స్పీడ్‌ ఎక్కువైంది చెల్లెమ్మా..అన్న సంగతి చూడు!

By KTV Telugu On 1 December, 2022
image

వివాదాస్పదమైతేనే వార్తల్లో ఉండొచ్చనా?

తెలంగాణలో 3500 కిలోమీటర్లు నడిచాక వైఎస్‌ షర్మిల పాదయాత్రకి మైలేజొచ్చింది. ఎప్పుడొచ్చిందో వెళ్లిందో తెలీకుండా ఎన్ని యాత్రలు చేస్తే లాభమేముంది. తండ్రి, అన్నల రాజకీయ జీవితాల్ని మార్చేసిన పాదయాత్రల మీద అదే రక్తం పంచుకుపుట్టిన వైఎస్‌ షర్మిలకి ఫుల్లు క్లారిటీ ఉంది. అందుకే లోకల్‌ ఎమ్మెల్యేనుంచి సీఎం కేసీఆర్‌దాకా ఎవరైతే నాకేంటన్నట్లు విమర్శలు, ఆరోపణలు. నర్సంపేట ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగడం ఆమె పాదయాత్రని హైలైట్‌ చేసింది. మర్నాడు హైదరాబాద్‌లో పోలీసుల అడ్డంకులు షర్మిలకి వెయ్యేనుగుల బలాన్నిచ్చాయి.

వైఎస్‌ మరణానంతరం అన్నాచెల్లెళ్ల మధ్య అంతరాలు పెరిగాయన్న ప్రచారం ఉంది. దీనికి తగ్గట్లే ఇడుపాలపాయలో నివాళుల కార్యక్రమంలోనూ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే కనిపించారు. కానీ ఏపీలో అన్న రాజకీయానికి ఎక్కడా అడ్డం తగలకుండా తెలంగాణపైనే చెల్లెమ్మ ఫోకస్‌ పెట్టింది. పాదయాత్రలో మంత్రి నిరంజన్‌రెడ్డిని నీచుడు నికృష్ణుడని తిట్టిన షర్మిల నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇజ్జత్‌ తీసింది. మహిళా నేత మాట మగతనాన్ని ప్రశ్నించేదాకా రావటంతో పెద్దికి కాలింది. అయినా షర్మిల వెనకడుగు వేయలేదు. పెద్ది మగతనంతో తనకేం సంబంధమని వాళ్లావిడకే తెలియాలని ఇంకాస్త గాలి తీసేసింది. కేటీఆర్‌ భార్య ఆంధ్రా అని గుర్తుచేస్తూ ఆవిడకి విడాకులిస్తారా అంటూ కేసీఆర్‌ ఫ్యామిలీని ఇంకాస్త కెలికేసింది.

షర్మిల తెలంగాణపార్టీ ప్రకటించినప్పుడు టీఆర్‌ఎస్‌ పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కృష్ణా, గోదావరి జలాలు, అక్రమ ప్రాజెక్టులపై నీ స్టాండ్‌ ఏంటంటూ కొందరు నేతలు ఇరకాటంలో పెట్టాలని చూశారు. కానీ తెలంగాణ కోడలిననే స్టాండ్‌కే కట్టుబడ్డ షర్మిల దీటుగానే బదులిచ్చారు. ఇప్పుడు షర్మిల ఎదురుదాడితో ఏపీకి వెళ్లి మీ అన్నని తిడితే ఊరుకుంటారా అంటూ గులాబీ నేతలు కవ్విస్తున్నారు. తెలంగాణ నేతలు ఆంధ్రాకు వెళ్లి పాదయాత్రలు చేయకపోవచ్చుగానీ షర్మిల స్పీడ్‌కి పగ్గాలేసేందుకు జగన్‌ని లక్ష్యంగా చేసుకునే అవకాశాలైతే ఉన్నాయి. ఎలాగూ బీఆర్‌ఎస్ ప్రకటించారు. ఆ వంకతో ఏపీలో పాదయాత్రలేంటి సభలు, ఆందోళనలు కూడా చేస్తారేమో!