తెలంగాణలో అసలేం జరుగుతోంది.
ఓ వైపు దర్యాప్తు సంస్థల దూకుడు.
మరోవైపు రాజకీయ భౌతిక దాడులు.
షర్మిల చుట్టూ రాజకీయం.
కేసీఆర్‌పై సమైక్యవాదుల కుట్ర.
జరుగుతోందన్న టీఆర్ఎస్ నేతలు.
తెలంగాణలో అసలేం జరుగుతోంది. ఓ వైపు దర్యాప్తు సంస్థల దూకుడు. మరోవైపు రాజకీయ, భౌతిక దాడులు హీటెక్కిస్తున్నాయి. రాష్ట్రంలో ఓ వార్డ్ మెంబర్ కూడా లేని పార్టీ చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. ఎందుకలా జరుగుతోంది. షర్మిల ఎవరు వదిలిన బాణం? జగన్ వదిలిన బాణమా? లేక బీజేపీ సంధించిన బాణమా ?లేక టీఆర్ఎస్ వదిలిన బాణమా? ఆమెను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల అంతేవేగంగా పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లారు. కేసీఆర్ సర్కార్ టార్గెట్‌గా గత కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఎప్పుడూ పెద్దగా పట్టించుకోని టీఆర్ఎస్ తాజాగా వైఎస్సార్టీపీని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. షర్మిల పార్టీ పెట్టినప్పుడు జగన్ వదిలిన బాణమనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం పాటు కేసీఆర్ వదిలిన బాణం అన్నారు. ఇప్పుడు షర్మిలపై టీఆర్ఎస్ నేతల దాడులతో బీజేపీ వదిలిన బాణమనే ప్రచారం ఊపందుకుంది. అయితే తాను ఎవరూ వదిలిన బాణం కాదు తాను ప్రజల బాణాన్ని అంటున్నారు షర్మిల.
బీజేపీయే షర్మిలను నడిపిస్తుందనే అనుమానంతో గులాబీ దండు ఆమె పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్న మాట. షర్మిల వాహనాలపై టీఆర్ఎస్ శ్రేణుల దాడి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన తీరును బీజేపీ నేతలతో పాటు గవర్నర్ ఖండించారు. దీంతో షర్మిల వెనుక బీజేపీ ఉందనే విషయాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్. ఈ క్రమంలోనే బీజేపీ, వైఎస్సార్టీపీ లక్ష్యంగా విమర్శలకు దిగుతోంది. షర్మిల వెనుక బీజేపీ ఉందని ఆరోపిస్తోంది. వైఎస్సార్టీపీలో షర్మిల మినహా పెద్దగా చెప్పుకోదగ్గ నేతలెవరూ లేరు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్సార్టీపీకి అభ్యర్థులు కూడా లేరు. కనీసం ఆపార్టీకి ఓ వార్డ్ మెంబర్ కూడా లేరు. రాష్ట్రంలో నిన్నటివరకు జరిగిన ఏ ఎన్నికలోనూ షర్మిల పార్టీ పోటీ చేసిందిలేదు. అయినా అంతలా షర్మిలను టీఆర్ఎస్ లక్ష్యం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్టీ పెట్టిన రోజు నుండి ఇప్పటివరకు వైఎస్సార్టీపీ బలపడింది లేదు. కానీ టీఆర్ఎస్ టార్గెట్‌తో షర్మిలకు కొంత మైలేజ్ మాత్రం వచ్చినట్లే కనిపిస్తోంది. షర్మిలతో పాటు బీఎస్పీ ప్రవీణ్, కేఏ పాల్ అంతా బీజేపీ గూటిలోని వారేననే వాదన తెరపైకి తెస్తున్నారు గులాబీ నేతలు.
అసలు షర్మిల తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టారో ఎవరికీ అంతుబట్టడం లేదు. జగనే ఆమెను బీజేపీకి మద్దతు కోసం తెలంగాణకు పంపారనే వాదనను కొందరు తెరపైకి తెస్తున్నారు. అందుకే షర్మిలను అడ్డుపెట్టుకొని టీఆర్ఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల ఆంధ్రా వ్యక్తి అని ఆమెకు ఇక్కడేం పని అని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అదేసమయంలో షర్మిల ఏమైనా అడగాలనుకుంటే ముందు ఏపీకి వెళ్లి తన అన్న పరిపాలనను నిలదీయాలని సూచిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఓ ఇంట్రస్టింగ్ వాదన తెరపైకి తెస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ లేకుండా చేసేందుకు సమైక్యవాదుల కుట్ర జరుగుతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఏపీలో పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు దత్తపుత్రుడని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో కూడా షర్మిల బీజేపీ దత్తపుత్రిక అంటున్నారు గులాబీ నేతలు. ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతుందనే అనుమానం కలుగుతోంది. మొత్తంగా తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య సాగుతున్న యుద్ధంలోకి వైఎస్సార్టీపీ ఎంట్రీ అందరినీ ఆశ్చర్యపర్చిందనే చెప్పాలి. ఇప్పటికే రాష్ట్రంలో ఓ వైపు సిట్ మరోవైపు ఐటీ, ఈడీ దాడులతో రాజకీయం సెగలు కక్కుతోంది. లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు తెరపైకి రావడంతో పాలిటిక్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోననేది చర్చనీయాంశంగా మారింది.