కొఠియాగ్రామాలు. ఆంధ్రా-ఒడిశా మధ్య తరచూ ఉద్రిక్తతలకు కారణమవుతోంది ఈ వివాదం. శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లోని దాదాపు 34 గ్రామాలు ఒడిశా రాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. వీటిని కొఠియా గ్రామాలని పిలుస్తుంటారు. ఈ గ్రామాల్లో దాదాపు పదివేలదాకా జనాభా ఉంది. కొండ కోనల్లోని ఈ గ్రామాలు తమవంటూ ఎప్పట్నించో ఏపీతో గొడవపడుతోంది ఒడిశారాష్ట్రం. ఏజెన్సీలా ఉండే ఆ గ్రామాలకోసం ఒడిశా అంతగా ఆరాటపడటానికి కారణం అక్కడున్న సహజనవరులు ఖనిజనిక్షేపాలు. ఆ గ్రామాల్లో పర్యటించిన ఏపీ అధికారులను అడ్డుకోవడమే కాదు కొన్ని సందర్భాల్లో దాడికి కూడా ఒడిశా యంత్రాంగం ప్రయత్నించింది.
కొఠియా గ్రామాల వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో ఏపీ కూడా సంయమనం పాటిస్తోంది. కానీ ఆ విచక్షణ ఒడిశాకు లేకపోయింది. సామాన్య ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారంటే అర్ధముంది. కానీ ప్రభుత్వ యంత్రాంగమే కయ్యానికి కాలుదువ్వేలా వ్యవహరిస్తోంది. చివరికి ఇలాంటి సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలని న్యాయస్థానం తీర్పు వచ్చేదాకా గొడవలొద్దనిచెప్పాల్సిన కేంద్రమంత్రి కూడా పక్షపాతంతో ఓ ప్రాంతానికి కొమ్ముకాస్తున్నారు. ఆంధ్రానేతలు అధికారులు గో బ్యాక్ అంటూ స్వయానా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒడిశాకు చెందిన కేంద్రమంత్రి స్వరాష్ట్రంపై ప్రేమ ఉండొచ్చుగానీ తాను కేంద్రమంత్రినన్న విషయాన్నిమరిచిపోవడమే బాధాకరం.
ఒడిశాలో రెండు దశాబ్ధాలుగా బీజేడీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలనుకుంటోంది. అదే సమయంలో ఎలాగైనా ఒడిశాలో పాగా వేయాలనుకుంటోంది బీజేపీ. వచ్చే ఏడాది ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటంతో ఎక్కడ అవకాశమున్నా ఆ పార్టీ వేలుపెట్టేస్తోంది. ఇప్పుడు కేంద్రమంత్రిగారి అత్యుత్సాహం కూడా అందులో భాగమే. ఒడిశా ప్రజలను ఆకట్టుకోవడానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హద్దు దాటేశారు. కొఠియా గ్రామాలకు వస్తున్న ఆంధ్రా నేతలు గో బ్యాక్ అంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ ఒక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని ఏపీ మంత్రి రాజన్నదొర నిలదీశారు. సుప్రీంకోర్టులో స్టేటస్ కో ఉన్నప్పుడు కొఠియా గ్రామాలపై రెండు రాష్ట్రాలకు హక్కులు ఉంటాయి. అలాంటప్పుడు కేంద్రమంత్రి ఆంధ్రా నేతలను అధికారులను గో బ్యాక్ అనడం కోర్టు ధిక్కరణకిందికే వస్తుంది. కొఠియా గ్రామాలు ఒడిశావేనని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కి గతంలో ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు. అయితే సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో ఒడిశా సీఎం కేంద్రమంత్రి మాటలను పట్టించుకోలేదు. అయినా సెంటిమెంట్‌ని రెచ్చగొట్టేందుకు కేంద్రమంత్రి రెచ్చిపోయారు. అస్సాం మిజోరం రాష్ట్రాల మధ్య ఘర్షణలతో చివరికి ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటిదాకా కేవలం వాగ్వాదాలకే పరిమితమైన ఏపీ ఒడిశా వివాదాన్ని మరింత పెంచేలా ఉన్నాయి కేంద్రమంత్రి వ్యాఖ్యలు. ఆరు దశాబ్ధాలుగా ఎడతెగని సమస్యకు అత్యున్నత న్యాయస్థానం ఓ పరిష్కారం చూపనంత కాలం ధర్మేంద్రప్రధాన్ లాంటి నేతల రాజకీయం నడుస్తూనేఉంటుంది.