దశాబ్దాల నిరీక్షణకు తెరదించే రోజు వచ్చింది. మహిళా రిజర్వేషన్ అమలుకు టైమ్ దగ్గర పడింది. మోదీ నేతృత్వ కేంద్ర కేబినెట్…ఇప్పుడు మహిళా బిల్లుకు ఆమోదముద్ర వేయడం ద్వారా చట్ట సభల్లో రిజర్వేషన్ కు దారి చూపినట్లయ్యింది. దానితో అందరూ ఒకే మాట మీద నిలబడాల్సిన అనివార్యత కూడా ఏర్పడింది. సరిగ్గా జమిలీ ఎన్నికలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే మహిళా బిల్లు ప్రస్తావనకు వచ్చింది. బీజేపీకి ఇది మంచి శకునమని ఆ పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. కాకపోతే రిజర్వేషన్ ఎప్పటి నుంచి అమలవుతుందేనేదే పెద్ద ప్రశ్న..
ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం ఒకటి రెండు రోజుల్లో రావచ్చు. అందుకే సరైన సమయంలో మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ఇండియా కాదు.. ఎన్ని కూటములు వచ్చినా తమను కొట్టలేరని బీజేపీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు. మహిళా పక్షపాతిగా మోదీ చిరస్థాయిగా నిలిచిపోతారని అందుకు ఈ తొమ్మిదేళ్ల కాలంలో అనేక ఉదంతాలు ఉన్నాయని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. పైగా రాజీవ్ గాంధీ హయాం నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేయలేని పనిని మోదీ చేసి చూపిస్తున్నారన్నది బీజేపీ వారి మరో వాదన. బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పుడు అన్ని విధివిధానాలు బయటకు వస్తాయని కమలం పార్టీ పెద్దలు హామి ఇస్తున్నారు..
పార్లమెంటు ఉభయ సభలతో పాటు అన్ని అసెంబ్లీలు, విధాన్ పరిషత్తుల్లో కూడా మహిళా ప్రతినిధుల సంఖ్య చాలా తక్కువగానే ఉందని చెప్పాలి.
ప్రస్తుత లోక్ సభలో కేవలం 78 మంది మహిళలున్నారు. మొత్తం సభ్యులైన 543 మందిలో అది 14 శాతం కంటే తక్కువే. రాజ్యసభలో కూడా మహిళల ప్రాతినిధ్యం 10 శాతం కంటే తక్కువే ఉంది. అక్కడ 24 మంది మహిళలున్నారు.మహిళా బిల్లు ఆమోదం పొందితే లోక్ సభలో 179 మంది మహిళా ఎంపీలుంటారు. రాజ్యసభలో 81 మంది మహిళలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుంది.తెలంగాణ శాసనసభలో 39 మంది, శాసనమండలిలో 13 మంది సభ్యులుంటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 58 మంది మహళలుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాససనమండలిలో 20 మంది వరకు మహిళలుండొచ్చని అంచనా వేస్తున్నారు. మహిళా బిల్లు కోసం కొంతకాలంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ ఉద్యమిస్తున్నారు. ఆమె ఢిల్లీలో ధర్నా కూడా నిర్వహించారు. ఇప్పుడు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిసిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. తాము వత్తిడి చేసిన తర్వాతే కేంద్రం దిగివచ్చి మహిళా బిల్లుకు మోక్షం కల్పిస్తోందని బీఆర్ఎస్ నేతలు ప్రచారం మొదలు పెట్టారు.
నిజానికి రాజీవ్ గాంధీ హయాం నుంచే మహిళా బిల్లుపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. పీవీ నరసింహారావు దాన్ని కాస్త ముందుకు తీసుకెళ్లి… పంచాయతీల్లో మహిళల ప్రాధాన్యం పెంచే చర్యలు చేపట్టారు. 1996లో దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు తొలి సారి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. ఉత్తరాది ప్రాంతీయ పార్టీల నేతలైన ములాయం, లాలూ దాన్ని వ్యతిరేకించి సభలో గందరగోళం సృష్టించి బిల్లును ఆపించేశారు. అప్పటి నుంచి ఎప్పుడు బిల్లు ప్రస్తావనకు వచ్చినా ఎవరోకరు అడ్డు తగులుతూనే ఉన్నారు. ఆ బిల్లు గీతా ముఖర్జీ నేతృత్వంలోని 21 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీకి వెళ్లింది. కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటే పార్లమెంటులో చర్చ జరగాలి కదా. 2008 వరకు తరచూ ఈ బిల్లును సభలో ప్రవేశ పెడుతూనే ఉన్నారు. అప్పట్లో బిల్లును న్యాయశాఖ స్టాండింగ్ కమిటీకి పంపారు.
చిన్న చిన్న చిక్కుముడులు విప్ప గలిగితే మహిళా బిల్లును రైట్ రైట్ అనడం పెద్ద కష్టమేమీ కాదు. బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పుడు.. గతంలో వచ్చిన అనుమానాలన్నింటినీ నివృత్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తోంది. రిజర్వేషన్ తీరు ఎలా ఉండబోతోంది. నియోజకవర్గాలు ఎలా నిర్ణయిస్తారు లాంటి ప్రశ్నలకు కూడా బుధవారం సభలో బిల్లుపై చర్చ జరిగినప్పుడు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బుధవారం లోక్ సభలో, శుక్రవారం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొంది తర్వాత అసెంబ్లీలకు వెళ్తుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బిల్లు ఆమోదం పొందడానికి పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మెజార్టీ కావాలి. దేశంలోని కనీసం సగం అసెంబ్లీలు బిల్లును ఆమోదించాలి. 2026 తర్వాత డీలిమిటేషన్ పై నిర్ణయం తీసుకుంటారు. దానితో 2029లో తొట్టతొలిగా మహిళ రిజర్వేషన్ అమలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సుముఖంగా ఉన్నందున అన్ని చోట్ల బిల్లు ఆటంకం లేకుండా ముందుకు సాగుతుందని చెబుతున్నారు. రొటేషన్ పద్ధతిలో నియోజకవర్గాలను ఎంపిక చేసి రిజర్వేషన్ అమలు చేసే ప్రతిపాదన ప్రస్తుతానికి ఉంది. 15 సంవత్సరాలకు ఒక సారి రొటేషన్ జరిగే అవకాశమూ ఉంది. అందులోనే ఓబీసీ, ఎస్సీ, ఎస్సీ లెక్కలు కూడా తేలాల్సి ఉంది. అన్నింటికీ మోదీ లెక్క చెబుతారన్న నమ్మకం ఉంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తొలి రోజున ఆయన చారిత్రక నిర్ణయం అనిచెప్పడం కూడా మహిళా బిల్లు గురించేనని లెక్కగడుతున్నారు..
ట్రిపుల్ తలాఖ్ బిల్లు ద్వారా ఇప్పటికే ప్రధాని మోదీ మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారు. యూపీలో బీజేపీ అధికారం సుస్థిరం చేసుకోవడం వెనుక ట్రిపుల్ తలాఖ్ రద్దు కూడా ప్రధాన కారణమనే చెప్పాలి. ఇప్పుడు చట్ట సభల్లో మహిళా బిల్లు ఆమోదం పొందుతున్న నేపథ్యంలో మహిళలు ఏకమొత్తంగా బీజేపీ వైపు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎంత రిస్క్ అయినా సరే మోదీ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాల్లో వెనుకాడే అవకాశం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పైగా అప్పట్లో ములాయం, లాలు వల్ల ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు సీన్ మారింది. కొన్ని నిర్ణయాలకు అందరూ తలొగ్గాల్సిందే. మహిళా బిల్లు కూడా అలాంటిదే మరి.