రిజైన్‌ చేసి టీచర్‌ జాబ్‌ చేస్తానంటున్న వైసీపీ ఎమ్మెల్యే

By KTV Telugu On 10 October, 2022
image

1. ఎమ్మెల్యే పదవికి కరణం ధర్మశ్రీ రాజీనామా
2. 1998 డిఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణుడైన కరణం ధర్మశ్రీ

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీచర్‌ జాబ్‌ చేసేందుకు సిద్ధమ్యారు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఎమ్మెల్యే వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఒకవైపు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర చేస్తుండగా…మరోవైపు మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ స్వరం పెంచింది. వికేంద్రీకరణకు మద్దతుగా వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, వైసీపీ నేతలు నాన్ పొలిటికల్ జేఏసీతో కలిసి మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశారు. అవసరమైతే తమ పదవులకు రాజీనామా చేస్తామంటూ సరికొత్త అస్త్రం బయటకు తీశారు.
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మరో మరో అడుగు ముందుకేసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్ కు అందజేశారు. ఈ నేపథ్యంలోనే తన రాజీనామాను ఆమోదిస్తే చక్కగా వెళ్లి టీచర్ ఉద్యోగంలో చేరుతానంటూ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆయన ఎందుకలా అన్నారంటే…
ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న 1998 డిఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు జగన్ సర్కార్ పోస్టింగ్ లు ఇవ్వాలని ఇటీవల నిర్ణయించింది. ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారిని నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 1998 డీఎస్సీ పరీక్షలో కరణం ధర్మశ్రీ కూడా ఎంపికయ్యారు. కానీ నియామక ప్రక్రియ ఆలస్యం కావడంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న 1998 డీఎస్సీ అభ్యర్థుల నియామకానికి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు తన సర్టిఫికెట్లు కూడా పంపినట్లు కరణం ధర్మశ్రీ తెలిపారు. ఒకవేళ తన రాజీనామా ఆమోదం పొందితే చోడవరం సమీపంలోని పీఎస్‌పేటలోని ప్రభుత్వ స్కూల్ లో ఉపాధ్యాయుడి పోస్టులో చేరతానని చెప్పుకొచ్చారు.