లిక్కర్ స్కామ్‌లో మా పాత్ర లేదని ఖండించవచ్చు. గోరంతని కొండంతగా చూపిస్తున్నారని విమర్శించొచ్చు. రాజకీయ కక్షతోనే కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపణలు చేయొచ్చు కానీ ఇంత దూరం వచ్చాక ఇన్ని చార్జిషీట్‌లు రిమాండ్ రిపోర్టుల తర్వాత కూడా లిక్కర్ స్కామ్ అనేదే ఓ కల్పితమంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. బెయిల్ కూడా రాకుండా తన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్నా కేజ్రీవాల్ అదే మాటమీదున్నారు. 9గంటలు సీబీఐ విచారణ తర్వాత కూడా ఆయన అదే మాట చెబుతున్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ అధికారులు సుమారు 9గంటల పాటు విచారించారు. కేజ్రీవాల్‌ని విచారించినంత సేపు బయట ఆమ్ఆద్మీ నేతలు నిరసన కొనసాగించారు. విచారణ తర్వాత కేజ్రీవాల్ బయటికొచ్చాకే వాతావరణం కాస్త చల్లబడింది. కేజ్రీవాల్ చెప్పినదాని ప్రకారం సీబీఐ ఆయన్ని 56 ప్రశ్నలు అడిగింది. ఎంతయినా మాజీ ఐఆర్ఎస్ అధికారి కదా సీబీఐ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పొచ్చారు కేజ్రీవాల్. కానీ ఇక్కడితోనే ఆయన పాత్ర ముగుస్తుందా మరిన్ని ఆధారాలతో సీబీఐ ఉచ్చు బిగిస్తుందా అన్నది ఇప్పుడే చెప్పలేం.
మద్యం కుంభకోణంలో తప్పుడు ఆరోపణలతో కత్తర్ ఇమాందార్ పార్టీని అంతం చేయాలనుకుంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ అనేదే పూర్తి కల్పితమని మరోసారి బల్లగుద్ది చెబుతున్నారు. కోర్టుల్లో తప్పుడు ఆధారాలు సమర్పిస్తున్నందుకు సీబీఐ ఈడీపై కేసులు పెడతామని కేజ్రీవాల్ హెచ్చరించారు. సీబీఐ కేజ్రీవాల్‌ని సాక్షిగానే విచారణకు పిలిచింది. సీసీ కెమెరా పర్యవేక్షణలో సీఆర్‌పీసీ 161 కింద కేజ్రీవాల్ స్టేట్‌మెంట్‌ని రికార్డు చేశారు. లిఖితపూర్వకంగా కూడా సీబీఐ అధికారులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. కేసీఆర్‌తో ఆయనకున్న సంబంధాలపై పంజాబ్ ఎన్నికలకు ఫండింగ్‌పైనా సీబీఐ ప్రశ్నలు అడిగిందని సమాచారం. కేజ్రీవాల్ విచారణతో సీబీఐ ప్రధాన కార్యాలయం దగ్గర దాదాపు వెయ్యిమంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించారు. కేజ్రీవాల్‌ని విచారించినంత సేపు సీబీఐ కార్యాలయం దగ్గర పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ ఆప్ నేతలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్ నిరసనకు దిగారు. సీబీఐ విచారణకు హాజరైన తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు.