సిగరెట్ తాగడం హానికరమని చెబుతూ మనమే గుప్పుగుప్పుమని పొగ వదులుతుంటే ఎలాఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెబుతూ సిగ్నల్ జంప్ చేయడంలో మనమే ముందుంటే ఎలా ఉంటుంది. ఒకరికి చెప్పేముందు మనం పాటించాలి. ఆదర్శంగా నిలవాలి. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లు ఉండకూడదు. శ్రీలంక, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. మరికొన్ని దేశాలు సంక్షోభపు అంచులో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల అప్పులను ఆ దేశాల సంక్షోభంతో పోల్చారు ప్రధాని మోడీ. మంచిదే కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అప్పుల్లేవా అంటే లేకేం దండిగా ఉన్నాయి. అప్పులు చేయొద్దని చెప్పే ముందు అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నామో లేదో కేంద్రం కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి.
ఉచిత పథకాలు. ప్రధాని ఈమధ్య ఇలాంటి స్కీములను తప్పుపడుతున్నారు. ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతాయని గుండెలు బాదుకుంటున్నారు. మోడీ మాటల్లో నిజముంది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అలాంటి పథకాలను లేకుండా చూశాక కదా మాట్లాడాల్సింది. ఉచిత పథకాలను ప్రధాని తప్పుపట్టినప్పుడు రాష్ట్రాలనుంచి రియాక్షన్ గట్టిగానే వచ్చింది. ఇప్పుడు త్రిపుర ఎన్నికలకోసం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో కేంద్రం విపక్షాలకు టార్గెట్ అయింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన ఉచిత హామీల సంగతేంటని విపక్షాలు నిలదీస్తున్నాయి. ఇదేమి ద్వంద్వ వైఖరని ప్రశ్నిస్తున్నాయి. మోడీ విపక్షపాలిత రాష్ట్రాలకు పార్లమెంట్‌లో క్లాసు పీకుతున్న సమయంలోనే త్రిపురలో ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా ఉచిత హామీల వర్షం కురిపించడాన్ని విపక్షపార్టీలు వేలెత్తిచూపిస్తున్నాయి.
అవసరం వస్తే ఎవరైనా ఒకటే. నీతులు చెప్పే బీజేపీ కూడా దీనికి అతీతంగా లేదు. జనాకర్షక పథకాలు లేకుండా ఈరోజుల్లో పార్టీలు బతికి బట్టకట్టేలా లేవు. త్రిపుర ఎన్నికల మేనిఫెస్టోలో ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటూ బోలెడు హామీలిచ్చేసింది బీజేపీ. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలకు రూ.50 వేల బాండ్ ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రతిభావంతులైన కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామంటున్నారు నడ్డా. అంతేనా త్రిపుర ప్రజలకు రెండు ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారట. పీఎం కిసాన్ సమ్మాన్ కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల సాయాన్ని రూ.8 వేలకు పెంచుతామన్నారు బీజేపీ చీఫ్. త్రిపురలో మళ్లీ అధికారమిస్తే ఆదివాసీలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీఇచ్చారు. త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతుండటంతో నీతులు పక్కనపెట్టి ఉచితాల వర్షం కురిపిస్తోంది బీజేపీ.