అమృత్‌పాల్‌సింగ్. ఒకప్పుడు భింద్రన్‌వాలే తర్వాత పంజాబీ సమాజంలో అంతగా పాపులర్ అయిపోయింది ఈ పేరు. పంజాబీలకు అతనో హీరో కానీ చట్టానికి అతనిప్పుడు ఓ పెద్ద విలన్. ఇలాగే వదిలేస్తే ఉగ్రమూకల్ని ప్రేరేపించే విదేశీ ప్రేరేపిత మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్ట్. సిన్మాల లెవల్లో ఛేజింగులు జరుగుతున్నాయి కానీ ఎక్కడో చోట కనిపిస్తున్నాడు మెరుపుతీగలా మాయమైపోతున్నాడు. దీంతో అసలతను భారత్‌లోనే ఉన్నాడా లేకపోతే ఈపాటికే విదేశాలకు పారిపోయాడా అన్నదానిపై మిస్టరీ కొనసాగుతోంది.
ఖరీదైన కారునుంచి ఓ డొక్కు కారులోకి మారిపోతాడు. ఎక్కడోచోట కారుదిగేసి టూవీలర్‌మీద తుర్రుమంటాడు. సిక్కు సమాజంకోసం తుపాకీ పట్టిన వీరుడిలా అతన్ని కొందరు చూస్తున్నారు. అందుకే వేలమంది పోలీసులు వెతుకుతున్నా ప్రతీ ప్రాంతాన్నీ జల్లెడపడుతున్నా అతనికి విడిది దొరుకుతోంది. పోలీసుల కళ్లుగప్పి మారువేషాల్లో తిరుగుతున్నాడు అమృత్‌పాల్‌సింగ్. నేపాల్ మీదుగా కెనడాకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించిన నిఘా వర్గాలు డేగకన్ను పెట్టినా అతను దొరికేదాకా అనుమానమే.
ఖలిస్తాన్ వేర్పాటుఉద్యమాన్ని మళ్లీ పెంచి పోషిస్తున్నాడు అమృత్‌పాల్. సిక్కుల కోసం ప్రత్యేక దేశమే లక్ష్యంగా భింద్రన్‌వాలే అడుగుజాడల్లో నడుస్తున్నాడు. ప్రత్యేక దేశంకోసం అధికారిక కరెన్సీ జెండాను పాస్‌పోర్టు నమూనాని కూడా అమృత్‌పాల్ సిద్ధం చేశాడని తెలియటంతో నిఘావర్గాలు అప్రమత్తం అయ్యాయి. మార్చి 16నుంచి అమృత్‌పాల్ కోసం వేట సాగుతూనే ఉంది. ఇప్పటికే 250 మంది ఖలిస్తాన్ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని అనుచరగణానికి భారీగా ఆయుధాలు ఎక్కడినుంచి వచ్చాయో ఆరాతీస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్‌ఐ అమృత్‌పాల్‌కి సహాయపడుతున్నట్లు గుర్తించారు. అమృత్‌పాల్ దొరుకుతాడా దేశసరిహద్దులు దాటేసి ఉగ్రవాదాన్ని ప్రేరేపించబోతున్నాడా.