గుజరాత్‌లో ఆమ్‌ఆద్మీ పంజాబ్‌ ఫార్ములా

By KTV Telugu On 29 October, 2022
image

సీఎం ఎవరో మీరే చెప్పండి..కేజ్రీ ఆఫర్‌!

కేజ్రీవాల్‌ రాటుదేలుతున్నాడు. మరక కూడా మంచిదనుకుంటున్నాడు. చెంపదెబ్బ సెంటిమెంట్‌గా భావిస్తున్నాడు. అవతలిపార్టీ చేయలేనిది ప్రత్యర్థులకు సాధ్యం కానిది చేసి చూపించాలనుకుంటున్నాడు. పంజాబ్‌ వండర్‌ని గుజరాత్‌లో రిపీట్‌ చేయాలనుకుంటున్నాడు. మోడీ ఇలాకాలో కేజ్రీవాల్‌ మ్యాజిక్‌ చేయగలడో లేదోగానీ తన మార్క్‌ నిర్ణయాలు మాత్రం తీసుకుంటున్నాడు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఎవరుండాలనే విషయంలో కేజ్రీవాల్‌ ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. సర్వేలో ఎక్కువమంది భగవంత్ మాన్‌కే మొగ్గుచూపటంతో ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న గుజరాత్‌ రాష్ట్రంలో కూడా కేజ్రీవాల్‌ పంజాబ్‌ ఫార్ములానే ఫాలోఅవుతున్నారు. సీఎం అభ్యర్థిని ఎన్నుకునే అవకాశాన్ని ప్రజలకే ఇచ్చారు. గుజరాత్‌లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరుంటే బాగుంటుందో నవంబరు 3లోగా చెప్పాలని ఫోన్ నంబర్, ఈమెయిల్‌ ఇచ్చారు.

బీజేపీ ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదు. ఒకరిని ప్రకటిస్తే మరొకరు వ్యతిరేకించి అసలుకే మోసమొస్తుందన్న భయం. ఏడాదిక్రితమే విజయ్‌రూపానీని తప్పించి భూపేంద్రపటేల్‌ని బీజేపీ అధినాయకత్వం సీఎంని చేసింది. సుదీర్ఘకాలంగా పార్టీ అధికారంలో ఉండటంతో ఏ ప్రయోగం చేసినా చేతులు కాలే ప్రమాదం ఉంది. బీజేపీకున్న ఈ వీక్‌పాయింట్‌ని కేజ్రీవాల్‌ క్యాష్‌ చేసుకుంటున్నారు. బీజేపీలా కాదు.. సీఎం అభ్యర్థిని ఎంపిక చేసుకునే విషయం ప్రజలకే వదిలేస్తామని చెబుతున్నారు. ఎలాగైనా గుజరాత్‌లో పాగా వేయాలని పట్టుదలతో ఉన్న కేజ్రీవాల్‌ హిందూ ఓటుబ్యాంక్‌ని ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సీఎం అభ్యర్థి విషయంలో కూడా ప్రజాభిప్రాయమే పార్టీ నిర్ణయమంటూ ప్రత్యర్థులను డిఫెన్స్‌లో పడేస్తున్నారు.