ఇచ్చేస్తారా.. ఆ సారు ఉత్తుత్తికే అన్నారా…. రాజకీయ ఉద్యోగాలకు యువత రెడీనా….

By KTV Telugu On 21 May, 2022
image

ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు పార్టీలకు అన్ని వర్గాలు గుర్తుకు వస్తాయి. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మహిళలు… అన్నింటికీ మించి యువత వద్దన్నా గుర్తుకు వస్తుంది. యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించి, వారికి సముచిత స్థానం ఇచ్చినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని అగ్రనేతలు గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చేస్తారు. తీరా ఎన్నికల సమయానికి 20 శాతం సీట్లిస్తే గొప్ప.. కొన్ని పార్టీల్లో అదీ కూడా ఇవ్వరు. అలా ఇచ్చినా అప్పటికే పార్టీలో పదవులు అనుభవిస్తున్న వారి పిల్లలకు టికెట్లిచ్చి ఇన్నీ ఇచ్చామంటూ లెక్క చెబుతారు. అలా చేసిన తర్వాత కూడా యువతకు సముచిత స్థానం కనిపించదు. ఎన్నికలు ముగిసిన తర్వాత లెక్క చూస్తే అంతా అబద్ధమని తేలిపోతుంది. భూమి గుండ్రంగా ఉన్నట్లు ఇదీ కూడా రొటీన్ గా జరిగే పనే.. మరి ఈ సారి ఏం జరగబోతోంది?

కాంగ్రెస్, టీడీపీ ఈ రెండు పార్టీలు తొందరపడో… వేరే కారణం చేతనో ముందే తమ వైఖరిని ప్రకటించాయి. దేశ రాజకీయాల్లో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది. పార్టీలోని అన్ని విభాగాల్లో యువతకు కనీసం యాభై శాతం పదవులు ఇస్తామని ఉదయ్ పూర్ చింతన్ బైఠక్ లో చర్చించి ప్రకటించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు హెచ్చరికగా కూడా భావించాల్సి ఉంటుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లే పదవులను పట్టుకుని వేలాడుతూ.. యువతకు అవకాశం ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. యువతకు చాన్స్ వచ్చేందుకు వీలుగా ఒక కుటుంబానికి ఒక పదవి మాత్రమేనని తేల్చిచెప్పారు.

టీడీపీలో 40 శాతం

ఆంధ్రప్రదేశ్ లో కూడా 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. బాదుడే బాదుడు పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల్లో తిరుగుతున్నారు. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ.. ఎక్కడికక్కడ వాటిని జనంలోకి తీసుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ టికెట్ల‌లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తుందని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అంటే ఏపీలో ఉన్న 175 స్థానాల్లో 70 నుంచి 75 సీట్ల వరకు యువతకు కేటాయించాలి. చంద్రబాబు ఉద్దేశం బాగానే ఉంది. ఆచరణలోనే ఇబ్బందులు రావచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సామాజిక వర్గాల నుంచి నియోజకవర్గాల వరకు ఈ ఇబ్బందులు ఉండొచ్చు. రాజకీయ వారసులు సిద్ధమైపోయి.. యువత కోటాలో తమకే టికెట్లు ఇవ్వాలని పట్టుబడితే మొదటికే మోసం రావచ్చు…

దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా యువత బాగా వెనుకబడిపోయిన మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారికి ఎక్కువ టికెట్లు కేటాయించడం లేదు. ఎన్నికల రాజకీయం ఇప్పుడు డబ్బుతో ముడిపడిన  అంశం. ఎన్నికల సంఘం నిర్ణయించిన వ్యయ పరిమితికి కనీసం 70 నుంచి 100 రెట్లు ఖర్చు పెట్టగలిగితేనే గెలిచే అవకాశం ఉంది. పార్టీలో కమిటెడ్ గా పనిచేసే యువ క్రియాశీల కార్యకర్తల దగ్గర అంత డబ్బు ఉండడం లేదు. దానితో మళ్లీ యువత రూపంలో రాజకీయ వారసులే తెరమీదకు వస్తారు. ఎందుకంటే వారికి డబ్బుకు కొదవ లేదు…

సమస్యలెన్నో…

రాజకీయాల్లోకి రావడం సంగతి దేవుడెరుగు.. యువత ఎన్నో సామాజిక, ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ఉద్యోగావకాశాలు పుర్తిగా తగ్గిపోయాయి. ఆర్థిక మాంద్య పరిస్థితులతో స్వయం ఉపాధి కూడా దెబ్బతింటోంది. స్పార్టప్ లు ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పుడు యువత ఒకటికి వంద సార్లు ఆలోచిస్తోంది. ఉపాధి శిక్షణ లాంటి మాటలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టి యువతకు న్యాయం చేసిన తర్వాత రాజకీయాల్లో సీట్లు, పదవులపై హామీలిస్తే బావుంటుందన్న వాదన వినిపిస్తోంది. అధినాయకులకు అర్థమవుతుందో లేదో…