తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా…బీజేపీ అడుగులు వేస్తోంది. ఒకవైపు అధికార పార్టీపై విమర్శలు చేస్తూనే…మరోవైపు పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. ఇతర పార్టీల నుంచే కాకుండా…బ్యూరోక్రాట్లు, మేధావులు, విద్యావంతులను పార్టీలోకి చేర్చుకొని…కేసీఆర్ కు డేంజర్ సింగ్నల్స్ పంపాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
వచ్చే ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో…టీఆర్ఎస్ ను మట్టి కరిపించాలని కమలం పార్టీ డిసైడయింది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ ను… ఓడించి తీరుతామని శపథం చేస్తోంది బీజేపీ. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. 119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ప్రజల్లో మంచి పలుకుబడి, ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకు కండువా కప్పేందుకు…రహస్య చర్చలు జరుపుతోంది. పక్క పార్టీల నేతలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్, మేధావులు, టీఎన్జీవోలను…తమ వైపు తిప్పుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించింది. ఇప్పటికే పదవి విరమణ చేసిన కొందరు బ్యూరోక్రాట్లను…పార్టీలో చేరేలా ఒప్పించింది.
రాష్ట్ర నేతలంతా విభేదాలు పక్కన పెట్టి….పార్టీని బలోపేతం చేయాలని హైకమాండ్ ఆదేశించింది. కొందరు బ్యూరోక్రాట్లతో…జాతీయ నేతలే మాట్లాడుతున్నారు. పార్టీలో చేరాలని…అన్ని విధాలా అండగా ఉంటామని హమీ ఇస్తున్నారు. మాజీ అధికారులు, మేధావులు, విద్యావంతులను పార్టీలోకి చేర్చుకోవాలన్న బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు…ఫలిస్తున్నాయ్. మాజీ ఐపీఎస్ అధికారి టి. కృష్ణ ప్రసాద్.. బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయమైంది. ఆగష్టు 2వ తేదీన కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 1987బ్యాచ్ కు చెందిన కృష్ణ ప్రసాద్…2020లో పదవి విరమణ చేశారు. స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో పని చేసిన…ఇద్దరు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ క్రిష్ణారావు, ఆర్ రత్నప్రభ, సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్ చంద్రవదన్ బీజేపీలో చేరారు.
కీలక స్థానాల్లో ఉన్న గ్రూప్ వన్ స్థాయిలో పని చేసిన అధికారులను కూడా పార్టీలోకి తీసుకొచ్చి…గులాబీ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేయాలని భావిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉద్యోగ సంఘాలు…ముందుకు నడిపించాయ్. ఆందోళనలు, బంద్ లతో ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. తెలంగాణ వచ్చిన తర్వాత…వారికి ప్రాధాన్యత లభించకపోడంతో…బీజేపీకి జై కొడుతున్నారు. గతంలో టీఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న స్వామిగౌడ్… టీఆర్ఎస్లో చేరి మండలి చైర్మన్ అయ్యారు. ఆ తరువాత గులాబీ పార్టీ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ…కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత టీఎన్జీవో అధ్యక్షుడిగా పని చేసిన విఠల్ సైతం… ఆర్టీసీ యూనియన్ నేతగా పనిచేసిన అశ్వత్తామ రెడ్డిలు…ఎప్పుడో బీజేపీలో చేరిపోయారు. పలువురు టీఎన్జీవోలు, వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలతో రాష్ట్రనాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది.
బీజేపీలో చేరిన పలువురు బ్యూరోక్రాట్లు…లోక్ సభ లేదా రాజ్యసభలకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులుగా సేవలు అందిస్తున్నారు. హర్దీప్ సింగ్ పూరి, అశ్వీని వైష్ణవ్, జై శంకర్…మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ వంటి మాజీ అధికారులు…కేంద్ర మంత్రులుగా పని చేస్తున్నారు.