ఒక కుటుంబం రెండు రాష్ట్రాలను శాసించాలని చూస్తోందా ? వైఎస్ ఫ్యామిలీకి ఆంధ్రప్రదేశ్ లో అధికారం సరిపోవడం లేదా ? చెల్లి షర్మిల రూపంలో తెలంగాణను హస్తగతం చేసుకోవాలని వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారా ? షర్మిల చేస్తున్న నానా యాగీతో పాటు విజయమ్మ కామెంట్స్ ఇస్తున్న సందేశమేమిటి ?
ప్రగతి భవన్లోకి దూసుకెళ్లే ప్రయత్నంలో షర్మిల విఫలం.
అరెస్టు తర్వాత బెయిల్ పొందిన వైఎస్ తనయ.
షర్మిల కోసం దీక్ష చేయబోయిన విజయమ్మ.
షర్మిల తీరుపై పలు వర్గాల్లో విమర్శలు.
జగన్ ఓ వైపు… షర్మిల, విజయమ్మ మరో వైపు.
వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా.
తాను తెలంగాణ బిడ్డనని చెప్పుకునేందుకు షర్మిల ప్రయత్నాలు.
జగన్ నుంచి దూరం జరిగినట్లు చెప్పేందుకు విజయమ్మ పాట్లు.
షర్మిల రాజకీయాలతో సంబంధం లేదని చెప్పలేకపోతున్న జగన్.
మహిళ సెంటిమెంట్ తో తెలంగాణ ఓట్లు దండుకునే ప్రయత్నం.
జనంలో తిరుగుతారు.. ఉప ఎన్నికల్లో పోటీ చేయారు.
నేరుగా 2023లోనే తడాఖా చూపిస్తారంటున్న పార్టీ నేతలు.
ప్పుడు రాజధాని హైదరాబాద్ లో హడావుడి చేసేస్తున్నారు. నేరుగా ప్రగతి భవన్ ముట్టడికే షర్మిల ప్రయత్నించారు కేసీఆర్ కారును ఢీకొట్టేందుకు టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో డ్యామేజ్ అయిన తన కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. . చివరకు పోలీసులు అరెస్టు చేస్తే హైడ్రామా సృష్టించిన తర్వాత బెయిల్ పొంది వెళ్లిపోయారు. సరిగ్గా అప్పుడే లోటస్ పాండ్ దగ్గర ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కూడా డ్రామా సృష్టించేందుకు ప్రయత్నించారు. కూతురిని ఆపారని తెలుసుకుని విజయమ్మ కారులో బయలుదేరారు. అక్కడ కూడా పోలీసులు ఆమెను ఆపడంతో ధర్నా, దీక్ష అంటూ గేమ్ మొదలుపెట్టారు. షర్మిలకు బెయిల్ వచ్చిందని తెలుసుకుని దీక్షను విరమించారు. ఇలా తల్లీ కూతుళ్లు కొత్త కథకు తెరతీశారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో రాజకీయాలు చేయాల్సిన వైఎస్ కుటుంబానికి తెలంగాణలో పనేమిటన్నది పెద్ద ప్రశ్నే. అనేక పర్యాయాలు ఈ ప్రశ్న వేసినా టీమ్ షర్మిల నుంచి సరైన సమాధానం రావడం లేదు. తాను హైదరాబాద్ లో పుట్టానని, తెలంగాణ కోడలినని ఏదో చెబుతూ ఆమె తప్పించుకుంటున్నారే తప్ప సరైన రీజన్ ఇవ్వడం లేదు. అలాగని షర్మిలను ఎవరూ ఆపలేరు. ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా రాజకీయాలు చేయెచ్చు. ప్రజలు ఆమోదించి ఓటేస్తే ముఖ్యమంత్రి కావచ్చు. బహుశా అన్న జగన్ రెడ్డి ఏపీలో రాజకీయాలు నడిపిస్తుంటే తాను తెలంగాణలో చక్రం తిప్పాలని షర్మిల అనుకుంటున్నారేమో పైగా జగనన్న వదిలిన బాణం అని ఒకప్పుడు షర్మిలను పిలుస్తుండగా ఇప్పుడు ఎవరు వదిలిన బాణమన్న సందేహం వస్తోంది. ఓట్లు చీల్చేందుకే షర్మిలను తెలంగాణలో దించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు సమాధానం లేదు.
జగన్ తో షర్మిల విభేదించారా, వారికి ఆస్తుల అవస్థలున్నాయా ఇలాంటి చర్చ టైమ్ పాస్ కు బాగానే ఉంటుంది. విభేదిస్తే ఆంధ్రప్రదేశ్ లోనే తేల్చుకోవాలన్న విశ్లేషణలు వినిపించాయి. అయినా నో యూజ్ తెలంగాణలోనే ఉంటానని షర్మిల అంటున్నారు. ఏదైనా ఇక్కడే తేల్చుకోవాలని చూస్తున్నారు. జగన్ కుటుంబం కొట్లాడుకున్నట్లుగా నాటకం ఆడుతోందన్న వాదన రోజురోజుకు బలపడుతోంది. మీ చెల్లి మా రాష్ట్రంలో గోల చేస్తోందెందుకని దావోస్ వేదిగా జగన్ ను కేటీఆర్ ప్రశ్నించినప్పుడు సరైన సమాధానం రాలేదు. షర్మిల చేష్టలలో తన ప్రమేయం లేదని చెప్పేందుకు విజయమ్మతో వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయించారని అనుకోవాలి. తెలంగాణలో జోక్యం చేసుకుంటున్నందున పంపేశారని ఒక వర్గం అంటే ఇకపై విజయమ్మ కూడా తెలంగాణపై ఫుల్ టైమ్ దృష్టి పెడతారని మరికొందరు చెప్పారు.
షర్మిల, విజయమ్మ మహిళా సెంటిమెంట్ తో ఓట్లను దండుకునే ప్రయత్నంలో ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. తన బిడ్డకు మద్దతిచ్చే హక్కు తనకు లేదా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. అందుకే జగన్ తమను దూరం పెట్టారని ఎలాంటి వనరులు లేకుండా తాము తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన కేసీఆర్ కబంద హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించడమే తమ ధ్యేయమని అంటూ ఇకపై ఏపీ రాజకీయాలతో తమకు పనిలేదని విజయమ్మ చెప్పుకున్నారు.
షర్మిల, విజయమ్మ ఇద్దరూ చాలా తెలివిగా తమ వ్యూహాన్ని బయటకు తెలియనివ్వడం లేదు. తమ బలాలు, బలహీనతలు ఇప్పుడే బయట పడకుండా చూసుకుంటున్నారు. అందుకే తెలంగాణలో పార్టీ ప్రారంభించిన తర్వాత వచ్చిన ఏ ఉప ఎన్నికలోనూ వైఎస్సార్టీపీ పోటీ చేయలేదు. సుదీర్ఘకాలం జనంలో ఉంటే క్రమంగా ఆదరణ పెరుగుతుందన్న ధీమాతో ఉంటున్నారు. అందుకే షర్మిల నిరంతరాయంగా పాదయాత్ర చేస్తున్నారు. నడుస్తూనే ఉంటారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. షర్మిల, విజయమ్మ వైపు ఇప్పుడు కార్యకర్తలు లేరు. పాదయత్రలో జనం భారీగా రావడం వైఎస్ కూతురిని చూసేందుకేనని చెబుతున్నారు. అంతే తప్ప మామూలుగా జనం కనిపించడం లేదు. ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లినప్పుడు కూడా మీడియా హడావుడే తప్ప 50 మంది కార్యకర్తలకు మించి కనిపించలేదు. జనం తమ వైపు లేరన్న సంగతి బయట పడకుండా అధికార పార్టీపై విరుచుకుపడుతూ షర్మిల డైవర్షన్ పాలిటిక్స్ బాగానే చేస్తున్నారు.
తెలంగాణలో షర్మిల రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధముూ లేదని అధికారికంగా జగన్ ఎప్పుడూ ప్రకటించలేదు. ప్రకటిస్తే ఖేల్ ఖతం అవుతుందని జగన్ భావిస్తుండొచ్చు. ఆమె జగనన్న వదిలిన బాణమనే జనం భావించాలన్నది ఏపీ సీఎం ఆలోచనా విధానం కావచ్చు, లేదా జనంలో అనుమానం కంటిన్యూ అయినంత వరకు షర్మిలకు అడ్వాంటేజ్ గా ఉంటుందన్న నమ్మకమూ కావచ్చు. కల్వకుంట్ల కవిత చెప్పినట్లుగా ఆమె బీజేపీ ఏజెంట్ అని అనుకోవచ్చు. అలాగని అనుకోవడానికి కూడా ఆధారాలు లేవు.
ఒక్కటి మాత్రం నిజం తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి సీఎం కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని షర్మిల టార్గెట్ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తూ రెచ్చగొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల ముందు జగన్ రెడ్డి ఎలాంటి ప్రసంగాలు చేసే వారో తెలంగాణలో ఇప్పుడు షర్మిల అదే పంధాను పాటిస్తున్నారు. అక్కడ అన్న ఇక్కడ చెల్లి అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి.