తెలంగాణలో షర్మిల రాజకీయాలు చెల్లుతాయా?

By KTV Telugu On 23 September, 2022
image

బాణం లక్ష్యం దిశగా దూసుకెళ్తోందా. బాణం గురి తప్పిందా.. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల నిలబడతారా… బలమైన నేతలతో తలపడి గెలుస్తారా… ఆమె చేస్తున్నదేమిటి.. చేయాల్సిందేమిటి.. కేటీవీ విశ్లేషణ.
రాజకీయాల్లో చెప్పుకునేందుకు ట్రాక్ రికార్డు లేదు. కేవలం వైఎస్సార్ వారసత్వమంటూ జనంలో తిరుగుతున్న వైఎస్ షర్మిలతో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.
….
పాదయాత్రలు. దీక్షలు పనిచేస్తాయా ?
తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టి .. వైఎస్సాఆర్ టీపీని ప్రారంభించిన వెంటనే ఆమె దీక్షలు, పాదయాత్రలు చేపట్టారు.నాటి నిరుద్యోగ దీక్ష నుంచి నేటి నీళ్ల కోసం దీక్ష వరకు అనేక సార్లు ప్రజల్లోనే కూర్చున్నారు. ఇప్పటికే రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఓటర్లు ఆమెను చూసి వెళ్లడం మినహా సరైన ప్రజా స్పందన లభించిన దాఖలాలు లేవు.
నాటి వైఎస్సార్ సంక్షేమ కార్యక్రమాలు కలిసొస్తాయా ?
షర్మిల ఎవరు వదలిన బాణం… చాలా రోజులుగా వినిపిస్తున్న ప్రశ్న ఇది. తెలంగాణలో కొన్ని వర్గాల ప్రయోజనం కోసం జగన్ స్వయంగా సోదరిని రంగంలోకి దించారా.. ఎవరైనా ఆమెను రాజకీయాల్లోకి లాగారా అన్న ప్రశ్నకు అంత ఈజీగా సమాధానం దొరకదు. షర్మిల మాత్రం తెలంగాణలో వైఎస్సార్ వారసత్వం అవసరమని, వైఎస్సార్ సాధించిన అభివృద్ధి మాత్రమే మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందని చెబుతున్నారు. నిజానికి వైఎస్సార్ చనిపోయి చాలా రోజులైంది. తెలంగాణ వచ్చిన తర్వాత వైఎస్ పేరు చెప్పేవాళ్లు లేరు. ఆయన విగ్రహాల వైపు కూడా ఎవరూ చూడడం లేదు. అటు వైఎస్, ఇటు ఆయన బిడ్డ షర్మిల ఇద్దరూ ఆంధ్రా లీడర్స్ అన్న ఫీలింగే జనంలో ఉంటుందని ఆమె అర్థం చేసుకోలేకపోతున్నారు.
ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకంజ
రాజకీయాలంటేనే ఎన్నికలు… వచ్చిన ప్రతీ ఎన్నికలో పోటీ చేసి గెలిస్తేనే ఓటర్ల విశ్వాసం పొందే అవకాశం ఉంటుంది. షర్మిల 2021 జూలైలో పార్టీ పెట్టారు. అక్టోబరులో హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఏదో సాకు చెప్పి ఆమె ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తారంటూ ఆమె ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక విషయంలోనూ ఆమెకు క్లారిటీ లేదు. రాజగోపాల్ రెడ్డిపై ఆరోపణలు సంధిస్తూనే … పోటీపై ఇంకా నిర్ణయించుకోలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇలాగైతే ఆమెకున్న జనబలాన్ని అర్థం చేసుకోవడం కష్టమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఎవరితో కలవాలో తెలియని అయోమయం
తెలంగాణలో కొత్త పార్టీలు, కొత్త నేతలు పుట్టుకొస్తున్నారు. కొందరు పాత నేతలు రాజకీయ మైత్రీబంధాల కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్.. ఇప్పుడు రాష్ట్రంలో బీఎస్పీని నడిపిస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ నేత కేఎ పాల్.. తెలంగాణలో హడావుడి చేస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ కూడా పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలపై షర్మిల దుమ్మెత్తిపోస్తున్నారు. చిన్నపార్టీల్లో ఎవరితో కలవాలో షర్మిల ఇప్పుడే నిర్ణయించుకోవాలి… ఆమె తీరులో మాత్రం స్పష్టత కనిపించడం లేదు.
రెడ్ల ఓట్లు చీల్చితే కాంగ్రెస్ కు గడ్డుకాలం
తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా బాగా వెనుకబడిపోయింది. వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన రెడ్లు,, తెలంగాణ ఆవిర్భావం తర్వాత తమకంటూ ఒక పార్టీ లేదని ఆందోళన చెందుతున్నారు. జనబలం, ధనబలం ఉన్నప్పటికీ పదవులు సాధించలేకపోతున్నామని దిగులు చెందుతున్నారు. గతంలో సీఎం పదవి అంటే రెడ్లేనన్న పేరు ఉండేది. ఇప్పుడు మాత్రం మంత్రి పదవులు అడుక్కోవాల్సి వస్తోందన్న చిన్నతనం వారిలో కనిపిస్తోంది అందుకే రెడ్లు మళ్లీ కాంగ్రెస్ ను నమ్ముకునే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా బలమైన నాయకుడిగా మారుతున్నారు. సరిగ్గా అక్కడే షర్మిలా రెడ్డి… సీన్ లోకి ఎంటరయ్యారు. 2023 ఎన్నికల్లో ఆమె పార్టీ ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే మాత్రం రెడ్డి సామాజికవర్గం ఓటర్లు అయోమయంలో పడిపోయి…. వారి ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది..పైగా రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు బీజేపీలో చేరి ఇప్పటికే సామాజిక వర్గంలో చీలిక తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
దళితులు, మైనార్టీల ఓట్లు చీలితే బీజేపీకి ప్రయోజనం
వైఎస్సార్ హయాంలో దళితులు, మైనార్టీలు ఆయన్ను బాగా అభిమానించే వారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఆ సామాజిక వర్గాలు పక్కబలంగా ఉండేవి. తర్వాతి కాలంలో వాళ్లంతా టీఆర్ఎస్ ఓటు బ్యాంకుగా మారిపోయారు. షర్మిల తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాను వైఎస్సార్ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్నారు. పైగా ఆమె కన్వర్టెట్ క్రిస్టియన్. దళిత, క్రైస్తవ, మైనార్టీల ఓట్లను ఆమె చీల్చితే పోలరైజేషన్ ఖాయమని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీకి అది ప్రయోజనకరం కావచ్చు… కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం తప్పకపోవచ్చు.
తెలంగాణ రాజకీయాల్లో ముక్కోణ పోటీ ఖాయమైన తరుణంలో షర్మిల రాజకీయ ప్రవేశం చేశారు. పాదయాత్రలో ఆమెకు మిశ్రమ స్పందన లభిస్తోంది. పలుకరిస్తానన్నా, సాయం చేస్తానన్నా కొందరు వద్దంటున్నారు. అందుకే ఆమె అసలు బలం తెలియాలంటే ఎన్నికలు రావాల్సిందే…