రహదారులు రక్తమోడుతున్నాయి. దేశవ్యాప్తంగా అంతకంతకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసి రోడ్డున పడేస్తోంది. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిబిల్ స్కోర్ తరహాలోనే డ్రైవింగ్‌కూ స్కోరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యింది. రహదారి భద్రతలో భాగంగా కేంద్రం ఈ వినూత్న విధానాన్ని తెరపైకి తెచ్చింది. త్వరలోనే దీనిని పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీలో అమలు చేయాలనుకుంటోంది కేంద్ర రవాణాశాఖ. 2025 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. డ్రైవింగ్ స్కోర్ బాగున్నవారికి వాహన బీమాలో రాయితీలిస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా ధరలో రాయితీ ఇస్తారు. ఈమేరకు వాహనాల తయారీ సంస్థలు బీమా కంపెనీలతో చర్చలు జరుపుతోంది.
2021లో దేశంలో 4.12 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగ్గా అందులో 1.53 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 3.84 లక్షల మంది గాయపడ్డారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే 70 శాతం ప్రమాదాలు జరిగాయని జాతీయ నేర గణాంకాల సంస్థ విడుదల చేసిన నివేదిక చెబుతోంది. రహదారి భద్రత లక్ష్యాలు సాధించాలంటే డ్రైవర్లకు తగిన అవగాహన కల్పించడం వారిని నియంత్రించడం ప్రధానమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ క్రమశిక్షణను ఎప్పటికప్పుడు అంచనా వేసే వ్యవస్థను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. రహదారి భద్రతా ప్రణాళిక 2.0 కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ద్విచక్ర వాహనాలు కార్లు ఇతర భారీ వాహనాల డ్రైవర్ల డిసిప్లైన్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానాలు రోడ్డు ప్రమాదాలకు కారణమైన సందర్భాలు పోలీసులు నమోదు చేసిన కేసులు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా డ్రైవింగ్ క్రమశిక్షణకు స్కోర్ ఇస్తారు.
రెండో దశలో కార్లు ఎస్‌యూవీలు ఇతర భారీ వాహనాల్లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంను ఏర్పాటు చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడే ఏడీఏఎస్ వ్యవస్థ కోసం కాస్త అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొనుగోలు చేసిన వాహనాల యజమానులు కూడా ఏడీఏఎస్‌ను తమ వాహనాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇది డ్రైవర్ నావిగేషన్‌కు సహకరిస్తుంది. అలాగే డ్రైవింగ్ సీటులో ఎవరు ఉన్నారో రికార్డు చేస్తుంది. తద్వారా క్రమశిక్షణారహితంగా వాహనం నడిపినప్పుడు, ప్రమాదానికి గురైనప్పుడు ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఏడీఏఎస్‌ను ఇప్పటికే విద్యుత్ వాహనాల్లో ప్రవేశపెట్టారు. త్వరలో పెట్రోల్, డీజీల్ వాహనాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏడీఏఎస్ సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని డ్రైవింగ్ క్రమశిక్షణ స్కోర్‌ను నిర్ణయిస్తారు.