్రయత్నించాలి. అప్పుడు తక్కువ వడ్డీతో మళ్లీ రుణాలు పొందే వీలుంటుంది. విదేశీ కరెన్సీ రూపంలోనే అప్పులు పొందగలిగితే.. చమురు సహా ఇతర వస్తువులను సులభంగా కొనుగోలు చేసే వీలుంటుంది. పేద, అల్పాదాయ. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యా, వైద్యానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. దేశాల బడ్జెట్ లో సింహభాగం ఆ ఖాతాకే వెళ్తోంది. అందుకే వ్యయాల్లో హేతుబద్ధత, పారదర్శకత అవసరమని విశ్లేషణలు వపిస్తున్నాయి. అవసరాన్ని బట్టి రుణాల పునర్ వ్యవస్థీకరణకు జీ -20 ఇచ్చిన సలహాలు పాటించాలి..73 దేశాలు ఇప్పుడు ఈ దిశగా ఆలోచిస్తున్నాయి…