” కక్ష సాధింపుల రాజకీయం ” చివరికి భస్మాసుర హస్తమే !

By KTV Telugu On 12 May, 2022
image

మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడ్నీ వదలం.. మీ సంగతి తేలుస్తా..” ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర్నుంచి వైసీపీ నేతల వరకూ.. అందరి నోటా ఈ డైలాగ్ వచ్చేది. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అదే పనిలో ఉన్నారు. మూడేళ్ల వరకూ పగలు.. ప్రతీకారాలు తీర్చుకున్నా చివరి రెండేళ్లు మంచి పాలన చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటి చాన్స్ కూడా లేదని మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌తో తేలిపోయింది. రాజకీయాల్లో కక్ష సాధింపులంటే… తన నెత్తిమీద తాము చెయ్యి పెట్టుకోవడం అని రాజకీయ నేతలందరికీ బాగా తెలుసు. కానీ ఏపీ సీఎం జగన్‌కు మాత్రం ఇంకా తెలుసుకోలేకపోయారు.

తమిళనాడు తరహాలో కక్ష సాధింపులు !

అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ వారైనా అధికారులపై కానీ.. ప్రతిపక్ష పార్టీల నేతలపై కానీ.. టార్గెట్ చేసి మరీ కక్ష సాధించే ప్రయత్నాలనే ఎజెండాగా పెట్టుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పెట్టుకుంది. ఉద్యోగులు, సివిల్ సర్వీస్ ఆఫీసర్లపైనే కాదు రాజకీయ నేతల్ని వదిలి పెట్టలేదు. స్పీకర్‌గా పని చేసిన కోడెల శివప్రసాదరావు … తన పరువు పోయిందని.. ఆత్మహత్య చేసుకున్నారంటే.. ప్రభుత్వం ఎంత దారుణంగా.. కక్ష సాధింపులకు పాల్పడిందో.. అర్థం చేసుకోవడం సులభమే. అది ఇప్పటికీ సాగుతోంది. లేని ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో చంద్రబాబుపై కేసు పెట్టడమే దీనికి సాక్ష్యం. అధికారం అందింది కాబట్టి… ప్రతిపక్ష పార్టీ నేతలపై ఎలాగైనా కేసులు పెట్టాలన్న లక్ష్యంతో.. ప్రభుత్వం పని చేస్తూనే ఉంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమీక్షించడానికి చాలా సమయం కేటాయించింది. అనేక మంత్రివర్గ ఉపసంఘాలు.. విచారణ కమిటీలు వేసింది. ఆ విచారణల పేరుతో.. మీడియా లీకులు ఇచ్చి.. అలా జరిగిందా.. అని ప్రచారం చేయగలిగారు కానీ… ఇంత వరకూ గత ప్రభుత్వంలో జరిగిన ఒక్క అవినీతి కేసునూ బయటపెట్టలేకపోయారు. అమరావతి భూముల స్కాం దగ్గర్నుంచి అన్న క్యాంటీన్ల వరకూ అన్నింటిలోనూ… అవినీతేనని బయట పెడతామని చెప్పారు కానీ.. చెప్పలేకపోయారు. కానీ ఆ విచారణల పేరుతో. సీఐడీని టీడీపీ నేతల ఇళ్లపైకి పంపి.. వారిలో భయాందోళనలు కల్పించే వ్యూహంలో మాత్రం విజయం సాధించారు. కక్ష సాధింపుల పాలనలో ఇదో పరాకాష్ట లాంటి వ్యవహారం.

అధికారపార్టీ ప్రతిపక్షంలా వ్యవహరిస్తే ఇదే పరిస్థితి !

పాలకుల మైండ్ సెట్… అక్కడే ఉంది. తమ కసి ఎంత తీర్చుకున్నామన్నదానిపైనే రోజువారీ కార్యకలాపాలు నడిచాయంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా వారిపై తెలుగుదేశం పార్టీ ముద్ర వేయడం దగ్గర్నుంచి… వారిని నానా రకాలుగా.. వేధించడం వరకూ అన్నీ జరిగాయి. జరుగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలానే ఉండాలి. అధికారపక్షంలోకి వచ్చినప్పుడు అధికారపక్షంలానే ఉండాలి. అధికారం అందిన తర్వాత ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటే… కక్ష సాధింపులతో రెచ్చిపోతే.. అది ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజలు అధికారం ఇచ్చింది.. తమకు మంచి చేస్తారనే.. వ్యక్తిగత కక్షలు.. రాజకీయ కార్పణ్యాలు తీర్చుకోమని కాదు. కానీ దురదృష్టవశాత్తూ.. ప్రస్తుత ప్రభుత్వం… అలా అనుకోవడం లేదు. అధికారం దొరికింది.. ఇష్టం లేని వాళ్లపై దండెత్తడానికే అనుకుంటోంది. ఇప్పటికీ అదే జరుగుతోంది.

అధికారం పోతే వాళ్లూరుకుంటారా ?

అధికారం శాశ్వతమని.. అధికారంలో ఉన్న వారికి అనిపించవచ్చేమో కానీ.. కాస్త తెలివి ఉన్న వారెవరికైనా.. అది అశాశ్వతతమని తెలుసు. రేపు కచ్చితంగా అధికారం పోతుంది. అప్పుడు.. ఇప్పుడు.. వేధింపులకు పాల్పడుతున్న నేతలు.. ఆ పార్టీలో ఉన్న వారి పరిస్థితేమిటన్నది … ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడు దెబ్బలు తింటున్న నేతలు.. అప్పుడు.. సైలెంట్ గా ఎలా ఉంటారు..? ” అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగడం తగదని రాజకీయాల్లో ఉన్నవారు తెలుసుకోవాల్సి ఉంది. అనుభవమైతేనే తత్వం బోదఫడుతుందంటారు.. కానీ అనుభవమైతే అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇక్కడ నష్టం జరిగేది రాజకీయ నేతలకు మాత్రమే కాదు.. రాష్ట్రానికి కూడా.