జగన్‌ను టార్గెట్ చేసిన బాబు

By KTV Telugu On 30 November, 2022
image

వివేకా కేసు బదిలీపై జగన్ లక్ష్యంగా టీడీపీ విమర్శలు
ఆంధ్రాకు అవమానమంటూ తండ్రీకొడుకుల ట్వీట్లు

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసిన విషయంపై టీడీపీ జగన్ సర్కార్‌ను టార్గెట్ చేసింది. సీఎంగా ఉండి సొంత బాబాయి హత్య కేసును ఛేదించలేకపోయారని కేసు విచారణ పక్క రాష్ట్రానికి బదిలీ కావడం ఆంధ్రప్రదేశ్‌కు అవమానమంటూ చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు, బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి, అబ్బాయి చంచల్ గూడ జైలుకి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. హత్య కేసులో విచారణ పక్కదారి పట్టించడం సాక్షులను సీబీఐ అధికారులను బెదిరించడం అన్నీ నిజాలేనంటూ ఆరోపణలు గుప్పించిన తెలుగుదేశం పార్టీ చెల్లెలికి ఇంత అన్యాయం చేసిన అన్న ఉండడు అంటూ మండిపడింది. సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.

ఏపీలో దర్యాప్తు సాగుతున్న తీరు అధికారులకు రాజకీయ బెదిరింపులు వివేకా కుమార్తె విజ్ఞప్తి వంటి పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది. 2019 మార్చి 14న పులివెందులలోని తన ఇంట్లో వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్‌కు అప్పగించగా సీబీఐకి అప్పగించాలని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ డిమాండ్ చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ హైకోర్టులో కేసు విచారణపై పిటిషన్లు దాఖలు కాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది ఈ కేసులో అనుమానితుల్ని, సాక్షుల్ని వరుసగా ప్రశ్నించింది. ఈ కేసులో ఏ2గా సునీల్ యాదవ్, ఏ3గా ఉమాశంకర్‌రెడ్డిలు ఉన్నారు. మరికొందర్ని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారారు. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా హైకోర్టు, సుప్రీం కోర్టులు తిరస్కరించాయి.

సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన సజ్జల తెలుగుదేశం తీరుపై మండిపడ్డారు. టీడీపీ వివేకా కుటుంబ సభ్యులతో కుట్ర చేస్తోందని సజ్జల ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి వైసీపీ నాయకుడని జగన్ కు చిన్నాన్న అని గుర్తుచేశారు. ఈ కేసులో రాజకీయాలు ఉండవన్నారు. తెలంగాణలో విచారణ జరిగితే ఇంకా మంచిదని తమకు ఎలాంటి భయాలు, దాపరికాలూ లేవని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్యలో నిజాలు తెలియాలని దోషులకు కఠినశిక్ష పడాలని సజ్జల ఆకాంక్షించారు. విచార‌ణ తెలంగాణ రాష్ట్రానికి మారిన ప‌రిస్థితిలో సీబీఐ దర్యాప్తు ఏవిధంగా ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.