తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో బ్రీఫ్‌డ్ మీ అంటూ అడ్డంగా ఇరుక్కుపోవడంతో మూటా ముల్లె సర్దుకుని రాత్రికి రాత్రి విజయవాడకు వెళ్లిపోయారు చంద్రబాబు నాయుడు. ఇక ఆ తరువాత ఇక్కడ పార్టీని గాలికొదిలేశారు. దాంతో తెలంగాణ టీడీపీ దుకాణం మూతపడిపోయింది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ కూడా మంచి రోజు చూసుకుని టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో బక్కని నరసింహలును ప్రెసిడెంట్‌గా నియమించారు. ఆయన్ను తీసేసి ఇటీవలే పార్టీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్‌కు పార్టీ పగ్గాలు అప్పజెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. తెలంగాణ నడిబొడ్డున ఎన్టీఆర్ టీడీపీ పార్టీని ప్రకటించారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో టీడీపీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందని ఆశిస్తున్నానని, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ దిశగా పనిచేయాలని సూచించారు.
కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని, ఆయన ఆధ్వర్యంలో పార్టీ తెలంగాణలో పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. తెలంగాణకు ఎవరైనా రావొచ్చని, ప్రజల మనస్సులను గెలుచుకోవచ్చంటూ బాబు వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడారు. అంతేకాదు తెలంగాణ ఏమైనా కేసీఆర్ అబ్బ సొత్తా? అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తుంటే కేసీఆర్ దాక్కుంటున్నారని, మోదీని కలిసి రాష్ట్ర సమస్యలను వివరించే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. మోదీని కలిసే దమ్ము కేసీఆర్‌కు అసలు లేదని షర్మిల విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ప్రయోజనం లేదని షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీజేపీకి ఏమైనా వాటా ఉందా? అని షర్మిల ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రవేశపెట్టే పథకాల వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని, సొంత ఆస్తులను పెంచుకోవడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లుగా షర్మిల మాట్లాడడం ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో సీఎంగా ఉన్న తన అన్న వైఎస్ జగన్, విపక్ష నాయకుడు చంద్రబాబు ఉప్పు నిప్పులా ఉన్న నేపథ్యంలో ఆమె చంద్రబాబుకు వత్తాసు పలకడంపై వైసీపీ శ్రేణులు ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు.