2004 ఎన్నికల్లో బిజెపికి ఇంటికి పంపించాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో కొత్త అస్త్రాన్ని సంధించింది. ప్రధాని నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనను దృష్టిలో పెట్టుకుని “నౌ సాల్ నౌ సవాల్” అంటూ తొమ్మిది ప్రశ్నలు సంధిస్తూ ఓ బుక్ లెట్ ప్రచురించింది. వీటికి సమాధానాలు చెప్పి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇక నుంచి ఎన్నికల వరకు బిజపిని ఏదో ఒక విధంగా ఇలా ఇబ్బందులు పెడుతూ సవాళ్లు విసురుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉండాలని కాంగ్రెస్ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచి నరేంద్ర మోదీ మొదటి సారి ప్రధాని అయ్యారు. పదేళ్ల యూపీయే పాలనకు తెరదించారు మోదీ. కాంగ్రెస్ పార్టీ మామూలుగా ఓడిపోలేదు. ప్రతిపక్ష హోదాకూడా రానంతటి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. అయిదేళ్ల తర్వాత 2019 ఎన్నికల్లో బిజెపిని ఇంటికి పంపి మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం కలలు కంది. అయితే ఆ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికిల పడింది. ఏ మాత్రం స్థానాలు పెంచుకోలేకపోయింది. బిజెపి మాత్రం గత ఎన్నికల్లో గెలిచిన 282 స్థానాలకు మరో 21 స్థానాలు పెంచుకుని 303 స్థానాలు సొంతం చేసుకుంది.
2019 లోనూ వరుసగా రెండోసారి ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీలో అసమ్మతి పేట్రేగిపోయింది. గులాం నబీ ఆజాద్ వంటి సీనియర్లు ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. దానికి ముందు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీనీ సీనియర్లు విమర్శలతో ఎటాక్ చేశారు. ఆ తర్వాత కూడా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయాలు ఆ పార్టీని నిరాశ నిస్పృహల్లో ముంచెత్తింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంది. రాహుల్ గాంధీ జోడోయాత్ర పార్టీకి మంచి మైలేజీ ఇచ్చింది. దాన్ని మించి రాహుల్ గాంధీ ఇమేజ్ బాగా పెంచింది. జోడో యాత్ర ప్రభావంతోనే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం కూడా సాధించగలిగింది. ఈ విజయంతో కాంగ్రెస్ నాయకత్వంలోనూ ఆశలు చిగురించాయి. తమపై తమకి నమ్మకం కుదిరింది. కర్నాటక ఎన్నికల ప్రచారంలో స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు బిజెపిపై సమర్ధవంతంగా ఎటాక్ చేసింది కాంగ్రెస్ పార్టీ. నరేంద్రమోదీ తనదైన శైలిలో గాంధీలను విమర్శించినా కాంగ్రెస్ అంతిమంగా విజయం సాధించి సత్తా చాటింది. ఇపుడు దాన్నే అన్ని ఎన్నికల్లోనూ అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగానే 2024 ఎన్నికల వరకు ఇక బిజెపిని విడిచి పెట్టకుండా పరుగులు పెట్టిస్తూ టెన్షన్ పెట్టేయాలని కాంగ్రెస్ వ్యూహకర్తలు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే మోదీ తొమ్మిదేళ్ల పాలన ను ఎండగడుతూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
నిజానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో సంధించిన ప్రశ్నలనే ఇందులో చేర్చారు. ఈ ప్రశ్నలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని చూస్తున్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరిగిపోయిందని ప్రశ్నించారు. అదే సమయంలో ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనంతగా దుర్భరం కావడానికి కారణమేంటని మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఢిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా రైతులు చేసిన ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ చట్టాన్ని రద్దు చేసిన ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాలను ఇంత వరకు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలంటూ నిలదీస్తోంది కాంగ్రెస్. బిజెపి అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బిజెపి తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నా రైతుల ఆదాయాన్ని ఎందుకు పెంచలేకపోయింది అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీకి సన్నిహిత మిత్రుడైన ఆదానీ ప్రయోజనాలకోసమే లాభాల్లో ఉన్న ఎల్.ఐ.సి. ఎస్.బి.ఐ. లను పణంగా ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. పేదల సంక్షేమానికి సంబంధించిన పథకాలకు నిధులు తగ్గించి పేదల బతుకులు ఎందుకు దుర్భరం చేశారని ప్రశ్నించారు. కోవిడ్ మహమ్మారి దేశాన్ని పీడించిన సమయంలో వలస కూలీలను ఆదుకోడానికి ప్రభుత్వ పరంగా ఏమీ చేయకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. మొత్తానికి ఇటువంటి తొమ్మిది ప్రశ్నలను నరేంద్ర మోదీకి సంధించింది కాంగ్రెస్ పార్టీ. వీటికి మోదీ సమాధానం చెప్పాలని పట్టుబడుతోంది. లేదంటే కోట్లాది మంది భారతీయులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
గతంలో బిజెపి తమ రాజకీయ ప్రత్యర్ధులపై పోరాటాలకు ఎన్నికల ఏడాదుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేసేది. ఇపుడు కాంగ్రెస్ నౌ సాల్ నౌ సవాల్ పేరిట వినూత్న వ్యూహంతో దూసుకుపోతోంది. కర్నాటక ఫలితాలిచ్చిన బలంతో ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మణిపూర్, మిజోరం ఎన్నికల్లో బిజెపి కోలుకోలేని విధంగా షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2024 ఎన్నికల్లో బిజెపిని సాగనంపే మాస్టర్ ప్లాన్ కోసం అహోరాత్రులూ శ్రమిస్తోంది కాంగ్రెస్. అందులో భాగంగానే విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేప్రయత్నం చేస్తున్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ కూడా ఇపుడు విపక్షాల గూటిలో ఉన్నారు. బిజెపీయేతర పార్టీలను అనుసంధానం చేసేందుకు ఆయన దేశ వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఆ మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిసిన నితిష్ కుమార్ ఆ వెంటనే రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అంతకు ముందు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లో చర్చలు జరిపారు. నితిష్ కుమార్ పర్యటనలు సానుకూలంగానే ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాంగ్రెస్ విపక్షాలను కలుపుకుపోవాలని చూస్తోంటే బిజెపి విపక్షాలను విభజించే వ్యూహాలకు పదును పెడుతోంది.
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో విపక్షాలు టచ్ లో ఉన్నారని తెలవగానే ఒడిషా రాష్ట్రానికి అత్యంత అవసరమైన జగన్నాథ్ ఎయిర్ పోర్టు పనులకు కేంద్రం నుండి పూర్తి సహకారం అందిస్తున్నట్లు నరేంద్ర మోదీ భరోసా ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉన్న భాగస్వామ్య పక్షం డిఎంకే ఒక్కటే. కాకపోతే బిజెపిని గద్దె దింపడమే లక్ష్యంగా ఉన్న మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్ వంటి వారు బిజెపి ఓటమి కోసం కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్ధంగానే ఉన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ కు ముస్లిం ఓటర్లు గంపగుత్తగా మద్దతు పలికిన నేపథ్యంలో తెలంగాణాలో మజ్లిస్ పార్టీ కూడా కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు ఉండచ్చంటున్నారు. ప్రస్తుతం మజ్లిస్ పార్టీ పాలక పక్షం బి.ఆర్.ఎస్. తో పొత్తులో ఉంది. వచ్చే ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. గెలిచే అవకాశాలు లేకపోయినా కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అనిపించినా మజ్లిస్ పార్టీ తన పాత మిత్రుడు అయిన కాంగ్రెస్ తో జట్టు కట్టినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. తమిళనాట అన్నా డిఎంకే, మహారాష్ట్రలో శివసేన షిండే వర్గం, పంజాబ్ లో శిరోమణి అకాలీ దళ్ ఉత్తర ప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీలు బిజెపి పట్ల సానుకూలంగానే ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాము సంధించిన నౌ సాల్ నౌ సవాల్ ప్రచారాన్ని రాజకీయ పక్షాల్లోకీ తీసుకుపోవాలని కాంగ్రెస్ నిశ్చయంగా ఉంది.