తన పరిపాలనపై సీఎం జగన్ కు ఫుల్ కాన్ఫిడెన్స్?
కానీ, 175 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశముందా?
ఏ లెక్కన 30ఏళ్లు అధికారంలో ఉంటామంటున్నారు?
విపక్షాలన్నీ కలిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరిస్థితేంటి?
ఏపీ సీఎం జగన్ 30ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండడం సాధ్యమయ్యే పనేనా? వచ్చే ఎన్నికల్లో 175కు 175 నియోజకవర్గాలు వైసీపీ గెలిచే అవకాశముందా? జగన్ ఏ కోణంలో అలాంటి లెక్కలు వేసుకుంటున్నారు? సంక్షేమాన్ని బేస్ చేసుకొని అంటున్నారా? లేక చంద్రబాబుకు వయసు మీదపడుతున్నందన మరోసారి గెలిస్తే 30ఏళ్లు తమకు తిరుగుండదని భావిస్తున్నారా?ఎలాగైనా 2024లో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు ముఖ్యమంత్రి. అందుకు చాలా కారణాలే చెబుతున్నారు. ప్రజల కోసం చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అందించిన సంక్షేమ పథకాలు కళ్లముందు కనబడుతున్నప్పుడు….అన్ని స్థానాలు గెలవడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాన్ని జగన్ తమ నేతలకు చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నంటినీ దాదాపుగా నెరవేర్చామని అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలం నుంచే చెబుతూ వస్తోంది వైసీపీ. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయనేది వైసీపీ వెర్షన్. మేనిఫెస్టోలో చెప్పినవే గాకుండా చెప్పని వాగ్ధానాలు కూడా నెరవేర్చామని గడపగడపకు వెళ్లి వైసీపీ శ్రేణులు ప్రజలకు వివరిస్తున్నాయి. నిజమే, ప్రభుత్వం భారీగా ఏపీలో ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. కానీ, దాంట్లో ఉన్న లోటుపాట్లతో పాటు ప్రభుత్వ తప్పిదాలను, అన్యాయాలను విపక్షాలు వేలెత్తి చూపిస్తున్నాయి.
తన పరిపాలన గురించి జగన్ అతిగా ఊహించుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశారని, వైసీపీ నేతలు అడ్డగోలుగా భూదోపిడీలకు పాల్పడుతున్నారని, తన తప్పులను ప్రశ్నించిన వారిని ప్రభుత్వం కేసులు, అరెస్ట్ లతో భయభ్రాంతులకు గురిచేస్తోందని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని ఇలా అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి ప్రభుత్వం వేసే చెత్తపన్ను వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. విపక్షాల విమర్శలకు అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పి ఉండవచ్చు గాక. కానీ, ప్రజల మనసును గెలుచుకోవడం అతి ముఖ్యం . ఇవన్నీ ఒక ఎత్తయితే సామాజిక సమీకరణాలు, పార్టీల పొత్తులు ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి.
2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లను గెలుచుకుంది వైసీపీ. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎలక్షన్ లోనూ హవా కొనసాగించింది. ప్రభుత్వంపై ప్రజల ఆదరణ మరింత పెరిగిందనే నిర్ణయానికి జగన్ ప్రభుత్వం వచ్చేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు గురించి…ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూనే, సర్వే రిపోర్ట్ లు తెప్పించుకుంటున్నారు జగన్. ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే తమ ప్రజాప్రతినిథులు నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకున్నారు. పనితీరు సరిగా లేనివారికి టికెట్లుండవని మొహాన్నే చెప్పేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిథులపై అక్కడక్కడ వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో, దాన్ని తొందరగా సరిదిద్దుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే అంతే స్పీడ్ గా ప్రజా సమస్యలపై విపక్షాలు పోరాడుతున్నాయి. 2014 లో మాదిరి టీడీపీ-జనసేన-బీజేపీలు 2024 ఎన్నికల్లో కదనరంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే, జగన్ అనుకుంటున్న 30ఏళ్ల అధికారం, 175 నియోజకవర్గాల్లో గెలుపు ఏమో గానీ…మరోసారి అధికారంలోకి వచ్చేందుకు చెమటోడ్చాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు విశ్లేషకులు.