బీజేపీపై భీకరయుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర పార్టీలను కలుపుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అందర్నీ పిలుస్తున్నారు. కంటి వెలుగు లాంటి పథకం ప్రారంభోత్సవానికే అందర్నీ పిలిచారు. సెక్రటేరియట్ ఓపెనింగ్‌ను ఓ రేంజ్ లో చేయాలని ప్లాన్ చేసుకున్నారు. నాలుగైదు రాష్ట్రాల సీఎంలు వచ్చేందుకు అంగీకరించారు. సభ జరగలేదు కానీ జరిగి ఉంటే కేసీఆర్ బలం తేటతెల్లమయ్యేదే. ఆయన అందర్నీ పిలుస్తున్నారు కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఇతరులు జరిగే పోరాటంలో పాల్గొనాలని ఆయనను మాత్రం పిలవడం లేదు. ఇదే చాలా మందిని పిలవడం లేదు. దీనికి తాజా సాక్ష్యం స్టాలిన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా చెన్నైలో నిర్వహించిన సభకు కేసీఆర్ కు ఆహ్వానం అందకపోవడమే.
జాతీయ రాజకీయాలు విచిత్రంగా ఉంటున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ కోణంలో ఈ రాజకీయాలు మరింత విచిత్రంగా మారుతున్నాయి. బీజేపీపై ఆయన ఎడతెరిపి లేని యుద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అలాగే ప్రకటిస్తున్నారు. చివరికి ఆయన పార్టీ పేరు కూడా మార్చేశారు. బీజేపీ పై పోరాడుతున్నా తన సభలు సమావేశాలకు రావాలని బీజేపీ వ్యతిరేక పార్టీలను పిలిస్తే ఆయా పార్టీల ప్రతినిధులు వస్తున్నారు. కానీ వారు బీజేపీకి వ్యతిరేకంగా సభలు పెడితే మాత్రం పిలవడం లేదు. స్టాలిన్ పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడులో అన్ని ప్రాంతీయ పార్టీల నేతలతో కలసి బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రమే కాదు అందరూ వచ్చారు. కాన తెలంగాణ సీఎం కేసీఆర్ రాలేదు. రాలేదు అనడం కన్నా స్టాలిన్ పిలువలేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు నిజంగానే ఆహ్వానం లేదు. కానీ కేసీఆర్ ఇటీవల తన సెక్రటేరియట్ ఓపెనింగ్ చేయాలనుకుని ఏర్పాటు చేసిన బహిరంగసభకు స్టాలిన్ ను పిలిచారు. ఆయన వచ్చేందుకు అంగీకరించారు. కానీ స్టాలిన్ మాత్రం కేసీఆర్ ను పిలువలేదు.
తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, మల్లికార్జున్ ఖర్గే సహా చాలా మంది నేతలు వచ్చారు. మామూలుగా కరుడు గట్టిన బీజేపీ వ్యతిరేకతతో ఉన్న పార్టీలు కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీరందరూ కేసీఆర్ పిలిచినా వస్తున్నారు. అంటే అందరూ కలిసి పోరాడుతున్నప్పుడు కేసీఆర్ ను మాత్రం ఎందుకు దూరం పెడుతున్నారనేది కీలకమైన ప్రశ్న. కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో సీరియస్ నెస్ లేదా లేకపోతే ఆయనను రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో నమ్మడం లేదా అన్నది అంతు చిక్కని విషయంగా మారింది. కేసీఆర్ తాను నిర్వహిస్తున్న సభలకు వస్తున్న నేతలంతా తనతో కలిసి పని చేస్తారనే ఓ అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారు. దీన్నే దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలకు కూడా ఉపయోగించుకుంటున్నారు. కానీ వారు మాత్రం కేసీఆర్‌తో కలిసి పని చేసే అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదు. కేసీఆర్ తో సఖ్యతగా ఉంటున్నారు. ఎప్పుడు పిలిచినా వస్తున్నారు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేసే పోరాటంలో కలుస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే అలాంటి అవకాశం లేదన్న సంకేతాలు పంపుతున్నారు.
స్టాలిన్ పుట్టిన రోజు వేడుకల్లో కేసీఆర్ కనిపించకపోవడానికి ఆహ్వానమో మరొకటో కారణం కాదని కాంగ్రెస్ పార్టీనే అన్న వాదన కూడా వినిపిస్తోంది. కేసీఆర్ తీవ్రమైన బీజేపీపై వ్యతిరేకత చూపిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పై సానుకూలత చూపించడం లేదు. విమర్శలు చేస్తున్నారు. రెండు పార్టీలకు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అంటున్నారు. అందుకే కాంగ్రెస్ తో వేదికపై కనిపించలేరు. ఈ కారణంగా సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారు. ఆయనను ఇబ్బంది పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో స్టాలిన్ లాంటి నేతలు పిలువడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఇంకా అన్ని పార్టీలతో కలవలేకపోతున్నారని అనుకోవచ్చు. అయితే కేసీఆర్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ను నిలబెట్టగలనన్న ధైర్యంతో ఉన్నందునే ఇలాంటి సమావేశాలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలంటున్నారు.
ఎలా చూసినా కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఫ్రెండ్లీ ఫైట్ తరహాలోనే చాలా రాజకీయ పార్టీలతో కార్యకలాపాలు నిర్వహించాల్సి రావొచ్చు. ఆయన తో ఎవరూ కలవరు. కానీ సఖ్యతగా ఉంటారు. చివరికి వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ వారితో కలిసే పరిస్థితి ఏర్పడవచ్చనేది ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకుల అంచనా.