అసలే ఎన్నికల కాలం. సమయం ముంచుకొస్తోంది. ఇలాంటి సమయంలో ఏ పార్టీ అయినా ప్రత్యర్థుల చేతికి చిక్కకుండా జాగ్రత్తగా మసులుకోవాలి. మరీ ముఖ్యంగా అధికార పార్టీ అయితే ఆచితూచి అడుగులు వేయాలి. ఏ చిన్న తప్పు చేసినా అది ఎన్నికల్లో మేకవుతుంది. అధికార పీఠం చేజారిపోయే పరిస్థితిని తీసుకొస్తుంది. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా ఈ ఏడాదిలో రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అసలే రాజస్థాన్ కాంగ్రెస్‌లో కిరికిరి నడుస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. కాంగ్రెస్ పార్టీలోని విభేదాలను అపోజిషన్ తమకు అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీకి మరో ఆయుధాన్ని వదిలారు. ఆఖరి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఘోర తప్పిదం జరిగిపోయింది. ముఖ్యమంత్రి గత బడ్జెట్‌ను చదివి వినిపించారు.
రాజస్థాన్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గెహ్లాట్ పప్పులో కాలేశారు. పాత పద్దును ప్రవేశపెట్టి ఏకధాటిగా 7 నిమిషాల పాటు చదువుకుంటూ పోయారు. గ్యాలరీలో కూర్చున్న అధికారులు ఓ మంత్రి దృష్టికి తీసుకురావడంతో అస్సలు విషయం తెలిసింది. మంత్రి అలర్ట్ చేయడంతో నాలుక కరుచుకున్న అశోక్ గెహ్లాట్ కొత్త బడ్జెట్ చదివారు. అయినప్పటికే అప్పటికే కాచుకు కూర్చున్న ప్రతిపక్ష సభ్యులు గొడవగొడవ చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. కాసేపు అక్కడే బైఠాయించారు. సీఎంకు వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. సభా నిబంధనలు పాటించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దాంతో సభాపతి సీపీ జోషి సభను అరగంట పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.
గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. దీంతో ఈ బడ్జెట్ పై ఆసక్తి నెలకొంది. ఏ పార్టీ ఆఖరి బడ్జెట్ అయినా ఘనంగా ప్రవేశపెడుతోంది. అది అమలు చేసే సంగతి పక్కనబెడితే అదంతా అంకెల గారడీ అనే మాట చెప్పేందుకు ఎలాగూ అపోజిషన్ రెడీగా ఉంటోంది. అయితే ఏకంకా సీఎం గత పద్దు చదివేసి ప్రత్యర్థులకు దొరికిపోయారు. అశోక్ గెహ్లాట్ ఆర్థిక శాఖను కూడా తన వద్ద ఉంచుకోవడంతో ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిండు సభలో నవ్వులపాలయ్యారు. గెహ్లాట్ పొరపాటైందని క్షమాపణలు చెప్పినప్పటికీ బీజేపీ ఈ వ్యవహారాన్ని హైలెట్ చేస్తోంది. గతేడాది బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్న సీఎం గెహ్లాట్ వీడియోలను పలువురు బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముఖ్యమంత్రి అందునా స్వయంగా ఆర్థికశాఖ మంత్రి అయ్యుండి రాష్ట్రానికి తలవంపులు తెచ్చారంటూ కమలం నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని రచ్చరచ్చ చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు సీఎం చేతుల్లో ఎంత భద్రంగా ఉందో ఊహించుకోవచ్చు అంటూ బీజేపీ మాజీ సీఎం వసుంధరా రాజే ప్రజల సింపతీ పొందే ప్రయత్నం చేశారు.