అక్క ప్రాణభిక్షపెట్టమని నేరస్తులు లొంగిపోవాల్సిందే. ప్రాణాలతో వదిలేస్తే బుద్ధిగా బతుకుతామని ఎంత పెద్ద డాన్ అయినా కాళ్లబేరానికి రావాల్సిందే. లేదంటే అరెస్టులు కోర్టులు వాయిదాలు ఎప్పుడో పడే శిక్షలు అవన్నీ ఏమీ ఉండవు. ఎన్కౌంటర్ జరుగుతుంది. కొంతమందికి బుల్లెట్‌గాయాలతో ఎటూపోలేక చిక్కుతుంటారు. మరికొందరు నేరాల తీవ్రతను బట్టి స్పాట్లోనే పరలోకానికి వెళ్లిపోతారు. యోగి యూపీ ముఖ్యమంత్రి అయినప్పట్నించీ అదే రూలింగ్. ఇళ్లమీదికి బుల్డోజర్ వస్తుంది. లేదంటే బుల్లెట్ సమాధానం చెబుతుంది. కరడుగట్టిన నేరస్తులకు ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు మరో ఆప్షన్ లేదంతే. తన హవా నడిచినన్నాళ్లూ పాలకులకు ప్రభుత్వ యంత్రాంగానికి చెమటలు పట్టించాడు మాజీ ఎంపీ మాఫియాడాన్ అతిఖ్ అహ్మద్. కానీ ఇప్పుడు తన వంతు ఎప్పుడొస్తుందోనని రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు. తనలాగే తుపాకీ పట్టిన కొడుకు ఎన్‌కౌంటర్‌తో ఆ మాఫియా డాన్ కుప్పకూలిపోయాడు. అతిఖ్ అహ్మద్ కొడుకు యూపీ పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయాడు.
ఉమేశ్‌పాల్ మర్డర్ కేసులో వాంటెడ్‌గా ఉన్న అసద్‌ని మరో నిందితుడిని ఝాన్సీలో పోలీసులు కాల్చిచంపారు. అహ్మదాబాద్ సబర్మతి జైలు నుంచి అతిఖ్ అహ్మద్‌ని ప్రయాగ్‌రాజ్‌కు తరలించిన రోజే అతడి కుమారుడు ఎన్కౌంటర్ అయ్యాడు. తన పనైపోయిందని తన కుటుంబసభ్యుల జోలిక వెళ్లొద్దని అతిఖ్ అహ్మద్ బతిమాలుకున్నా చట్టం తనపని తాను చేసుకుపోయింది. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో సాక్షిగా ఉన్న ఉమేష్‌పాల్‌ని ఫిబ్రవరి 27న ప్రయాగ్‌రాజ్‌లో దుండగులు కాల్చిచంపారు. ఉమేష్పాల్తో పాటు అతని ఇద్దరు గన్మెన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. రాజుపాల్ హత్యకేసులో నిందితుడిగా ఉన్న అతీఖ్ అహ్మద్ మనుషులే ఈ దారుణానికి పాల్పడటంతో యోగి సర్కారు సీరియస్‌గా తీసుకుంది. ఈ సంఘటన జరిగిన కొన్నిరోజుల్లోనే ఇద్దరు నిందితుల ఎన్కౌంటర్ జరిగింది. ఆ హత్యాకాండలో మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న అతీఖ్ కొడుకు అసద్‌తో పాటు మరో షూటర్ని ఎన్కౌంటర్చేసి మాఫియా వ్యవహారాలపై మరోసారి ఉక్కుపాదం మోపారు యూపీ పోలీసులు. కొడుకు ఎన్‌కౌంటర్‌తో తన వల్లే ఇదంతా జరిగిందంటూ కోర్టు హాలులోనే అతీఖ్ అహ్మద్ కుప్పకూలిపోయాడు. కోర్టులో హాజరుపరిచిన అతీఖ్ అహ్మద్‌పై కొందరు న్యాయవాదులు చెప్పులు విసిరారు.
ఉమేష్‌పాల్‌ని చంపిన నిందితుల ఎన్‌కౌంటర్‌తో తమ కుటుంబానికి న్యాయం జరిగిందని ఆయన కుటుంబం స్పందించింది. తన కొడుకు చావుకు ఈ ఎన్కౌంటర్ నివాళి అంటూ ఉమేష్‌పాల్ తల్లి స్పందించారు. అతని భార్య సీఎం యోగికి కృతజ్ఞతలు తెలిపింది. అయితే అతీఖ్ అహ్మద్ కొడుకు ఎన్కౌంటర్ బూటకమని ఆరోపించారు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. సమస్యలనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే యోగి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పుతోందన్నది ఆయన ఆరోపణ. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ యూపీ ఎన్కౌంటర్లపై న్యాయవిచారణకు డిమాండ్ చేశారు. నేరస్తుల పేరుతో ముస్లింలని ఎన్కౌంటర్ చేయడం బీజేపీ ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని ఆరోపించారు. నేరస్తులను తామే శిక్షిస్తామని యూపీ పోలీసులు చెబుతున్నారని అలాంటప్పుడు ఇక కోర్టులు జడ్జీల అవసరం ఏముందన్నది ఒవైసీ ప్రశ్న. నిందితులకు భయం ఉండాల్సిందే. నేరాలకు పాల్పడాలంటే ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. కానీ నేరాల్ని కట్టడిచేయడానికి మాఫియాని అదుపు చేయడానికి ఎన్కౌంటర్లే మార్గమా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే.