ఏపీలో అలా తెలంగాణాలో ఇలా

By KTV Telugu On 28 January, 2023
image

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బిజెపిలో వ్యవహారాలు సజావుగా లేవు. రెండు చోట్లా కూడా పార్టీలో ఆధిపత్య పోరు పార్టీకి చికాకులు సృష్టిస్తోంది. ఏపీలో సోము వీర్రాజు పై మాజీ అధ్యక్షుడు కన్నా గుర్రుగా ఉన్నారు. తెలంగాణాలో అధ్యక్షుడు బండి సంజయ్ పై టి.ఆర్.ఎస్. నుండి వచ్చిన ఈటల రాజేందర్ కోపంగా ఉన్నారు. దక్షిణాదిలో పాగా వేద్దామనుకుంటోన్న బిజెపి ఈ పరిణామాలు తలనొప్పులు తెస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేస్తామని బిజెపి ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్నికల నగారా మోగడానికి ముందే కాంగ్రెస్ బి.ఆర్.ఎస్. ల నుండి పెద్ద ఎత్తున నేతలను ఆకర్షించాలని బిజెపి భావిస్తోంది. చాలా మంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని కమలనాథులు చెప్పుకొస్తున్నారు కూడా. టచ్ లో ఉన్నారో లేరో తెలీదు కానీ ఒక్కరూ వచ్చి చేరడం లేదు.

ఇలా ఎందుకవుతోందో ఈ మధ్యనే బిజెపి నేత ఈటల రాజేందర్ బయట పెట్టారు. ప్రతీ రాజకీయ పార్టీలోనూ కేసీయార్ తరపున పనిచేసే కోవర్టులు ఉన్నారని ఈటల అన్నారు. ఏ పార్టీ నుండి అయినా నేతలు వస్తున్నారన్న సమాచారం తెలియగానే వారు బి.ఆర్.ఎస్. అధినేతకు చేరవేయడంతో వాళ్లు జాగ్రత్త పడుతున్నారన్నది ఈటల వాదన. అందుకే చేరికలు ఆగిపోయాయని ఈటల అంటున్నారు. ఈటల ఎందుకిలా వ్యాఖ్యానిస్తున్నారా అని ఆరా తీస్తే బిజెపిలో ఈటల కాస్త ఉక్కిరి బిక్కిరిగానే ఉన్నారని తెలుస్తోంది. బి.ఆర్.ఎస్. నుండి బిజెపిలోకి జంప్ అయితే చేశారు కానీ ఆ తర్వాత తన స్థాయిక తగ్గ గౌరవం తనకు దక్కడం లేదని ఈటల ఫీల్ అవుతున్నారట. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పదవీ కాలం ముగిసే సమయం వచ్చింది. అయితే ఆయన పదవీ కాలాన్ని మరోసారి పొడిగిస్తారని వార్తలు వినపడుతూ ఉండడంతో ఈటల అసహనానికి లోనవుతున్నారట. బండి సంజయ్ స్థానంలో ఈ సారి అధ్యక్ష పదవి తనకు ఇస్తే బాగుంటుందని ఈటల ఆశపడుతున్నారు. అది నెరవేరే పరిస్థితులు కానరాకపోవడంతోనే ఈటల చికాగ్గా ఉన్నారని అంటున్నారు.

అసలు బిజెపిలో ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలను చేర్చుకునేందుకోసం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం పైనా ఈటల మండి పడుతున్నారు. ఏ పార్టీలోనూ ఇలాంటి కమిటీలు లేవు మరి మన పార్టీలోనే ఎందుకట అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈటలకే కాదు బిజెపిలో చాలా మంది సీనియర్లకు బండి సంజయ్ పై అసూయతో కూడిన కోపం పెరిగిపోతోంది. సంజయ్ ను సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీయే పదే పదే మెచ్చుకుంటూ ఉండడం ఇతర నేతలకు ముళ్లు గుచ్చుకున్నంత బాధగా అనిపిస్తోంది. ఈటల వ్యవహారం ఇలానే కొనసాగితే ఎన్నికల ఏడాదిలో అది బిజెపికి ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు రాజకీయ పండితులు. బండి సంజయ్ ను వ్యతిరేకించే పాత కాలపు బిజెపి నేతలంతా కూడా ఈటలను లోలోనే మెచ్చుకుంటున్నారు. తాము చేయలేకపోయింది ఈటల చేస్తున్నారని వారు కితాబుకూడా ఇస్తున్నారట.

ఆంధ్ర ప్రదేశ్ బిజెపిలోనూ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. నిజానికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపికి ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఏపీలో చెప్పుకోదగ్గ ఓట్లూ లేవు సీట్లూ రావు. మిత్ర పక్షం అనుకున్న జనసేనాని టిడిపికి కన్నుగొడుతున్నాడు. జనసేన తమతో ఉన్నా బిజెపి కచ్చితంగా గెలుస్తుందని చెప్పగల నియోజక వర్గం కూడా లేదు. పరిస్థితి అంత దారుణంగా ఉన్నప్పుడు పార్టీలో ఉన్నవారంతా ఏకతాటిపై ఉండి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలి. కానీ ఏపీ బిజెపిలో నేతలు అలా లేరు. ప్రత్యేకించి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య పచ్చగడ్డి కాదు మంచు గడ్డ వేసినా భగ్గుమనేలా ఉంది పరిస్థితి. కన్నా లక్ష్మీనారాయణ టిడిపికి అనుకూలంగా వ్యవహారాలు నడుపుతూ వస్తున్నారు.

ఆయన అలా చేస్తున్నారనే పార్టీ హైకమాండ్ కన్నాను తప్పించి సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించింది. ఇపుడు కన్నా మరింత అసహనంగా ఉన్నారు. ఆయన పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెంచడానికి తరచుగా జనసేన నేతలతో భేటీ అవుతూ తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. నేడో రేపో కన్నా జనసేనలో చేరతారన్న ప్రచారమూ జరుగుతోంది. అయితే హైకమాండ్ మాత్రం సోము వీర్రాజుకు అండగానే ఉంది. కన్నా వ్యవహారాలను నిశితంగా గమనిస్తోంది. ఏపీ బిజెపిలో గతంలో చేరిన టిడిపి ఎంపీలు కాషాయం కండువా అయితే కప్పుకున్నారు కానీ వారు చంద్రబాబు నాయుడి అజెండానే భుజాలకెత్తుకుంటున్నారు. ఆ వ్యవహారాలనూ పార్టీ నాయకత్వం గమనిస్తోంది. ఇపుడు కన్నా వ్యవహారం కూడా తలనొప్పిగా మారింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అసమ్మతి రాజేస్తోన్న వారిపై చర్యలు తీసుకుంటేనే కానీ పార్టీ గాడిన పడదని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.