మా అన్నతో నాకు గొడవల్లేవు : వైఎస్ షర్మిల

By KTV Telugu On 8 November, 2022
image

 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో గొడవలున్నాయని, ముఖ్యంగా ఏపీ సీఎం జగన్‌కు ఆయన సోదరి షర్మిలకు ఆస్తి తగాదాలున్నాయని ఎల్లో మీడియా కొంత కాలంగా పనిగట్టుకుని రకరకాల కథనాలు ప్రచారం చేస్తోంది. తల్లికి, చెల్లికి జగన్‌ అన్యాయం చేశాడని అందుకే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారని తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పటినుంచో జగన్‌ను విమర్శలు చేస్తోంది. జగన్ తో వైఎస్ షర్మిలకు గొడవలున్నాయని అలాంటప్పుడు ఏపీలోనే పార్టీ పెట్టుకోవాలన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా గతంలో వ్యాఖ్యానించారు. తాజాగా కేటీఆర్‌ వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. కేటీఆర్‌ వ్యాఖ్యల్లో నిజం లేదని అన్నతో తనకు గొడవల్లేవని అన్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు సోదరుడితో గొడవలు ఉంటే ఏపీలో పార్టీ పెట్టుకోవాలని, అందుకు విరుద్ధంగా తెలంగాణలో పార్టీ ఎలా పెట్టుకుంటారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కూడా ఆమె సమాధానమిచ్చారు. అత్త మీద కోపాన్ని తాను దుత్త మీద చూపడం లేదన్నారు. తన సోదరుడితో తనకేమీ గొడవలు లేనందునే తాను ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టుకున్నానని ఆమె తెలిపారు. అక్రమ ఆస్తుల ఆరోపణలపై జగన్‌ జైల్లో ఉన్నప్పుడు పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవడానికి అన్న తరపున షర్మిల ఏపీలో మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర కొనసాగించారు.

ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు తొమ్మిది నెలల పాటు కొనసాగిన ఈ యాత్ర 3 వేల కిలోమీటర్లు సాగింది. ఆ తరువాత వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక షర్మిల రాజకీయాల్లో కలగజేసుకోలేదు. ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయలేదు. అయితే ఉన్నట్లుండి ఆమె తెలంగాణలో పార్టీ స్థాపించబోతున్నారని ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయి. ఆ వార్త చూసి అందరూ అవాక్కయ్యారు. ఆ వార్తలను నిజం చేస్తూ షర్మిల తెలంగాణలో వైఎస్‌ఆర్‌టిపి పార్టీని స్థాపించారు. రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఆశయంతో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు షర్మిల. కేసీఆర్‌ సర్కారు మీద, సీఎం, కేటీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేల మీద ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఆమె తమమీద చేస్తున్న విమర్శల గురించి తెలంగాణ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అయినా వెనక్కి తగ్గని షర్మిల దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సవాల్‌ చేశారు. తెలంగాణలో ఇప్పటికే మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్నారు షర్మిల.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన సోదరుడితో తనకు గొడవలు ఉన్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఆమె తేల్చిచెప్పారు. వైఎస్‌ షర్మిల పార్టీ స్థాపన, పాదయాత్ర, ఇంట్లో గొడవల గురించి ఎల్లోమీడియా కళ్లకు కట్టినట్లు వార్తలు రాస్తూ వస్తోంది. షర్మిల ఆ కథనాలను ఎప్పుడూ ఖండించలేదు. ఏబీఎన్‌లో నిర్వహించే ఓపెన్‌ హార్ట్‌ కార్యక్రమానికి కూడా వెళ్లారు. దీంతో షర్మిల ఎల్లోమీడియా చేతిలో అస్త్రంగా మారిందా అనే అనుమానాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమయ్యాయి. ఇటీవల ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మారుస్తూ జగన్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆమె తప్పు పట్టారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై ఆమె ఢిల్లీ వెళ్లి ఎంపీ టికెట్ కోసమే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిందని సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చి వచ్చినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి తనకు అన్నతో ఎలాంటి గొడవల్లేవని షర్మిల ప్రకటించడంపై చర్చ జరుగుతోంది.